
గ్రూప్-1 నియామకాలు.. జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం..
ఈ పిటిషన్లపై ఏమున్నా సింగిల్ బెంచ్ దగ్గర తేల్చుకోవాలని సూచించింది.
గ్రూప్-1 నియామకాలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరీక్షల ఫలితాల విషయంలో తీవ్ర ఆరోపణలు వెళ్లువెత్తుతున్న క్రమంలో నియామకాలను తాత్కాళికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ టీజీపీఎస్‌సీ అప్పీలు దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని టీజీపీఎస్సీ కోరింది. వీరి అప్పీల్‌ను సీజేతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. బుధవారం ఇదే అంశంపై సింగిల్ బెంచ్ విచారణ చేయనుందని, కాబట్టి ఇప్పుడు ఈ అంశంలో తాము జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది ధర్మాసనం. ఈ పిటిషన్లపై ఏమున్నా సింగిల్ బెంచ్ దగ్గర తేల్చుకోవాలని సూచించింది.