
మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ
మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారం రోజులుగా హైదరాబాద్ వాసులపై వర్షం దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. సోమవారం మరోసారి వర్షం కురిసే అవకాశం ఉండటంతో మున్సిపల్, హైడ్రా ఉద్యోగ సిబ్బందికి ఉన్నతాధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సిబ్బంది అలర్ట్ అయ్యారు.
అయితే.. ఇటీవలె కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లో బురదనీరు చేరింది. అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్ని చిత్తడిగా మారిపోయాయి. వాటర్ లాగిన్ పాయింట్స్‌లో వర్షపు నీరుచేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, లో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసిన కారణంగా.. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు వాటిల్లాయి.
హైదరాబాద్‌లో వరుసగా రెండ్రోజులు కురిసిన వర్షానికి నిన్న అత్యధికంగా హైదర్‌నగర్‌లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కుత్బుల్లాపూర్, అల్వాల్, బీహెచ్ఈఎల్, రామచంద్రపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం, మల్కాజిగిరిలో 4.4, కూకట్‌పల్లి 4.3, కాప్రా, శేర్లింగంపల్లి 4.2 నమోదు అయ్యింది. అటు నేరేడ్‌మెట్, ఉప్పల్, మల్లాపూర్, గాజులరామారం, లింగంపల్లి, మౌలాలి, ముషీరాబాద్, సఫిల్‌గూడ్, షేక్‌పేట్, బంజరా హిల్స్, పటాన్‌చెరు, చందానగర్, ఖైరతాబాద్, బోరబండ 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
అయితే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రభుత్వం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.సంగారెడ్డి జిల్లా కంగ్టి 17 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6 సెంటీ మీటర్లు, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదు అయినట్టు అధికారులు చెప్పారు.
మంత్రి సీతక్క ఆరా
భారీ వర్షసూచన రావడంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీవర్ష సూచన ఉందని ఆమె చెప్పారు. తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారంలో భారీవర్షాలు కురుస్తున్నాయన్నారు.. సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.