Mohan Babu | హైకోర్టు గుడ్ న్యూస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..
x

Mohan Babu | హైకోర్టు గుడ్ న్యూస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..

మోహన్ బాబుకు‌ హైకోర్టులో ఊరట లభించింది. వారి కుటుంబ వ్యవహారంలో పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే విధిస్తున్నట్లు వెల్లడించింది.


మంచు కుటుంబ వివాదం రచ్చకెక్కింది. మంచు మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్(Manoj Manchu) ఇద్దరూ కూడా పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే వీరి కుటుంబీకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు వారు పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. కాగా ఇంతలో మోహన్ బాబు.. ఆసుపత్రిలో జాయిన్ కావడం.. ఆయన పరిస్థితి బాగోలేదని, రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకుని చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం ఆయనకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కుటుంబ వ్యవహారంలో పోలీసులు ఆయనకు ఇచ్చిన నోటీసులపై స్టే విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మోహన్ బాబు పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.. ఆయనకు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. అనంతరం ఈ కేసు విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది.

మోహన్ బాబుపై మరో కేసు..

ఈ పిటిషన్ విచారణలో భాగంగా రెండు పరస్పర ఫిర్యాదులకు సంబంధించిన కేసులే కాకుండా మోహన్ బాబుపై మరో కేసు కూడా నమోదైందని పోలీసుల తరపు న్యాయవాది.. న్యాయస్థానానికి వివరించారు. జర్నలిస్ట్‌పై మైక్‌తో దాడి చేసిన ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదైనట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోరారు. అది సాధ్యం కాదని పోలీసులు కోర్టుకు తెలపడంతో.. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయన నివాసం దగ్గర పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని కోర్టు.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆగ్రహంలో జర్నలిస్ట్‌లు..

అయితే విలేకరిపై మోహన్ దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మోహన్ బాబు ఇంటి వద్ద వీడియో జర్నలిస్టులు,రిపోర్టర్ల పై జరిగిన దాడిని తీవ్రంగా అసోసియేషన్ ఖండించింది. సినీ నటుడు మోహనబాబు అకారణంగా జల్ పల్లి లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలస్ట్ ఫెడరేషన్ ఖండించింది. కుటుంబ వివాదాల పట్ల ఫ్రస్టేషన్‌తో ఉన్న మోహనబాబు జర్నలిస్తులపై దాడి చేయడం సరికాదని తెలంగాణ వర్కింగ్ జర్నలస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు మామిడి సోమయ్య,ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య అన్నారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది.

Read More
Next Story