జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు
x

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేయాలంటూ వేసిన పిటిషన్ పై తెలంగాణ హై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేయాలంటూ వేసిన పిటిషన్ పై తెలంగాణ హై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం... ఈ నెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణను కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదిక సమర్పించాలని పేర్కొంది.

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేసుల విచారణను నిందితులు ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ తీరు గతం కంటే మెరుగుపడ్డప్పటికీ.. సంతృప్తికరంగా లేదని మంగళవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో విచారణ సందర్భంగా నెల రోజుల్లో కేవలం 11 మంది నిందితులకు, 9 మంది సాక్షులకు మాత్రమే సమన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సమన్ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక సమర్పించారని, అయితే వారిని విచారించినట్లు గానీ, తీర్పులు వెలువరించినట్లుగానీ దాఖలాలు లేవని కోర్టు పేర్కొంది. గతంలో కంటే పరిస్థితి కొంత నయమే అయినా సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

మరోవైపు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. అరబిందో, హెటిరో లకు భూ కేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. విజయసాయి రెడ్డి తరపు న్యాయవాది జి. అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.


Read More
Next Story