‘పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదు’
x

‘పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదు’

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన విధంగా అమలు కావలసిందని తెలిపారు.


తెలంగాణలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి విడుదల చేసిన జీఓ నెం.46ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణ సందర్భంగానే.. ఎన్నికలపై స్టే విధించాలన్న అభ్యర్థనకు న్యాయస్థానం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో స్టే మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.

పిటిషనర్లు తమ వాదనలో అత్యంత వెనుకబడిన కులాలకు (మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌) ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. బీసీ వర్గాలను ఏ, బీ, సీ, డీ గా విభజించి వాటి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన విధంగా అమలు కావలసిందని తెలిపారు. జీవో 46 ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. అయితే నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఎందుకు సవాల్‌ చేస్తున్నారని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రక్రియలో ఉండటంతో ఈ దశలో జోక్యం చేసుకోవడం సముచితం కాదని వ్యాఖ్యానించింది. కేసుపై ప్రభుత్వంలో నుంచి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

Read More
Next Story