
హైదరాబాద్ పారిశ్రామిక వాడ : ఇక కొత్త రూపురేఖలు
హిల్ట్–2025: రియల్ ఎస్టేట్ చేతిలోకి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్
కాటేదాన్ నుంచి సనత్ నగర్ వరకు… పారిశ్రామిక భూముల్లోె నగరాభివృద్ధా? లేక భూస్కామా?
హైదరాబాద్ నగర రూపురేఖలు మారబోతున్నాయి. ఓఆర్ఆర్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడ్ల భవిష్యత్తు ఇప్పుడు కొత్త మలుపు తీసుకోబోతోంది. కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించి, ఆ విలువైన భూములను మల్టీ యూజ్ జోన్‌లుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హిల్ట్ (Hyderabad Industrial Lands Transformation (HILT) Policy-2025) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం నగర అభివృద్ధికి మార్గం చూపుతుందని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా, ఇది భూ బదలాయింపుల పేరిట భారీ లాభాలు కొందరికే చేరనున్నాయని మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని భూములను బహుళ వినియోగ జోన్ లుగా మార్చుకోవడానికి వీలుగా తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్టుమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ జీఓఎంఎస్ నంబరు 27 పేరిట నవంబరు 22వతేదీన ఉత్తర్వులు జారీ చేశారు.దీని కోసం హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానం (HILTP) పేరిట పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.
మల్టీ యూజ్ జోన్ గా మారనున్న పారిశ్రామిక వాడలు
హైదరాబాద్ నగరంలో ఉన్న 22 పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ పార్కుల్లోని కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించి, ఈ భూములను మల్టీ యూజ్ జోన్ (Multi Use Zone) గా మార్చాలని నిర్ణయించారు. ఈ విధానం లో నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్, మేడ్చల్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్ చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, కాటేదాన్, హయత్ నగర్ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల భూములను మార్చి ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. దీని కోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) 2025 ని రేవంత్ రెడ్డి సర్కారు తాజాగా తీసుకువచ్చింది. పారిశ్రామికవాడల భూములను బదలాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు చెప్పారు.
పారిశ్రామికవాడల భూములను ఏం చేస్తారంటే...
ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లు, పార్కులు, ఆటోనగర్‌లకు చెందిన భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద ఇండస్ట్రియల్ నుంచి బహుళ వినియోగ జోన్ గా మార్చనున్నారు. నివాస అవసరాల కోసం అపార్ట్ మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లు, కార్యాలయాలు, రిటైల్, కేంద్రాలు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు, క్రీడాసౌకర్యాలు, సాంస్కృతిక కేంబద్రాలు, టెక్నాలజీ పార్కులు, క్యాంపస్ ల నిర్మాణానికి అనుమతించనున్నారు. జీఓఎంఎస్ నంబరు 27 ప్రకారం పరిశ్రమల ముందున్న రోడ్ల విస్తీర్ణాన్ని బట్టి రుసుమును వసూలు చేయాలని నిర్ణయించారు. 22 పారిశ్రామిక పార్కులను మల్టీయూజ్ జోన్‌లుగా మార్చనున్నారు. దీని ద్వారా 9,200 ఎకరాల్లో 4,740 ప్లాట్లు, కార్యాలయాలు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, హోటళ్లు,టెక్ పార్కులను అనుమతించనున్నారు.
నగరాభివృద్ధికి ఆస్కారం...
హైదరాబాద్ నగర విస్తరణతోపాటు పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానం (HILTP)ను ఆమోదించిందని, దీని వల్ల నగరాభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ డీజీఎం డి మాధవి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) 2025 విధానాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.
పారిశ్రామికవాడల్లో వాణిజ్య భవనాల నిర్మాణమా?
హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వాడల్లోని భూములన్నీ బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్నాయని వాటిని భూబదలాయింపులు చేయడం ద్వారా వారికే ప్రయోజనం కలుగుతుందని హైదరాబాద్ నగరానికి చెందిన అరవింద రియల్ ఎస్టేట్ కంపెనీ రియల్టర్ రాపోలు సతీష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం బడా పారిశ్రామిక వేత్తలకే ప్రయోజనం కల్పిస్తుందని, రియల్ ఎస్టేట్ రంగానికి దీనివల్ల బూస్ట్ రాదని ఆయన వ్యాఖ్యానించారు.
అభివృద్ధి మంచిదే : యం పద్మనాభరెడ్డి
అయితే, ఫోరం ఫర్ గుడ్ (FGG) గవర్నెన్స్ ఈ నిర్ణయానికి స్వాగతం పలికింది. పారిశ్రామికవాడల భూములను అభివృద్ధి చేయడం సరైన విధానమేనని ఫోరం అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భూస్కాం అంటూ ఆరోపణలు చేస్తూ, అభివృద్ధిని అడ్డుకోరాదని ఆయన వ్యాఖ్యానించారు. 22 పారిశ్రామిక వాడల్లో భవనాలు నిర్మిస్తే నగరం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
కాలుష్య ప్రాంతాల్లో నివాసాలా?
కానీ, ఈ పారిశ్రామిక వాడలన్నీ కాలుషితం అయ్యాయని, అక్కడ నివాస కాలనీలు నిర్మిస్తే వచ్చే అనర్థాలను విస్మరించరాదని పర్యావరణ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సార్వత్ చెప్పారు. హైదరాబాద్ నగరంలోని 22 పారిశ్రామిక వాడలు, పార్కుల్లో పరిశ్రమల వల్ల ఆయా ప్రాంతాల్లోని భూగర్భజలాలు కలుషితమయిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ఇక్కడ నివాస భవనాలు నిర్మిస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు. "అరవై ఏళ్ల పాటు పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు నడిపిన పారిశ్రామికవేత్తలు ఆయా వాడల్లోని నీటిని, వాతావరణాన్ని కలుషితం చేశారు. ఈ పరిశ్రమలనుంచి కలుషితాలను స్వేచ్ఛగా విడుదల చేశారు. ఈకలుషిత జలాలు భూగర్భంలోకి ఇంకిపోయాయి. ఇలాంటి కాలుష్య కారక పరిశ్రమల వాడల్లో నివాసాలు నిర్మిస్తే ప్రజలు కాలుష్యం కాటుకు గురువుతారు," అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బడా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం కల్పించే చర్య అని చెబుతూ పారిశ్రామిక వాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చే నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించారు.ఇప్పటికే కాలుష్యం నిండిన వాడలకు పారిశ్రామికవేత్తలు కారణమైనందున వారి నుంచి పరిహారం తీసుకోవాలని ఆమె సూచించారు.
హైదరాబాద్ భూమి కొనుగోలుదారులకు గేమ్ ఛేంజర్ పాలసీ
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 22 ప్రధాన పారిశ్రామిక భూములను కొత్తగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP-2025) కింద చేర్చడం గేమ్ ఛేంజర్ పాలసీ అని హైదరాబాద్ రియల్టర్ బి హరీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విధానం రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు.
అత్యంత చవకగా భూములు కట్టబెట్టే యత్నం : బీఆర్ఎస్
రెండేళ్లలో పారిశ్రామిక భూములు భారీగా చేతులు మారాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించింది. తెరవెనుక అనధికారిక భూముల డీల్స్ చేసుకొని హడావుడిగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించింది. ‘‘రెండేళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసిన లక్షన్నర కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా చాపకింద నీరులా సర్కారు భూములను దోచేయాలి’’ అధికారపార్టీ పెద్దల తీరు అని బీఆర్ఎస్ ఆరోపించింది. మళ్లీ అవకాశం వస్తదో, రాదో అని అందినకాడికి ఇప్పుడే దోచుకుందామనే ధోరణి ఇదని ప్రతిపక్షపార్టీ ఆరోపించింది. ఐదు దశాబ్దాలుగా ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలిచ్చిన భూములను అగ్గువకే తెగనమ్మే ప్రజాధన సంతర్పణ ఈ పథకమని పేర్కొంది. పారిశ్రామిక భూములను చవకగా అమ్మే ఎత్తుగడ అని, ‘హిల్ట్’ పేరిట అనధికార ఒప్పందాలకు తెరలేపిన కాంగ్రెస్ సర్కారు ఐదు లక్షల కోట్ల రూపాయలను వెనకేసుకునే భూదందాకు తెరవెనుక రంగం సిద్ధం చేసిందని బీఆర్ఎస్ విమర్శించింది.
దేశంలోనే అతిపెద్ద భూ స్కాం : కేటీఆర్
రేవంత్ బ్రదర్స్ చేస్తున్న రూ. 5 లక్షల కోట్ల భూ స్కాం అని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.పారిశ్రామిక భూముల బదలాయింపు పాలసీతో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని ఆయన చెప్పారు. బాలానగర్, కాటేదాన్, జీడిమెట్లలోని 9,300 ఎకరాల పారిశ్రామిక భూములపై రేవంత్ కన్ను పడిందన్నారు. ప్రజల ఆస్తిని రేవంత్ తన కుటుంబానికి, సన్నిహితులకి అక్రమంగా అప్పజెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు.ఈ భూ స్కాంపై న్యాయపోరాటం చేస్తామని, తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతామని కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగర భవిష్యత్తును మార్చే సర్కారు నిర్ణయం ఇప్పుడు ప్రజల్లో, నిపుణుల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. పారిశ్రామిక భూముల పరివర్తన నగరానికి కొత్త ఊపు తెస్తుందనే ఆశలు ఒకవైపు ఉండగా, కాలుష్యం, పారదర్శకత, భూ బదలాయింపులపై ఉన్న సందేహాలు మరోవైపు నిలుస్తున్నాయి. ఈ 22 పారిశ్రామిక వాడలు నిజంగా మల్టీ యూజ్ జోన్‌లుగా మారి నగర అభివృద్ధికి బలం అవుతాయా? లేక విమర్శకులు చెబుతున్నట్లే మరో భూ వివాదానికి నాంది అవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం హిల్ట్ విధానం అమలు ఎలా జరుగుతుందన్న దానిలోనే దాగి ఉంది.
Next Story

