
HCUలో ఉద్రిక్తత.. పలువురు విద్యార్థుల అరెస్ట్
అధికారులు చేపట్టిన చదును పనులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. విద్యార్థులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ భూముల అక్రమ వేలం పాటను నిలిపివేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కాగా ఆదివారం ఆ భూములను జేసీబీల సహాయంతో అధకారులు చదును చేయించడం ప్రారంభించారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. వర్సిటీకి చెందిన 400 ఎకరాలను వేలం వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన చదును పనులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లారు.
ఇందులో భాగంగానే ఈస్ట్ క్యాంపస్ ముందు బారికేడ్‌లు పెట్టారు పోలీసులు. అధికారులు చేయిస్తున్న చదును పనులకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా విద్యార్థుు అటుగా వెల్లి పనులను అడ్డగించాలని చూస్తే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం ఎం చేసినా? ఏం చేసినా? తాము ఆందోళనను విరమించుకోబోమని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.