హైదరాబాద్‌లో హై అలర్ట్, మూడంచెల భద్రతా వ్యవస్థ
x
హైదరాబాద్ నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్

హైదరాబాద్‌లో హై అలర్ట్, మూడంచెల భద్రతా వ్యవస్థ

ఆపరేషన్ సింధూర్‌తో భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో తెలంగాణలో పోలీసులతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.


దేశంలోనే రక్షణ పరంగా హైదరాబాద్ నగరం కీలకంగా ఉంది. మిలటరీకి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాస్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, భద్రత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించి మూడంచెల భద్రత వ్యవస్థను రూపొందించారు.


సోషల్ మీడియాపై పోలీసుల నిఘా
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో సున్నితమైన సమస్యలపై తప్పుడు ప్రచారాన్ని నివారించడానికి సోషల్ మీడియాను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులను ఆదేశించింది. ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు సూచించింది. జిల్లా కేంద్రాల్లో వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆదేశించింది.


అత్యవసర విభాగాల ఉద్యోగులకు సెలవుల రద్దు

తెలంగాణలో పోలీసు, వైద్యఆరోగ్య శాఖ, విపత్తు, అత్యవసర విభాగాల్లో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు.మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి ప్రజలను అత్యవసర పరిస్థితులు ఎదురైతే సిద్ధంగా ఉండేలా చేయాలని సర్కారు కోరింది.వార్తలు, ప్రచారాలపై మీడియా అధిపతులతో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో రక్షణ రంగ పరికరాలను తయారు చేస్తున్న బీహెఛ్ఈఎల్, బెల్, బీడీఎల్,ఎన్ఎఫ్ సీ, డీఆర్ డీఓ తదితర కేంద్ర సంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

శాంతి భద్రతల పర్యవేక్షణకు కంట్రోల్ రూం
తెలంగాణ రాష్ట్రంలో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచామని డీజీపీ డాక్టర్ జితేందర్ చెప్పారు.హైదరాబాద్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి,పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో జైలు శిక్ష అనుభవించి విడుదలైన వారి కదలికలపై నిఘా పెంచామని డీజీపీ వివరించారు. అత్యవసరమైతే సైరన్ అలర్ట్ మోగించనున్నారు.సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని నిర్ణయించారు.

ఆసుపత్రి భవనాలపై ఎరుపు ప్లస్ గుర్తు
అత్యవసర పరిస్థితుల్లో సులభంగా గుర్తించడానికి వీలుగా ఆసుపత్రి భవనాలపై ఎరుపు ప్లస్ గుర్తును ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

ప్రజలను అప్రమత్తం చేసేందుకు యాప్
హైదరాబాద్‌లో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఉక్రెయిన్‌లో రూపొందించిన పబ్లిక్ అలెర్ట్ యాప్ తరహాలో రాష్ట్రంలో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో మూడంచెల భద్రతను కల్పించి తనిఖీలు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో నూ సాయుధ భద్రత కల్పించారు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సైబర్ బృందాలను ఏర్పాటు చేశారు.కేవైసీ లేకుండా సిమ్ కార్డుల జారీని నిరోధించడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు.


Read More
Next Story