చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై క్లారిటీ ఇచ్చిన హైకోర్టు.. ఏమనంటే..!
x

చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై క్లారిటీ ఇచ్చిన హైకోర్టు.. ఏమనంటే..!

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసు మరో కీలక మలుపు తీసుకుంది.


వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఈకేసుపై సోమవారం జరిగిన విచారణలో.. మాజీ ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. ఫేక్ డాక్యుమెంట్లతో కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు భారీ జరిమానా విధించింది. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే చెన్నమనేని పౌరసత్వ కేసు పదిన్నర ఏళ్లపాటు కొనసాగింది. నేటి విచారణలో కోర్టుకు చెన్నమనేని తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారని గుర్తించిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినందుకు గానూ.. చెన్నమనేకికి రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, హైకోర్లు లీటన్ సర్వీస్ అథారిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ చెల్లింపులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. కాగా ఈ ఆర్డర్‌ను నెల రోజుల పాటు సస్పెన్షన్‌లో ఉంచాలని రమేష్ తరపు న్యాయవాది కోరారు.

ఈరోజు విచారణలో భాగంగా పలు ఇతర అంశాలను కూడా న్యాయమూర్తి ప్రస్థావనలోకి తీసుకొచ్చారు. ఇన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లే సమయంలో చెన్నమనేని ఏ పాస్‌పోర్ట్ వినియోగించారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు చెన్నమనేని తన ప్రయాణాలకు జర్మనీ పాస్‌పోర్ట్ వినియోగించారని, ఇప్పటికి కూడా ఆయన దగ్గర జర్మనీ పాస్‌పోర్ట్ ఉందని, పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదని రమేష్ తరపు న్యాయవాది వివరించారు. కాగా ఆయన దగ్గర భారతీయ పాస్‌పోర్ట్ ఉందా? లేదా? అని న్యాయస్థానం ప్రశ్నించగా.. లేదని స్పష్టం చేశారు న్యాయవాది. అన్ని వాదనలనూ పరిగనణలోకి తీసుకున్న తర్వాత తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం తీర్పును వాయిదా వేశారు.

2009లో చెన్నమనేని రాజకీయ అరంగేట్రం

సీపీఐ కీలక నేత చెన్నమనేని రాజేశ్వరరావు వారసుడిగా చెన్నమనేని రమేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2009లో అరంగేట్రం చేశారు. అప్పటికే రాజేశ్వరరావు.. సీపీఐకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. తన కుమారుడికి టీడీపీ టికెట్ అందించాలని ప్రయత్నించినప్పటికీ.. ఎన్నారై కావడంతో రాజేశ్వరరావు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయనే టీడీపీ తరుపున బరిలో నిల్చుని గెలిచారు. ఎట్టకేలకు 2009లో టికెట్ పొందిన చెన్నమనేని రమేష్.. 2009 సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో స్వల్ప ఓట్లతో ఓటమిని చవి చూసిన ఆది శ్రీనివాస్.. ఈ ఎన్నిక చెల్లదని ఆరోపించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో చెన్నమనేని భారతీయ పౌరసత్వం పొందారని హైకోర్టును ఆశ్రయించారు.

2010 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నమనేని బరిలో దిగారు. ఆ సమయంలో కూడా రమేష్.. అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ ఆది శ్రీనివాస్.. ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. దాంతో ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించి.. ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరింది. అదే విధంగా ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన క్రమంలో ఎన్నికలు జరపాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆనాడు ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశారు. ఈ పిటిషన్ విచారణలో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి రమేష్ పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ పోరాడుతూనే ఉన్నారు. 2013లో రమేష్ పౌరసత్వాన్ని, శాసనసభా సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ సమయంలో రమేష్.. సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు ఆదేశాలపై స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి ఎన్నికల బరిలో నిల్చున్న చెన్నమనేని రమేష్ మరోసారి విజయం సాధించారు. కాగా 2017లో రమేష్ పౌరసత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. హోంశాఖ కావాలంటే హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొనడంతో.. ఈ వ్యవహారం మళ్ళీ హైకోర్టుకు చేరింది.

చెన్నమనేని పౌరసత్వం ఎందుకు మారింది..?

చెన్నమనేని రాజేశ్వర రావు.. సీపీఐ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. హైదరాబాదు రాజ్య విమోచన అనంతరం ఆయన సీపీఐ పార్టీలో చేరారు. ఆయన కమ్యూనిస్టు, పీడీఎఫ్ తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. 1957లో చొప్పదండి నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వాత నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1967, 1978, 1985, 1994, 2004ల్లో వరుసగా ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా మూడుసార్లు అసెంబ్లీలో సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఆ సమయంలో యునైటెడ్ సోవియేట్ సోషలిస్ట్ రిపబ్లిక్(యూఎస్ఎస్ఆర్) తరపున రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేష్‌కు రష్యాలో చదువుకునే వెసులుబాటు కల్పించిన పార్టీ. అప్పట్లో సీపీఐ పార్టీ నేతల పిల్లలకు రష్యాలో చదువుకోవడం ఉచిత సీట్లు అందించేవారు. అందులో భాగంగానే రమేష్ కూమా రష్యాలోనే విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత 2004 ఆ ప్రాంతంలో చెన్నమనేని రమేష్‌ను తన రాజకీయ వారసుడిగా మార్చడం కోసం రాజేశ్వరరావు నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన సీపీఐకి రాజీనామా చేసి.. టీడీపీ కండువా కప్పుకున్నారు.

పార్టీ మారడం గురించి ఒకానొక సందర్భంలో స్పందించిన రాజేశ్వరరావు.. తాను 30 ఏళ్ల బానిస సంకెళ్లు తెంచుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆ సమయంలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కాగా 2004లో చెన్నమనేని రమేష్‌కు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరగా..ఆయన ఎన్నారై అన్న కారణంతో టికెట్ ఇచ్చెందుకు టీడీపీ నిరాకరించింది. దాంతో రాజేశ్వర రావే పోటీలో నిలబడ్డారు. ఆయనను ఓడించడానికి సీపీఐలోని హేమాహేమీల్లాంటి నేతలు ప్రచారంలోకి దిగా.. రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ రాజేశ్వరరావు గెలిచారు. కాగా 2009లో ఎట్టకేలకు తన కుమారుడికి టీడీపీ తరపున టికెట్ ఇప్పించారు రాజేశ్వర రావు. 2009లో టీడీపీ తరపున గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు చెన్నమనేని రమేష్. ఆ నాటి నుంచే ఆయన పౌరసత్వ వివాదం జరుగుతోంది.

Read More
Next Story