
HILT Policy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్ట్ నోటీసులు
రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
తెలంగాణలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT) పాలసీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యద్ధం జరుగుతోంది. తాజాగా ఈ విషయం హైకోర్టుకు చేరింది. దీనిని విచారించిన న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. వెంటనే సమాధానాలు ఫైల్ చేయాలని పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
అయితే ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీపై సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయించాలని కేఏ పాల్ తన పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది. అయితే ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో హిల్ట్ తీవ్ర చర్చలకు దారితీస్తోంది. రూ.5లక్షల కోట్లు విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం రూ.5వేల కోట్లకే అమ్ముకునే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
అంతేకాకుండా ఈ విషయంలో నిజనిర్ధారణ కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందిన బీఆర్ఎస్. కీలక నేతలతో కూడిన ఈ బృందాలు పారిశ్రామిక వాడల్లో పర్యటించి హిల్ట్ పాలసీలో నిజానిజాలను వెలికితీస్తుందని, ఈ పాలసీపై తాము క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కాగా తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీప బీఆర్ఎస్ కావాలనే విష ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు, మంత్రులు విమర్శిస్తున్నారు.
అవన్నీ అబద్ధాలే: శ్రీధర్ బాబు
హిల్ట్ పాలసీపై వస్తున్న ఆరోపణలని మంత్రి శ్రీధర్ బాబు గతంలోనే ఖండించారు. అసలు ఈ పాలసీలో లీజు భూములను కన్వర్షన్‌కు అనుమతే లేదని చెప్పారు. ‘‘పట్టాలు ఉండి, సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజు పెట్టాం. గత ప్రభుత్వమే సర్కార్ భూములను ప్రైవేటు వ్యక్తులకు అత్తగారి సొమ్ములా పంచుకుంది. వారికి ధారాదత్తం చేస్తూ జీవోను కూడా విడుదల చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రావేత్తలకు ఇస్తూ జీవో తెచ్చారు. ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం హిల్ట్ ద్వారా మేం చేస్తున్నాం. ఈ పాలసీలో ఎస్ఆర్‌ఓ రేటు కన్నా ఎక్కువ ఫీజు పెట్టాం’’ అని ఆయన చెప్పారు.

