బీసీ రిజర్వేషన్ జీవో విచారణ వాయిదా.. పార్టీల్లో అయోమయం..
x

బీసీ రిజర్వేషన్ జీవో విచారణ వాయిదా.. పార్టీల్లో అయోమయం..

వాడివేడిగా సాగిన వాదోపవాదనలు.


బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం విచారణు గురువారం మధ్యామ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది. న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంతో రాజకీయ పార్టీల్లో అయోమయం ఏర్పడింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. దీంతో నోటిఫికేషన్ వస్తూనే నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఈ సమయంలో బీసీ జీఓపై విచారణను వాయిదా వేయడంతో ఇప్పుడు తాము ఏం చేయాలి? అనేది పార్టీలకు అర్థం కావట్లేదు.

ప్రభుత్వానికి కోర్టు ప్రశ్నలు

బుధవారం జరిగిన విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసలు ఎంత కాలంగా గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది? రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్వహించారు? కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్ చేశారా? ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా? అంటూ వరుస ప్రశ్నలు సంధించింది. షెడ్యూల్ నోటిఫై అయిందా? అని కూడా ఏజీని అడిగింది. అయితే ఇంకా వినిపించాల్సిన వాదనలు ఉన్నాయని, కావున విచారణు వాయిదా వేయాలని ఏజీ కోరారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. కాగా అందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఏజీ కోరిన ప్రకారం విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

శాస్త్రీయ ఆధారాల్లేవ్..

బుధవారం విచారణలో భాగంగా పిటిషనర్ల తరపు న్యాయవాది కీలక అంశాలను లేవనెత్తారు. రిజర్వేషన్లను పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని గుర్తు చేశారు. ‘‘42శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. బీసీ కులగణన చేశారు. కానీ రిపోర్ట్‌ను బహిర్గతం చేశారు. బీసీ కులగణన ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. ఎస్సీ, ఎస్టీలకు జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా? 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టేసింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు?’’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఏకగ్రీవంగా ఆమోదించాయి..

ఈ కేసులో ప్రభుత్వం తరుపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణలో భాగంగా బీసీ రిజర్వేషన్ బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పారు. ‘‘రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. జీవో నెం.9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. బీసీ ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50శాతానికి మించి పెంచుకోవచ్చు. శాసనవ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసనవ్యవస్థదే నిర్ణయం. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. నెలలపాటు ఏ నిర్ణయమూ చెప్పడం లేదు. బిల్లును ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు. తమిళనాడులో ఒక బిల్లు ఏళ్లతరబడి గవర్నర్ వద్దే ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా?’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు. వారు నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యవస్థ స్తంభించిపోతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలన. నెరవేర్చలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయి. (ఈమేరకు ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన నోటిఫికేషన్ ను కోర్టుకు అందజేశారు) ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తాం" అని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు.

అయోమయంలో రాజకీయ పార్టీలు..

నామినేషన్లపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరడం. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రాజకీయ పార్టీలు తీవ్ర అయోమయంలో పడ్డాయి. ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ గురువారం రానుంది. ఈ క్రమంలో నామినేషన్లు వేయడం కోసం మంచి రోజులు, ముహూర్తాలు చూసుకుని ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా.. అంశం కోర్టులో ఉన్న క్రమంలో నామినేషన్లు వేయాలా? వద్దా? అన్న అయోమయంలో పార్టీలు ఉన్నాయి. ఒకవేళ నామినేషన్ వేసి ప్రచారం ప్రారంభించాక ఎన్నికల నోటిఫికేషన్‌ను న్యాయస్థానం రద్దు చేస్తే.. అనుకున్న ప్లాన్ అంతా తలకిందలయ్యే అవకాశం ఉంది. దీంతో అసలు ఇప్పుడు ఏం చేయాలి? అనే దిక్కుతోచని పరిస్థితులో పార్టీలు, అభ్యర్థులు ఉన్నారు.

Read More
Next Story