హైడ్రా జోరుకు హైకోర్టు బ్రేకులు ?
x
High court and Hydra Commissioner

హైడ్రా జోరుకు హైకోర్టు బ్రేకులు ?

ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ ఏమిటో సర్వేచేసి ఫైనల్ చేయకుండానే ఇళ్ళను, విల్లాలను హైడ్రా కూల్చేయటం ఏమటని ఆశ్చర్యపోయారు.


దాదాపు మూడునెలలుగా మంచి జోరుమీదున్న హైడ్రా యాక్షన్ కు బ్రేకులు పడక తప్పేట్లులేదు. దీనికి కారణం ఏమిటంటే బాధితుల రోధనలు, గోల కాదు. కేవలం హైకోర్టు పీకిన క్లాసులే కారణం. ఒక కేసు విషయంలో హైడ్రా చర్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అమీన్ పూర్ కు చెందిన ఒక నిర్మాణ సంస్ధ హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా వేసిన కేసును జస్టిస్ లక్ష్మణ్ సోమవారం విచారించారు. ఈ సందర్భంగా రెవిన్యు శాఖ అధికారులతో పాటు హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ ను ఫుల్లుగా వాయించేశారు. కూల్చేవేతల్లో అడుగడుగునా ఉల్లంఘనలున్నట్లు మండిపడ్డారు. కూల్చివేతలపై ఉన్న ఆతృత, నిబంధనలు పాటించటంలో ఎందుకు చూపటంలేదని నిలదీశారు. కోర్టు స్టే ఇచ్చిన నిర్మాణాలను కూడా కూల్చేస్తరా ? అంటు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆక్రమణల్లో ఉందని ఎంఆర్వో సమాచారం ఇస్తే హైకోర్టును, ఛార్మినార్ ను కూడా కూల్చేస్తారా ? అంటు రంగనాధ్ కు జస్టిస్ లక్ష్మణ్ ఫుల్లుగా క్లాసు పీకారు. సెలవురోజులు, సూర్యాస్తమయం తర్వాత నిర్మాణాలను కూల్చకూడదని తెలీదా ? అని అడిగిన ప్రశ్నకు రంగనాధ్ ఏమీ సమాధానం చెప్పలేదు. కోర్టు స్టే ఉన్న నిర్మాణాలను ఎందుకు కూల్చారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు కూడా రంగనాధ్ సమాధానం చెప్పలేకపోయారు. హైడ్రా ఏర్పాటు ఉద్దేశాన్ని తప్పుపట్టడంలేదని, ఆక్రమణలను సమర్ధించటంలేదని కూడా జస్టిస్ స్పష్టంగా చెప్పారు. అయితే రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేస్తామంటే సాధ్యంకాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కమీషనర్ కు గుర్తుచేశారు.

అసలు చెరువులు, కాల్వలు, కుంటల సర్వే విధానం తెలుసా ? అంటు రంగనాధ్ ను ప్రశ్నించారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ ను గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని చాలా కాలం క్రితమే రెవిన్యు, ఇరిగేషన్ శాఖలను హైకోర్టు ఆదేశించినా ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వని విషయం హైడ్రాకు తెలుసా ? అని జస్టిస్ అడిగారు. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ ఏమిటో సర్వేచేసి ఫైనల్ చేయకుండానే ఇళ్ళను, విల్లాలను హైడ్రా కూల్చేయటం ఏమటని ఆశ్చర్యపోయారు. సెలవురోజుల్లో కూల్చేయాలని తహశిల్దార్ సాయం అడిగితే ఇవ్వటం సాధ్యంకాదని చెప్పాల్సిన హైడ్రా తెల్లవారి 7.30 గంటలకు కూల్చివేతలు మొదలుపెడతారా అంటు వాయించేశారు. ముందురోజు సాయంత్రం కూల్చివేతలకు నోటీసులిచ్చి మరుసటి రోజు ఉదయమే నిర్మాణాలను ఎలాగ కూలుస్తారంటు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న 2500 చెరువుల్లో 70 శాతం ఆక్రమణలకు గురైనట్లు కమీషనర్ చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తు 2500 చెరువుల్లో ఎన్నింటికి ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ గుర్తించారని అడిగిన ప్రశ్నకు రంగనాధ్ సమాధానం చెప్పలేకపోయారు. ముందు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై సర్వేలు చేసి గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి, తర్వాత యజమానులకు నోటీసులు జారీచేయాలని జస్టిస్ హైడ్రాను ఆదేశించారు. అమీన్ పూర్ లోని సర్వే 164లోని నిర్మాణాల విషయంలో స్టేటస్ కో విధించినట్లు జస్టిస్ ప్రకటించారు. పై సర్వే నెంబర్ జోలికి వెళ్ళద్దని జస్టిస్ హైడ్రా, రెవిన్యు అధికారులకు స్పష్టంగా ఆదేశించారు.

కూల్చివేతలు, హౌడ్రా దూకుడుపై హైకోర్టులో జరిగిన విచారణ, విచారణ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, ఇచ్చిన ఆదేశాలు, పీకిన క్లాసులతో హైడ్రా దూకుడు తగ్గుతుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. కూల్చివేతల్లో ఇప్పటివరకు బాధితులందరు పేద, మధ్య, ఎగువమధ్య తరగతి జనాలే అన్న విషయం అందరికీ తెలుసు. ఇదే విషయం కోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. అందుకనే హైడ్రా యాక్షన్ పై జస్టిస్ అంతగా మండిపోయింది. ఉన్నపళంగా ఇళ్ళని కూల్చేస్తే అందులోని జనాలు ఎక్కడ ఉండాలని జస్టిస్ అడిగిన ప్రశ్నకు హైడ్రా సమాధానం చెప్పలేకపోయింది. కూల్చివేతల సందర్భంగా హైడ్రా నిబంధనలు పాటించాల్సిందే అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. హైడ్రా పనితీరు విషయంలో జస్టిస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఒకవైపు ఇళ్ళుకోల్పోయిన వందలాది బాధితులు, మరోవైపు తమ ఇళ్ళను హైడ్రా ఎక్కడా కూల్చేస్తుందో అన్న భయంతో ఇళ్ళ యజమానులు, ఇంకోవైపు హైడ్రా పనితీరుపై కోర్టుల్లో దాఖలవుతున్న కేసులు, తాజాగా హైడ్రా పనితీరును తప్పుపడుతు హైకోర్టుచేసిన వ్యాఖ్యలు. వెరసి తన స్పీడుకు హైడ్రాయే బ్రేకులు వేసుకోబోతున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. విచారణ సందర్భంగా హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ ను ఉద్దేశించి కోర్టు చేసిన వ్యాఖ్యలు, సూచనలు చాలా కీలకం. అవేమిటంటే ‘పోలిటికల్ అధికారంలోని బాసులు చెప్పినట్లే వింటే బలయ్యేది మీరే’ అన్నది. ‘హైడ్రా కమీషనర్ పోస్టులోనే ఎల్లకాలం ఉండరని బాసు అసంతృప్తికి గురైతే ఇంకోచోటికి బదిలీ కాక తప్పద’ని గుర్తుచేసింది కోర్టు. నిబంధనలు ఉల్లంఘించి బాస్ లు చెప్పినట్లు ఉంటే చివరకు ఇంటికి వెళ్ళాల్సిందే అన్నది. ఇంతకన్నా మరో కీలకమైన హెచ్చరిక ఏమిటంటే నిబంధనలు ఉల్లంఘిస్తు కూల్చివేతలు చేస్తుంటే హైడ్రానే రద్దు చేయాల్సుంటుందని చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు, వార్నింగులతో హైడ్రా జోరుకు బ్రేకులు తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.

Read More
Next Story