కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్..
x

కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్..

కాళేశ్వరంలో అవినీతి విచారణపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.


తెలంగాణలో కాళేశ్వరం కథ హాట్‌హాట్‌గా సాగుతోంది. ఒకవైపు ఈ అంశాన్ని సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ అంశంపై హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని, సీబీఐ విచారణను వాయిదా వేయాలని వారు కోరారు. దీంతో రాష్ట్రంలో కాళేశ్వరం చాలా సంచలన అంశంగా మారింది. అయితే ఈ విషయంలో హైకోర్టు నుంచి కేసీఆర్, హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. వారు కోరినట్లే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.

ఇప్పటి దాకా చర్యలేం తీసుకోలేదు..

కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అసలు వారి పిటిషన్లకు విచారణ అర్హత లేదననారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించారని, ఇప్పటి వరకు ఈ అంశంలో పిటిషన్ దారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ విచారణ జరిపిన తర్వాత వారిపై చర్యలు ఉంటాయని వివరించారు. అయితే తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం తెలిపింది.

అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై దర్యాప్తు, విచారణ అంశం మరో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృస్ణ రావు.. కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం కూడా జరిగి పోయింది. దీంతో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎంతవరకు కేసీఆర్, హరీష్‌కు ఊరటనిస్తాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తదుపరి విచారణలోపు సీబీఐ రంగంలోకి దిగితే.. అప్పుడు వీరి మరోసారి సీబీఐకి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడు కోర్టు.. సీబీఐకి చర్యలు తీసుకోవద్దని తెలుపుతూ ఆదేశాలివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదనే విశ్లేషకులు చెప్తున్నారు. విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, కేంద్రహోంశాఖకు వెళ్లిపోయిందని చెప్తున్నారు. దీంతో కేసీఆర్, హరీష్ రావు మరోసారి పిటిషన్లు పట్టుకుని కోర్టు మెట్లెక్కాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story