
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఆదివారం నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెడ్ సైంటిస్ట్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆమె చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఆదివారం మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆమె పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ఎల్లో, ఆరంజ్ అలర్ట్ లు జారీ చేసింది.
రుతుపవన ద్రోణి ప్రభావం
రుతుపవన ద్రోణి ప్రభావంతోపాటు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం చిరు, ఢిల్లీ, షాజహాన్పూర్, లక్నో, పాట్నా, బంకురాల మీదుగా తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెప్పారు.ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలోని దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర, యానాం తీరాలకు సమీపంలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది.నిన్న 13 డిగ్రీల ఉత్తర ఆక్షాంశం ప్రాంతంలో దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ అధికారులు చెప్పారు.
నాలుగు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, తాము పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని వాతావరణ కేంద్రం హెడ్ సైంటిస్ట్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు.హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని ఆమె తెలిపారు. ఆదివారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జోగులాంబగద్వాల్, కరీంనగర్, కుమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిిన వర్షంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆమె వివరించారు.
21, 22 తేదీల్లో అతి భారీవర్షాలు
ఈ నెల 21, 22 తేదీల్లో అతి భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నాగరత్న చెప్పారు.సోమవారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, సిద్ధిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిజిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
Next Story