
‘ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే కొందరి పని’
HILT పాలసీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తమ ప్రభుత్వం ఏం చేసినా తప్పుబట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ధోరణి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు చేస్తుందని, కానీ ప్రతిపక్షాలు మాత్రం బురదజల్లడమే పరమావధిగా మాట్లాడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారాయన. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న HILT పాలసీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆ పాలసీని తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించనుందని వివరించారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్‌పై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్‌ను పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్మించలేదో చెప్పాలి’’ అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి విద్యాత్ ప్లాంగ్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం కాలం చెల్లిన పద్దతిలో చేపట్టిందని విమర్శించారు. దాని వల్ల ఆ విద్యుత్ ప్లాంట్‌ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. సబ్ క్రిటికల్ పద్దతి వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
‘‘యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి కూడా భారంగా మారింది. ఛత్తీస్‌గఢ్ నుంచి చేసిన విద్యున్ కనుగోళ్లలో కూడా అవకతవకలు ఉన్నాయి. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్‌లో అవినీతి ఎలా జరుగుతుంది? అని ఉత్తమ్ ప్రశ్నించారు.

