
వరదనీటితో పరవళ్లు తొక్కుతున్న ప్రాజెక్టు
తెలంగాణలో విస్తారంగా వర్షాలు..వెల్లువెత్తుతున్న ప్రాజెక్టులు
తెలంగాణలో కురుస్తున్న అతి భారీవర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు పెద్దఎత్తున చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీవర్షాలతో పలు ప్రాజెక్టుల్లోకి వరదనీరు వస్తోంది. గోదావరి, కృష్ణ, మంజీరా, కడెం, మానేరు నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలతో నదుల్లోకి వరదనీరు పరవళ్లు తొక్కుతుంది.పలు ప్రాజెక్టుల జలాశయాల్లోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరడంతో పలు డ్యాంల గేట్లను తెరచి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి బేసిన్ లో వరదనీరు పెరిగింది.
గోదావరి బేసిన్ లో...
గోదావరి బేసిన్ జలకళతో ఉట్టిపడుతోంది. సింగూరు జలాశయంలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరుతుండటంతో శుక్రవారం 51వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1,68,000 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ జలాశయం నుంచి 5,30,000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదిలారు. కడెం నది నిండు కుండలా మారడంతో ప్రాజెక్టు నుంచి 28వేల క్యూసెక్కుల వరదనీటిని గేట్లు తెరచి కాల్వలోకి విడుదల చేశారు.అప్పర్ మానేరు డ్యాం నుంచి 40,800 క్యూసెక్కులు, మిడ్ మానేరు నుంచి 45,000 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 6,77,000 క్యూసెక్కులు, సుందిళ్ల నుంచి 8,35,000, మేడిగడ్డ నుంచి 9.72,000, అన్నారం నుంచి 7,19,000 క్యూసెక్కులు, సమ్మక్క సారక్క జలాశయం నుంచి 8,11,000 క్యూసెక్కులు, సీతారాం సాగర్ నుంచి 7,03,00 క్యూసెక్కుల వరదనీటిని గేట్లు తెరచి దిగువకు వదిలారు.
వరదనీటి విడుదల
లోయర్ మానేరు డ్యాంలోకి వరదనీటి రాకతో వరదనీటి మట్టం పెరుగుతుండటంతో శుక్రవారం సాయంత్రం గేట్లు తెరవాలని నిర్ణయించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీరు ఎ నవీన్ చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 38 గేట్లు తెరచి 6,76,834 క్యూసెక్కుల వదరనీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లిలో ఇన్ ఫ్లో 6,58,251 క్యూసెక్కులుంది. తాలిపేరు ప్రాజెక్టు వద్ద 65,000 క్యూసెక్కులు, కిన్నెరసాని డ్యాం వద్ద 5000 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు.
కృష్ణా బేసిన్ లోనూ వెల్లువెత్తిన వరదలు
కృష్ణా బేసిన్ లోనూ శుక్రవారం వరదలు వెల్తువెత్తుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కజీనా, అమర్జా, ముల్లమర్రి, పెద్దవాగు, సరళాసాగర్ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున వస్తోంది. ఆల్ మట్టి నుంచి 45,200 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 58,200 క్యూసెక్కులు, తుంగభద్రలో 39,000 క్యూసెక్కులు, ఉజ్జయినిలో 40,000, జూరాల ప్రాజెక్టులో 2,32,500 క్యూసెక్కులు, శ్రీశైలంలో 3,34,791 క్యూసెక్కులు,నాగార్జునసాగర్లో 2,72,075క్యూసెక్కులు, పులిచింతలలో 2,10,618 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీలో 4,00,000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు.
Next Story