
TFI | రేవంత్ ప్రభుత్వం ఇప్పుడే నిద్రలేచిందా ?
సినిమా పాలసీకి చెడ్డపేరు వస్తోందన్న విషయం రేవంత్ కు ఇపుడు గుర్తుకొచ్చిందా ?
ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. గడచిన 17 రోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మె రేవంత్(Revanth) కు కనబడలేదా ? సడెన్ గా బుధవారం నిద్రలో నుండి మేల్కొన్నట్లుగా సమ్మెను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. వేతనాలు పెంచాలనే డిమాండుతో పాటు షెడ్యూల్స్ తదితర సమస్యల పరిష్కారాన్ని కోరుతు ఫిల్మ్ ఫెడరేషన్(Telugu Film Federation) ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. ఈవిషయం రేవంత్ కు ఇప్పటివరకు తెలీదా ? సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy) ఏమి చేస్తున్నట్లు ? తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) ఏమి చేస్తున్నారు ? ఈయన సినిమా ఫీల్డ్(Telugu Field Industry) మనిషే కదా ?
నిర్మాతలమండలి ఆధ్వర్యంలో ఫెడరేషన్ నేతలతో చర్చలు జరిగినా ఉపయోగం లేకపోయింది. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత లాభంలేదని అనుకుని చివరకు ఫెడరేషన్ నేతలు, నిర్మాల మండలి ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి జోక్యాన్ని కోరుకున్న విషయం రేవంత్ కు తెలీదా ? ఇపుడు హఠాత్తుగా మేల్కొని హైదరాబాద్ ఇమేజి దెబ్బతింటోందని, తెలంగాణను సినిమా హబ్ గా మార్చాలని చేస్తేన్న ప్రయత్నాలు నీరుగారుతున్నాయని, సినిమా పాలసీకి చెడ్డపేరు వస్తోందన్న విషయం రేవంత్ కు ఇపుడు గుర్తుకొచ్చిందా ? ఫెడరేషన్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్టులకు చెందిన సుమారు 14వేలమంది కార్మికులు 17రోజులుగా షూటింగులకు హాజరవటంలేదు. ఫలితంగా సినిమా షూటింగులన్నీ మూలనపడ్డాయి.
సమ్మెచేయటానికి ముందే ఫెడరేషన్ నేతలు ఇటు ప్రభుత్వానికి అటు ఫిలించాంబర్ కు సమస్యల పరిష్కారంపై విజ్ఞప్తిచేశారు. అయితే అప్పట్లో వాళ్ళ విజ్ఞప్తులను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఫలితంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె మొదలైంది. సమ్మెకు దిగేముందే ఫెడరేషన్ నేతల విజ్ఞప్తులను దిల్ రాజు, మంత్రి కోమటిరెడ్డి సీరియస్ గా తీసుకునుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చేదికాదు. ప్రభుత్వానికి-సినిమా ఫీల్డుకు మధ్య వారధిగా ఉంటారని కదా దిల్ రాజును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు రేవంత్ ఛైర్మన్ను చేసింది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అన్న సామెతలో చెప్పినట్లుగా 17 రోజుల సమ్మె కారణంగా వందల కోట్ల రూపాయలు నిర్మాతలకు నష్టాలు జరిగి, కార్మికులు కూడా డైలీ వేతనాలను కోల్పోయిన తర్వాత ఇపుడు రేవంత్ ప్రభుత్వ నిద్రలో నుండి మేల్కొనటమే ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇన్నిరోజులకు అయినా రేవంత్ స్పందించారు అదే సంతోషం అని సరిపెట్టుకోవాల్పిందే.