సిఐడి కస్టడీలో హెచ్ సిఏ స్కాం నిందితులు
x

సిఐడి కస్టడీలో హెచ్ సిఏ స్కాం నిందితులు

ఆరు రోజుల కస్టడీకి అనుమతించిన మల్కాజ్ గిరి కోర్టు


హెచ్‌సీఏ అవకతవకలపై సీఐడీ దర్యాప్తు స్పీడ్ పెంచింది ఐదుగురు నిందితులను ఆరో రోజుల పాటు సీఐడీ కస్టడీకి

మల్కాజిగిరి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, రాజేందర్ యాదవ్, కవితను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

కవిత రాజేందర్ యాదవ్ భార్య. గురువారం నుంచి ఈ నెల 22 వరకు వారిని అధికారులు విచారించనున్నారు. నలుగురు నిందితులను చర్లపల్లి జైలు నుంచి, కవితను చంచల్‌గూడ జైలు నుంచి సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వీరిని విచారిస్తే హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

హెచ్ సిఎ స్కాంలో 170 కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. హెచ్ సి ఎ అధ్యక్షుడి హోదాలో జగన్ మోహన్ రావు, ఐపిఎల్ జరుగుతున్న సమయంలో సన్ రైజర్స్ ను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తనకు వ్యక్తిగతంగా 10 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. సన్ రైజర్స్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు తీగ లాగితే డొంక కదిలింది. ప్రస్తుతం ఐదుగురు నిందితులతో బాటు దేవరాజ్ కోసం సిఐడి పోలీసులు వెతుకుతున్నారు.

నిందితులలో ఒకరైన రాజేందర్ యాదవ్ మాజీ మంత్రి కృష్ణాయాదవ్ స్వంత తమ్ముడు. మిత్ర క్లబ్ అధ్యక్షుడైన కృష్ణాయాదవ్ సంతకాన్ని తమ్ముడు రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత ఫోర్జరీ చేశారు. ఈ ఫోర్జరీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసుకుని హెచ్ సి ఏ అధ్యక్షుడి పదవిలో జగన్ మోహన్ రావు కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోర్జరీ పత్రాల ఆధారంగానే సిఐడి కేసు నమోదు చేసింది.

కృష్ణాయాదవ్ ఉమ్మడి రాష్ట్రంలో నకిలీ స్టాంపుల కేసులో ఇరుక్కొని పూణెలోని ఎరవాడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో కృష్ణాయాదవ్ నిర్దోషిగా బయటపడ్డారు. నిర్దోషిగా బయట పడినప్పటికీ టిడిపి ఆయనను మళ్లీ పార్టీకి తీసుకోలేదు. తర్వాత కృష్ణాయాదవ్ బిఆర్ఎస్, బిజెపిలో చేరినప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కృష్ణాయాదవ్ రాజకీయంగా క్రియాశీలకంగా లేరు.

Read More
Next Story