తెలంగాణలో హీట్ వేవ్స్... ఆరోగ్యశాఖ కీలక సూచనలు
వాతావరణ శాఖ ఎండ తీవ్రత హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
వాతావరణ శాఖ తెలంగాణలోని వివిధ జిల్లాలకు హీట్‌వేవ్ హెచ్చరికలను జారీ చేసింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD (ఇండియన్ మెటరాలజి డిపార్ట్మెంట్) అంచనా వేసింది. వాతావరణ శాఖ ఎండ తీవ్రత హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
సోమవారం ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో ఇలాంటి వాతావరణమే ఉండొచ్చని అంచనా వేసింది.
ఆరోగ్యశాఖ సూచనలు..
వేడి గాలులు తీవ్రతరం అవుతుండటంతో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.బి.రవీందర్ నాయక్ కొన్ని ఆరోగ్య సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. ఆందోళన, నీరసం, తల తిరగడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయకూడదో వివరించారు.
హైడ్రేటెడ్ గా ఉండండి:
తగినంత నీరు త్రాగండి, మీకు దాహం వేయదు.
ORS, నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ వంటివి తరచూ తీసుకోవాలి.
ప్రయాణ సమయంలో నీటిని తీసుకెళ్లండి.
సీజనల్‌గా లభించే పండ్లు, కూరగాయలు, నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తినండి.
కవర్ చేయండి:
సన్నటి వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది.
మీ తలను కప్పుకోండి. గొడుగు, టోపీ, టవల్ ఉపయోగించండి.
వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి.
పగటిపూట కిటికీలు, కర్టెన్‌లను మూసి ఉంచండి, చల్లటి గాలి లోపలికి రావడానికి రాత్రి వాటిని తెరవండి.
ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటికి రాకుండా ఉండండి.
మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు కష్టమైన పనులకు దూరంగా ఉండండి.
చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దు.
ఎండ ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి.
ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు లేదా ఎక్కువ మొత్తంలో చక్కెర ఉన్న పానీయాలను నివారించండి.
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మానుకోండి.
పార్క్ చేసిన వాహనంలో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు.
నెలల శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గుండె జబ్బులు, బీపీ వంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు అదనపు శ్రద్ధ అవసరం.