
భారీవర్షాలతో చెరువులు నిండి పారుతున్న వరదనీరు
తెలంగాణలో నేటినుంచి 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి అయిదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ నెల 20వతేదీ నుంచి 24వతేదీ వరకు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.
నేడు నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశముందని ఆమె తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశముందని డైరెక్టర్ వివరించారు.
రేపు కూడా వర్షాలే...
ఆగస్టు 21వతేదీన తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మరో మూడు రోజుల పాటు...
ఆగస్టు 22వతేదీన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆగస్టు 23,24 తేదీల్లోనూ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వివరించారు.
నిరంతర సాగునీటి సరఫరాకు మంత్రి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కృష్ణా,గోదావరి నదుల నీటి ప్రవాహం ఉదృతం అవుతున్న దృష్ట్యా నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పర్వవేక్షించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.వరదల ఉధృతికి ఎక్కడైనా కాల్వలకు గండ్లు పడితే సత్వరం పూడ్చివేత చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.వరదనీటి ప్రవాహాలతో రాష్ట్రంలోని చెరువులను నింపాలని కోరారు.తద్వారా రైతాంగానికి సంవత్సరం పొడవునా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు.
నేడు మంత్రి ప్రాజెక్టుల సందర్శన
భారీ వర్షాలతో గోదావరి జలాశయాలు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు,నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులను సందర్శించి సమీక్షించ నున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు.
కళకళ లాడుతున్న కృష్ణా బేసిన్
కృష్ణా బేసిన్ లో నీటి ప్రవాహాలు గణనీయమైన స్థాయికి చేరుకోవడంతో జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి. జూరాలలో 2.18 లక్షల క్యూసెక్కులు,నాగార్జున సాగర్ లో ఔట్ ఫ్లో 3.95 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయింది.శ్రీశైలం ప్రాజెక్టులో గత ఏడాది ఇదే రోజుకు 192.97 టి.యం.సీల నీరు ఉండగా ఈ సంవత్సరం ఇదే రోజుకు 198.81 టి.యం.సి ల నీరు చేరింది.నాగార్జునసాగర్ ప్రాజెక్టులోనూ 312.05 టి.యం.సి ల నీటి సామర్ధ్యనికి గాను ఇప్పటికే 297.15 టి.యం.సీల నీటి నిల్వలు చేరుకున్నాయి.
గోదావరి నదిలో వరదనీటి గలగలలు
భారీ వర్షాలకు గోదావరి బేసిన్ లో కుడా భారీగా నీటి ప్రవాహాలు నమోదు అయ్యాయి.శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 90.30 టి.యం.సి నీటి సామర్ధ్యానికి గాను 73.37 టి.యం.సి ల నీరు చేరింది. సింగూర్ ప్రాజెక్టులోనూ 19.48 టి.యం.సి ల నీటితో నిండింది.గత సంవత్సరంతో పోల్చి చూస్తే 14.91 టి.యం.సి ల నీరు పెరిగింది.
చెరువుల్లోనూ జలకళ
తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కూడా జలకళను సంతరించుకున్నాయి. 34,740 చెరువులు ఉండగా 12,023 చెరువులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండాయని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. మరో 9,100 చెరువుల్లో 75 నుండి 100 శాతానికి నీరు చేరుకుందని చెప్పారు.సాగునీటి కి సమృద్ధిగా నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటి నిర్వహణ చేపడుతున్నామని ఇంజినీర్లు వివరించారు.
తెగిపోయిన చెరువులు, కాల్వలకు మరమ్మతులు
అతి భారీ వర్షాల ఉధృతికి 177 చెరువులు దెబ్బ తిన్నాయి. కాలువలు,లిఫ్టు ల పునరుద్ధరణకు 335 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.3,500 చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.శాశ్వతంగా పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. అదే సమయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో ఉపేక్షిస్తే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.వానాకాలం తో పాటు యాసంగి పంటలకు సాగు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగ కుండా ఉండేందుకు గాను గోదావరి జలాలను ఆయా రిజర్వాయర్ లలో నిలువ ఉంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని మంత్రి కోరారు. కడెం,ఎల్లంపల్లి లతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో సమృద్ధిగా నీటిని నిల్వ ఉంచడం ద్వారా సంవత్సరం పొడవునా సాగునీరు అందించేందుకు గాను వాటికి అనుబంధంగా ఉన్న చిన్న నీటిపారుదల చెరువులన్నింటిని నింపాలని మంత్రి ఆదేశించారు.
Next Story