
ఆశా వర్కర్ల ఆందోళనలో ఉద్రిక్తత.. అరెస్ట్‌లు ప్రారంభించిన పోలీసులు
అరెస్ట్‌లకు భయపడి ఆందోళనను విరమించుకునే ప్రసక్తే లేదని వారు వ్యాఖ్యానించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఆశావర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారు తమ ఆందోళనను ఉద్రిక్తం చేశారు. ఈ క్రమంలో కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశావర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితులు హీటెక్కాయి. తమ సమస్యలను పరిష్కరించకపోగా.. తమను అరెస్ట్‌లు చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని అరెస్ట్‌లు చేసి తమ వాయిస్‌ను అణచివేయాలనుకుంటే అది కలే అవుతుందని, అరెస్ట్‌లకు భయపడి ఆందోళనను విరమించుకునే ప్రసక్తే లేదని వారు వ్యాఖ్యానించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్న క్రమంలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కోఠిలోని ఆరోగ్య కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే తమకు ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తోందని, దానిని పెంచాలని ఆశావర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ వేతనాన్ని కనీసం రూ.18వేలు చేయాలని వారు కోరుతున్నారు. అదే విధంగా కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన తమకు రూ.50 లక్షల ఆర్థిక భరోసా బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. మరణించిన ఆశావర్కర్ల కుటుంబాలకు రూ.50వేల సహాయం అందించాలని, విధుల్లో ఉండి మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుతో పాటు రూ.50వేలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లను పూర్తి చేయాలంటూనే వారు ఆందోళనకు దిగారు.