
తెలంగాణలో పర్యాటక కేంద్రాలు
తెలంగాణ పర్యాటకానికి ప్రపంచస్థాయి గుర్తింపు,హెలీ టూరిజం
తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. హెలికాప్టర్ విహారంతోపాటు పర్యాటకుల భద్రతకు టూరిస్టు పోలీసులను రంగంలోకి దించారు.
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలు...గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కిన మహా బతుకమ్మ వేడుకలు...ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క వేడుకలు...పర్యాటక, చారిత్రక,ప్రకృతి అందాలతో కూడిన అడవులు...హెలికాప్టర్ విహారం...నదుల్లో క్రూయిజ్ ప్రయాణం...తెలంగాణ టూరిజం లగ్జరీ క్యారవాన్...పర్యాటకుల భద్రతకు టూరిస్టు పోలీసులు...ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన హోటళ్లతో తెలంగాణ పర్యాటక కేంద్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
పర్యాటకులకు ఇక సీ ప్లేన్ విహారం...
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకులకు మర్చిపోలేని మధుర అనుభూతులను మిగిల్చేందుకు హెలికాప్టర్ విహార సౌకర్యం కల్పించనుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకులు సరికొత్త అనుభూతి చెందేందుకు వీలుగా హెలీకాఫ్టర్ టూరిజాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొదట హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం వరకు హెలీకాఫ్టర్ సేవలు ప్రారంభించనున్నారు. పర్యాటకుల ఆదరణ ఆధారంగా దీన్నిమరింతగా విస్తరించాలని పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. సీ ప్లేన్ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి భద్రాచలం వరకు సీప్లేన్ విహారం కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. నీటి మీద మాత్రమే దిగగే సీ ప్లేన్‌లను తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పర్యాటకులకు భద్రత కోసం టూరిస్టు పోలీసులు
తెలంగాణను సందర్శించే ప్రతి పర్యాటకునికి సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం 15 మంది టూరిస్ట్ పోలీసులే ఉండగా ఆ సంఖ్యను 90కు పెంచాలని నిర్ణయించింది. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు ఒంటరిగానే పర్యాటక ప్రదేశాలకు వస్తున్నారు. పర్యాటకులకు భద్రత, భరోసా కల్పించేలా ఈ టూరిస్ట్ పోలీసులు సేవలు అందించనున్నారు.
80 మంది టూరిస్టు పోలీసులకు శిక్షణ
తెలంగాణలోనూ 80 మంది టూరిస్టు పోలీసుల విభాగాన్ని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశంలోని 14 ఇతర రాష్ట్రాల్లో లాగా తెలంగాణలోనూ టూరిజం పోలీసుల విభాగాన్ని ఆరంభించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM)లో 80 మంది తెలంగాణ టూరిజం పోలీసు సిబ్బందితో కూడిన తొలి బ్యాచ్‌కు వారం రోజుల పాటు శిక్షణ తరగతులను తాజాగా ప్రారంభించారు. దీని ద్వారా తెలంగాణలో పర్యాటక భద్రతను బలోపేతం చేయనున్నారు.
పర్యాటక భద్రత ఇక బలోపేతం
“తెలంగాణ అంతటా పర్యాటక భద్రతను బలోపేతం చేయడానికి, సందర్శకుల అనుభవాన్ని పెంచడానికి పర్యాటక సాంస్కృతిక శాఖ సమన్వయంతోశిక్షణ పొందిన పర్యాటక పోలీసు సిబ్బందిని నియమించాం’’అని తెలంగాణ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (లా & ఆర్డర్) మహేష్ ఎం. భగవత్ చెప్పారు. రాష్ట్రంలోని తొమ్మిది పోలీసు కమిషనరేట్ల నుంచి 80 మంది పోలీసు సిబ్బందిని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నియమిస్తామని ఆయన తెలిపారు. నాగర్ కర్నూల్ (సోమశిల),వికారాబాద్ (అనంతగిరి),ములుగు (రామప్ప),యాదాద్రి భువనగిరి (రాచకొండ - యాదగిరిగుట్ట), యాదాద్రి భువనగిరి (రాచకొండ – పోచంపల్లి), నల్గొండ (బుద్ధవనం),భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం),,హైదరాబాద్ కమిషనరేట్ (హైదరాబాద్)లలో టూరిజం పోలీసులను నియమించనున్నారు.
సందర్శకులకు పర్యాటక పోలీసుల సహాయం
తెలంగాణలోని టూరిస్ట్ పోలీసులు అమ్రాబాద్, సోమశిల, అనంతగిరి, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, బుద్ధవనం, భద్రాచలం మరియు హైదరాబాద్ వంటి కీలక ప్రదేశాలలో సందర్శకులకు సహాయం చేయడంతోపాటు శాంతిభద్రతలను కాపాడనున్నారు.టూరిజం పోలీసులకు సాఫ్ట్ స్కిల్స్, టూరిస్ట్ ఫెసిలిటేషన్, పబ్లిక్ గైడెన్స్, ఫెస్టివల్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ ప్రిపరేషన్, కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, ఎథిక్స్, సైబర్ అవేర్‌నెస్‌లో శిక్షణ ఇచ్చారు.
పర్యాటకులకు మధుర అనుభూతిని కల్పించేలా...
పచ్చని ఎతైన చెట్లతో కూడిన అడవులు,పర్యాటకులు మెచ్చిన వంటకాలు,జాలువారుతున్న జలపాతాలు,సీ ప్లేన్ విహారం, డబుల్ డెక్కర్ పడవ ప్రయాణాలు,అడవి జంతువుల సందర్శనలతో తెలంగాణ పర్యాటక శాఖ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకం మరింత విస్తృతమవుతోంది. నచ్చిన అడవి దగ్గరే రాత్రి వేళ బస చేసే అవకాశం..నిశి రాత్రి వేళ అడవి జంతువులను చూపించనున్నారు. పర్యాటకులకు సకల వసతులు కల్పించి వారికి మరిచిపోలేని మధురానుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది.
పర్యాటకులకు ప్రయాణం...
తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు రైళ్లు, బస్సులు, అవసరమైన వాహనాల్లో సాఫీగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ, ఇతర ట్రావెలింగ్ సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందం చేసుకుంటోంది. వీటితో పర్యాటకులు కోరుకునే వాహనాలను అందుబాటులో ఉంచారు.పర్యాటకుల సంఖ్య ఆధారంగా భారీ వాహనాలు క్యారవాన్‌లు అందుబాటులో ఉంచారు.
ముచుకుందా ప్రారంభం...
జల విహారాల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్‌లో 120 సీట్ల సామర్థ్యమున్న డబుల్ డెక్కర్ బోట్‌ను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్‌కు ఒక నాడు జీవనాడిగా ఉన్న మూసీ అసలు పేరైన ముచుకుందా పేరును ఈ బోట్‌కు పెట్టారు.
పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు
అనంతగిరి కొండల్లో జెసోమ్ అండ్ జెన్ మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్‌నెస్ సెంటర్, ద్రాక్ష పంట నుంచి వైన్ తయారీ యూనిట్, అటవీ ప్రాంతంలో తాజ్ సఫారీ, మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ఫ్రంట్ రిసార్ట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, తెలంగాణలో టైర్ 2 నగరాల్లో జింజర్ హోటళ్లు, నాగార్జున సాగర్‌లో వెల్‌నెస్ రిట్రీట్.. వెడ్డింగ్ డెస్టినేషన్ సెంట బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు సంస్థలు సిద్ధం అయ్యాయి. ఈ ఒప్పందాల ఫలితంగా రూ.15 వేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు రావడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభించనుంది.
అంతర్జాతీయ చిత్ర నగరిగా హైదరాబాద్
ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచ చిత్ర పరిశ్రమకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ లోకేషన్లలో షూటింగ్‌లకు తక్షణ అనుమతి లభించనుంది.
ఆరోగ్య నగరంగా హైదరాబాద్
తెలంగాణ మెడికల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో హైదరాబాద్‌లో ఏ ఏ ఆసుప్రతులు ఉన్నాయి... ప్రముఖ వైద్యులెవరు.. వారు ఏ రకమైన సేవలు అందిస్తారు? ఏ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది? వీసాల జారీ, పొడిగింపు తదితర వివరాలుంటాయి. విమానాశ్రయం నుంచి ఆ ఆసుపత్రికి ఎలా చేరుకోవాలనే వివరాలుంటాయి. దీనివల్ల పెద్ద సంఖ్యలో హెల్త్ టూరిజం అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
Next Story