
హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం
తెలంగాణ జిల్లాల్లో అదే పరిస్థితి
అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు కదలకపోవడంతో రోడ్లపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం చోటుచేసుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతువరకు నీళ్లు నిలిచిపోయాయి.
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం ప్రారంభమైంది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్థంభించిపోయింది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనప్రభావంతో మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది.రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో కురిసిన భారీ వర్షానికి బంజారా కాలనీ నీట మునిగింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి.