మార్గదర్శి బండారం బద్దలవుతుందా ?
x
Margadarsi chits

మార్గదర్శి బండారం బద్దలవుతుందా ?

. రాష్ట్ర విభజన నేపధ్యంలో 2018, డిసెంబర్లో మార్గదర్శి ఛైర్మన్ తనకు హైకోర్టులో క్లీన్ చిట్ తెచ్చుకున్నట్లు మాజీ ఎంపీ ఆరోపిస్తు సుప్రింకోర్టులో కేసు వేశారు.


మార్గదర్శి చిట్ ఫండ్స్ బండారం బద్దలయ్యే రోజు ఎంతో దూరం లేదని అనిపిస్తోంది. మార్గదర్శి వివాదం 2006 నుండి జీడిపాకలంలాగ సాగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. మార్గదర్శి కేసు తేలకుండా దాని యాజమాన్యం వీలైనంతగా లాగుతోంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో 2018, డిసెంబర్లో మార్గదర్శి ఛైర్మన్ తనకు హైకోర్టులో క్లీన్ చిట్ తెచ్చుకున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపిస్తు సుప్రింకోర్టులో కేసు వేశారు. దాంతో మార్గదర్శి వివాదం దేశ అత్యున్నత న్యాయస్ధానంకు చేరుకుంది. ఇపుడు విషయం ఏమిటంటే మార్గదర్శిలోని చందాదారుల వివరాలను తెలుసుకునేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నీ వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లీషు దినపత్రికల్లో విస్తృతంగా ప్రచారంకల్పించాలని కూడా ఆదేశించింది.

మార్గదర్శి యాజమాన్యంతో పాటు ఉండవల్లి వాదనలు విన్న సుప్రింకోర్టు ఆరుమాసాల్లో కేసును ఫైనల్ చేయాలని తెలంగాణా హైకోర్టును ఆదేశించింది. అందుకనే కేసు విచారణ సుప్రింకోర్టు నుండి తిరిగి హైకోర్టుకు చేరుకుంది. ఇపుడు విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్స్ లోని చందాదారుల వివరాలను యాజమాన్యం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. కేసు వేసిన ఉండవల్లి ఎంత ప్రయత్నించినా యాజమాన్యం చందాదారుల వివరాలు ఇవ్వలేదు. ఉండవల్లి ఆరోపణల ప్రకారం సంస్ధలో వేలకోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది. నిజమైన చందాదారులతో పాటు చాలామంది బినామీలున్నారు. ఆ బినామీలు ఎవరి తరపున చందాదారులుగా చేరారు ? అన్న విషయం తేలాలంటే చందాదారుల వివరాలు సమాజానికి తెలియాల్సిందే అన్నది ఉండవల్లి వాదన.

ఉండవల్లి ఆరోపణలు ఏమిటంటే అసలు మార్గదర్శి వ్యాపారమే చట్టవిరుద్ధం. సంస్ధలో చందాదారులతో పాటు బినామీలు కూడా ఉన్నారు. బినామీల రూపంలో మార్గదర్శిలో వేల కోట్లరూపాయల బ్లాక్ మనీ చెలామణి అవుతోంది. తాము చందాదారులమని కూడా కొందరికి తెలీకుండానే యాజమాన్యం వాళ్ళపేర్లతో ఖాతాలు ఓపెన్ చేసి డమ్మీ ఖాతాలను నిర్వహిస్తోంది. బినామీల వివరాలు తెలియాలంటే మొత్తం చందాదారులెవరో తెలియాలి. అందుకనే ఉండవల్లి చందాదారుల వివరాలను బహిర్గతం చేయాలని రామోజీరావును సంవత్సరాలుగా అడుగుతున్నారు. రామోజీ స్పందించకపోవటంతో ఇదే విషయాన్ని కోర్టులో మొత్తకుంటున్నారు.

ఇంతకాలానికి ఉండవల్లి గోలకు హైకోర్టుకు స్పందించింది. చందాదారుల వివరాలు ఇప్పటికే యాజమాన్యం పెన్ డ్రైవ్ రూపంలో సుప్రింకోర్టుకు అందించింది. ఆ పెన్ డ్రైవ్ ను సుప్రింకోర్టు నుండి తెప్పించుకోవాలని ఉండవల్లి హైకోర్టుకు సూచించారు. ఉండవల్లి సూచనకు సానుకూలంగా స్పందించిన కోర్టు చందాదారుల్లో ఎవరికైనా యాజమాన్యం డిపాజిట్లను చెల్లించిందా ? లేకపోతే ఎగ్గొట్టిందా ? అన్న వివరాలు తెలుసుకోమని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే చందాదారుల వివరాల కోసం అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఉండవల్లికి సూచించింది. చందాదారులు, డిపాజిట్ల చెల్లింపు వివరాలను తెలుసుకునేందుకే ఫిర్యాదులను ఆహ్వానిస్తు తెలుగు, హిందీ, ఇంగ్లీషు దినపత్రికల్లో పెద్దఎత్తున ప్రకటనలు ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇప్పటికే యాజమాన్యంపై ఫిర్యాదులున్నాయి. తమకు తెలియకుండానే తమ పేర్లపైన యాజమాన్యం మార్గదర్శిలో ఖాతాలు తెరిచిందని కొందరు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఒకటికిమించి తమతో బలవంతంగా ఖాతాలను యాజమాన్యం ఓపెన్ చేయించిందనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వైసీపీ హయాంలో అందిన ఆ ఫిర్యాదులను ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఏమిచేస్తుందో తెలీదు. ఆ ఫిర్యాదులన్నింటినీ కోర్టుముందు ఉంచుతుందన్న నమ్మకం కూడా లేదు. అయితే చందాదారుల తాలూకు డిపాజిట్ల చెల్లింపు వివరాలపై ఫిర్యాదుల స్వీకరణకు దినపత్రికల్లో ప్రచారం చేయాలని ఆదేశించటంతో ఫిర్యాదులు చేసిన వారు, బాదితులు నేరుగా హైకోర్టునే ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మార్గదర్శి బండారమంతా బద్దలవుతుంది. కేసును బదిలీ చేసేటపుడే కేసు విచారణను ఆరుమాసాల్లో ముగించాలనే గడువును హైకోర్టుకు సుప్రింకోర్టు విధించింది. చందాదారుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఆరుమాసాల గడువును దృష్టిలో పెట్టుకునే ఇచ్చినట్లుంది. మార్గదర్శి వ్యాపారమంతా అక్రమమే అని ఆర్బీఐ కూడా అఫిడవిట్లో స్పష్టంగా చెప్పేసింది. చట్టానికి విరుద్ధంగా చందాదారుల నుండి డిపాజిట్లు సేకరించిందని అఫిడవిట్లో చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి సంవత్సరాల తరబడి కోర్టు విచారణల్లో నానుతున్న మార్గదర్శి వివాదం తొందరలోనే తేలిపోతుందని అనుకుంటున్నారు.

Read More
Next Story