ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి సస్పెన్షన్ కు రంగం సిద్ధమైందా ?
x
BRS MLA Padi Kaushik Reddy

ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి సస్పెన్షన్ కు రంగం సిద్ధమైందా ?

కౌశిక్ ను గనుక సస్పెండ్ చేయకపోతే అసెంబ్లీ ఆవరణలోనే నిరాహర దీక్ష చేస్తామని స్పీకర్ కు చెప్పటం సంచలనంగా మారింది


బీఆర్ఎస్ లో హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి పెద్ద సమస్యగా తయారవుతున్నాడు. అందుకనే ఎంఎల్ఏ సస్పెన్షన్ కు రంగం సిద్ధమైనట్లు కాంగ్రెస్ నేతల సమాచారం. పాడి(Padi Kaushik Reddy)ని ఎంఎల్ఏగా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎంఎల్ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎంఎల్ఏ డాక్టర్ మేడిపల్లి సత్యం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును కోరారు. అలాగే ఎంఎల్ఏపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కౌశిక్ ను గనుక సస్పెండ్ చేయకపోతే అసెంబ్లీ ఆవరణలోనే నిరాహర దీక్ష చేస్తామని స్పీకర్ కు చెప్పటం సంచలనంగా మారింది. అలాగే కౌశిక్ ను బీఆర్ఎస్ నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేసినా అదేమంత చెల్లుబాటు అయ్యే విషయంకాదు.

అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే పాడి పెద్ద సమస్యగా మారాడు. పార్టీ అధినేత కేసీఆర్(KCR) లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గుడ్ లుక్సులో ఉండాలనో లేకపోతే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) అంటే నిలువెల్లా ధ్వేషమో తెలీదు కాని నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు. తాజాగా రేవంత్ ను ఉద్దేశించి మాట్లాడుతు హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించాడు. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో వేలాది ఫోన్లను ట్యాప్(Telephone Tapping) చేయించింది వాస్తవమని ఇప్పటికే బయటపడింది. అందులో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించటం ద్వారా కేటీఆర్ వారిని బ్లాక్ మెయిల్ చేసి తనదారిలోకి తెచ్చుకునేవారని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.

తొందరలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ట్యాపింగులో సినీ సెలబ్రిటీలకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీచేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అప్పుడు ఎవరి బాగోతాలు ఏమిటనేది బయటపడతాయి. అయితే ఈలోపు అలాంటి ఆరోపణలనే రేవంత్ కు వ్యతిరేకంగా కౌశిక్ చేశాడు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడని అని చెప్పిన పాడి అక్కడితో ఆగలేదు. ప్రతిరోజు రేవంత్ రాత్రయితే ఒక హీరోయిన్ ఇంటికి వెళతాడని ఆరోపించాడు. దాంతో కాంగ్రెస్ నేతలకు బాగామండి దాదాపు 12 పోలీసుస్టేషన్లలో కౌశిక్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో 4200 ఫోన్లు ట్యాప్ చేశారన్నది ఆధారాలతో సహా బయటపడింది. ట్యాపింగులో పాల్గొన్న పోలీసు అధికారులే ఈవిషయాన్ని సిట్ దర్యాప్తులో చెప్పటంతో పాటు కోర్టులో అఫిడవిట్లలో కూడా అంగీకరించారు. మరి రేవంత్ ప్రభుత్వం మంత్రులు, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేస్తోందనే కేటీఆర్, కౌశిక్ ఆరోపణలకు ఆధారాలు ఏమున్నాయి ? వీళ్ళ వాదన ఎలాగుందంటే తమ ఆరోపణలే ఆధారాలు అన్నట్లగా కేటీఆర్, కౌశిక్ వాదిస్తున్నారు. అందుకనే కౌశిక్ పై ఫిర్యాదులు చేయటమే కాకుండా ఎంఎల్ఏగా సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో పెరిగిపోతోంది. కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో గోలచేస్తాడు, బయట గొడవలకు దిగుతుంటాడు, ఫిరాయింపు ఎంఎల్ఏలతో కయ్యానికి కాలుదువ్వుతాడు, రేవంత్ పైన నిరాధార ఆరోపణలతో రెచ్చిపోతుంటాడు. ఏ కోణంలో చూసినా కౌశిక్ పెద్ద సమస్యగానే మారాడు అని అర్ధమైపోతోంది. ఎందుకని ఎంఎల్ఏ ఈవిధంగా ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్ధంకావటంలేదు.

గతంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధితో కౌశిక్ పెద్ద గొడవైంది. గాంధీని ఎంఎల్ఏ నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మరో ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ ను పాడి కొట్టబోయాడు. ఒకరితో మరొకరు కలబడితే మధ్యలో కొందరు సర్దిచెప్పి ఇద్దరినీ విడదీశారు. వెనుకనుండి ఎవరైనా చెప్పి కౌశిక్ తో ఇలాంటి గొడవలు చేయిస్తున్నారో లేకపోతే ఎంఎల్ఏ స్వభావమే ఇంతా అన్నదే అర్ధంకావటంలేదు. కారణాలు ఏవైనా ఇప్పటికే కౌశిక్ పై సుమారు 20 కేసులు నమోదయున్నాయి.

కాంగ్రెస్ ఎంఎల్ఏల పట్టుదల చూస్తుంటే కచ్చితంగా కౌశిక్ పైన సస్సెన్షన్ వేటు పడేవరకు ఊరుకునేట్లు లేరు. ఇప్పటికే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy), పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లాంటి మంత్రులపై కౌశిక్ గతంలోనే తీవ్రస్ధాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దూకుడుస్వభావం ఉండే కౌశిక్ పై చర్యలు తీసుకోవటం స్పీకర్ కు పెద్ద విషయమే కాదు. ఏదో చర్చ సందర్భంగా పాడి అసెంబ్లీలో గొడవచేయటం, ఆరోపణలతో రెచ్చిపోవటం ఖాయం. దాని ఆధారంగానే తొందరలోనే కౌశిక్ పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story