
ప్రణయ్ హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు
జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడికి షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్
ప్రణయ్ హత్య కేసు.. జరిగి ఏడు సంవత్సరాలు అయినా.. ఇప్పటికే ఆ ఘటన ప్రజల కళ్లముందే తిరుగుతుంది. కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకు కూతురు కళ్లముందే ఆమె భర్త ప్రణయ్‌ను అతికిరాంగా హత్య చేశారు. ఈ ఘటను సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను అతని భార్య అమృత ఎదుటే నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ప్రణయ్‌ను హత్య చేయించడంలో అమృత తండ్రి మారుతీరావు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు గతేడాది సంచలన తీర్పు వెలువరించింది. ఏ2 సుభాష్ కుమార్‌కు ఉరిశిక్ష విధించగా మిగిలిన నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పు బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందనే భావనను కలిగించింది.
జిల్లా కోర్టు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. అప్పీల్‌పై తుది విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాదనలు విన్న హైకోర్టు నిందితుడు ఇప్పటికే దీర్ఘకాలం జైలులో ఉండటం అతని వయసు అప్పీల్ విచారణకు పట్టే సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తిస్థాయి విముక్తి కాదని అప్పీల్ తుది తీర్పు వరకు మాత్రమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ షరతులుగా శ్రవణ్ కుమార్ రూ.25 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. మరో రూ.25 వేల విలువైన ఇద్దరు పూచీకత్తుదారులను చూపించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది.
హైకోర్టు నిర్ణయంతో ప్రణయ్ హత్య కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. అప్పీల్ విచారణలో జిల్లా కోర్టు తీర్పు నిలబడుతుందా లేక నిందితుడికి ఉపశమనం లభిస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ పరిణామంపై అమృత ఇంకా స్పందించలేదు. మరోవైపు నిందితుడి న్యాయవాదులు హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ అప్పీల్‌లో బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు. కులాంతర వివాహాలపై సమాజంలో లోతైన చర్చకు దారి తీసిన ప్రణయ్ హత్య కేసు ఇప్పటికీ ప్రజల మనసులను కదిలిస్తోంది. ఈ కేసుపై హైకోర్టు తుది తీర్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

