బోనాలు ఎందుకు జరుపుతారు? చరిత్ర ఏంటి?
x

Pic Credits : Facebook

బోనాలు ఎందుకు జరుపుతారు? చరిత్ర ఏంటి?

తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా వైభవంగా నిర్వహిస్తున్న బోనాలు పండుగ విశేషం ఏంటి? ఈ పండుగ చరిత్ర ఏంటి? ఎలా జరుపుతారు? ఆ వివరాలన్నీ సంక్షిప్తంగా..


తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరుపుకునే బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి, పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని వేశాక నీళ్లతో కూడిన సాకను సమర్పించడం ఆనవాయితీ. పోతురాజులు, శివసత్తుల వేషాలు, డప్పు వాయిద్యాల నడుమ నాట్యాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. తెలంగాణలో విశేషంగా జరుపుకునే ఈ పండుగ కాకతీయుల కాలం నుంచే ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు.

బోనాలు అనేది తెలంగాణ ప్రజలు కొలిచే మహంకాళి దేవిపై కేంద్రీకృతమై ఉన్న సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ఏటా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. ఇది జులై, ఆగష్టు మాసాల్లో వచ్చే ఆషాడ మాసంలో జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజున మహంకాళి రూపమైన ఎల్లమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోరికలు నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలిపే ఆచారంగా కూడా ఈ పండుగ పరిగణించబడుతుంది.

బోనం అంటే?

బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని చెబుతారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యంగా చెబుతారు. స్త్రీలు కొత్త ఇత్తడి పాత్రలో కానీ, మట్టి కుండలో కానీ బియ్యం, పాలు, బెల్లం వేసి నైవేద్యం వండుతారు. ఈ కుండకి పసుపు పూసి, తెల్లటి సున్నం లేదా బియ్యపుపిండి, కుంకుమ బొట్లుతో అలంకరించి, వేప ఆకులు కడతారు. ఈ కుండ పైన దీపం వెలిగిస్తారు. ఈ కుండలను మహిళలు తమ తలపై మోస్తూ గుడికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ వంటి ప్రాంతీయ రూపాల్లో దేవతామూర్తిని పూజిస్తారు. అలాగే వేటపోతు మెడలో వేపమండలుకట్టి పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

బోనాలు పండుగ చరిత్ర..

ఒక కథనం ప్రకారం కాకతీయ దేవతకి ఎదురుగా శుచిగా వండిన అన్నాన్ని కుంభంలా పోసి అమ్మవారిని ఆరాధించేవారని చెబుతుంటారు. ఇదే కాలక్రమేణా కొత్త రంగులు పులుముకుని బోనాల పండుగలా వైభవోపేతంగా జరుపుతున్నారని ప్రతీతి.

మరోవైపు జూన్ చివరి నుండి ఆగస్టు వరకు వచ్చే ఆషాడ మాసం లో మహాకాళి దేవి తన పుట్టింటికి వెళుతుంది అని పౌరాణిక కథనాలు ఉన్నాయి. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

గోల్కొండ బోనాలు..

నిజాం నవాబుల కాలంలో.. గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లేగు వ్యాధికి ఎంతోమంది చనిపోయారట. స్థానికుడి కలలోకి వచ్చిన అమ్మవారు బోనాలు సమర్పించమని కోరిందని, ఆ కోరిక ప్రకారం గోల్కొండ మహంకాళికి బోనాలు సమర్పించారట. ఆ తర్వాత ప్లేగు వ్యాధి తగ్గడంతో ఏటా భక్తులు గోల్కొండ కోటలోని మహంకాళికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని చెబుతున్నారు.

లష్కర్ బోనాలు...

"1813వ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది ప్రాణాలను బలిగొంది. అప్పటి నిజాముల కాలంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి ఒక మిలటరీ బెటాలియన్ ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి తరలించారు. అదే సమయంలో ప్లేగు వ్యాధి హైదరాబాద్ లో ప్రబలిందని సమాచారం అందుతుంది. ఆందోళన చెందిన మిలిటరీ బెటాలియన్ ఉజ్జయినిలోని మహాకాళి ఆలయంలో పూజలు జరిపారు. ప్లేగు వ్యాధిని నశింపజేయమని, తమవారిని రక్షించమని అమ్మవారిని వేడుకుంటారు. తమ కోరిక నెరవేరితే ఇంటికి తిరిగి వెళ్ళగానే నగరంలో మహంకాళి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మొక్కుకుంటారు. బెటాలియన్ వారి స్వదేశానికి తిరిగి వచ్చేసరికి ప్లేగు వ్యాధి నశిస్తుంది. దీంతో అమ్మవారు తమ కోరిక నెరవేర్చిందని భావించిన వారు.. సికింద్రాబాద్ లో మహంకాళి ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ఆమెకు బోనాలు సమర్పించారు. అప్పటి నుంచి బోనాలు పండుగ తెలంగాణలో చాలా మంది అనుసరించే సంప్రదాయంగా మారింది" అని స్థానికులు చెబుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణలు..

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ చిందులు వేస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలలో అమ్మవారు ఆవహిస్తారని ప్రజల విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. అలాగే భక్తులు తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల తొట్టె) సమర్పించడం కూడా ఆచారంగా ఉంది.

అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కట్టి చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతన్ని పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తులను ఆలయములోని అమ్మవారి సన్నిధికి తీసుకెళతాడు.

గోల్కొండలో మొదలై...

బోనాల పండుగ ఒక ఆలయం తర్వాత మరో ఆలయంలో నిర్వహించడంలోనూ క్రమపద్ధతి పాటిస్తారు. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా లాల్ దర్వాజా బోనాలు జరుపుకునేందుకు ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆషాడ బోనాల జాతర గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయంలో మొదలవుతుంది. ఇది ఆషాఢ మాసంలో మొదటగా వచ్చే గురువారం లేదా ఆదివారం రోజు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి ఆది, గురువారం బోనాల జాతర జరుగుతుంది. ప్రతి గుడిలో ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉంటారని భక్తులు నమ్ముతారు. గోల్కొండ బోనాలు జరిగిన రోజున గోల్కొండ ప్రాంతంలోని ఆ ఏడుగురు అక్కచెల్లెళ్లకూ బోనాలు ఇస్తారని... గోల్కొండ చుట్టూ ఉన్న కార్వాన్, ధూల్పేట, పత్తరఘట్టి, రాయదుర్గం వరకు గోల్కొండ బోనాలు జరుపుకొంటారు.

గోల్కొండ మహంకాళి అమ్మవారి బోనాల కోసం ఉజ్జయిని మహంకాళి ఎదురు చూస్తుంది. గోల్కొండలో బోనాలు జరిగిన తర్వాత వచ్చే ఆదివారం రోజున లష్కర్ లోని (సికింద్రాబాద్) ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు పండుగ చేసుకుంటారు. అదే రోజున లష్కర్లో ఉన్న ఏడుగురు అక్కచెల్లెళ్ల ఆలయాలన్నిటిలో బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మౌలాలి, ఈసీఐఎల్ సమీప ప్రాంతాల వరకు లష్కర్ బోనాలు జరుపుకొంటారు. తొట్టెల ఊరేగింపు, పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో లష్కర్ బోనాలు జంటనగరాల్ని ఒక్కటి చేస్తాయి.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం లాల్ దర్వాజ బోనాలు ఎదురుచూస్తాయి. లాల్ దర్వాజ బోనాలు జరుపుకొనే రోజే పాతబస్తీలోని ఏడుగురు అక్కచెల్లెళ్లకు బోనాలు సమర్పిస్తారు. శివసత్తుల పూనకాలు, కోడెనాగులాంటి కొరడా చేబూని, వీరగోలలు మోగించుకుంటూ, కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మోగిస్తూ వీరంగాలు ఆడే పోతరాజుల విన్యాసాలతో పాతబస్తీ వీధులు జనసంద్రమవుతాయి. బోనాలెత్తిన మహిళలతో వీధులన్నీ ఆలయాల వైపునకు ప్రవహిస్తున్నాయా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది.

రంగం..

రంగం, పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పచ్చికుండను భూమిలోకి పాతి, దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి మాతంగికి ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. ఆమె ఆ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. రంగం సమయంలో మాతంగిలోకి అమ్మవారు ప్రవేశిస్తారని భక్తుల విశ్వాసం.

ఘటం..

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా సింహ వాహిని మహంకాళి, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా, సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.

విందు భోజనాలు..

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించే... పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. అమ్మవారికి బలిచ్చిన కోళ్లను, మేకలను వండుకుని బంధువులతో కలిసి విందుభోజనం చేస్తారు.

బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు..

బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. ఆ కుండపై ఒక దీపాన్ని కూడా ఉంచుతారు. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవన్నీ యాంటీ సెప్టిక్, యాంటీబయాటిక్స్ కాబట్టి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందువలన ఈ బోనానికి పవిత్రత, శుభ్రత ఉంటుందని నమ్ముతారు. అది ప్రసాదంగా స్వీకరించడం వలన శరీరానికి మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతారు. బోనాలు నిర్వహించిన ప్రాంతంలోని గాలి పీల్చడం కూడా ఆరోగ్యకరమే అనుకుంటారు. అలాగే బోనం పై దీపం ఎందుకు పెడతారంటే... ఒకవేళ బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు ఆ దీపమే దారి చూపిస్తుంది.

ఆషాఢ మాసంలోనే ఎందుకు?

వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసమంతా ఉండి భాద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి. ఈ సీజన్ లో వచ్చే అంటు వ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర జంతువులతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ పసుపు, వేపాకులను ఉపయోగించే బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావణ మాసాల్లో స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవడంతో నీటిలో తడవడంవల్ల వచ్చే పాదాల ఇన్ఫెక్షన్లను, పగుళ్ళను నివారించవచ్చని విశ్వాసం. అలాగే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు. దీంతో యాంటీ బ్యాక్టీరియల్ ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది. దీంతో వైరల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని నమెవరు. అందుకే ఈ పండగలో వేపాకులు ప్రధానంగా వాడతారు.

Read More
Next Story