AWARD | నిజాయితీగా విధులు..స్వచ్ఛందంగా సేవలు, ఇదీ అంజపల్లి ఆదర్శం
కూలీగా పనిచేస్తూనే చదివి పోలీసుశాఖలో ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగిన అంజపల్లి నాగమల్లు నీతి, నిజాయితీగా పనిచేస్తూ సమాజ సేవలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని రవీంధ్రభారతిలో ‘అవే’ స్వచ్ఛంద సంస్థ 15వ జాతీయ సదస్సులో నిజాయితీ అధికారి అయిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ఇన్ స్ఫెక్టర్ అంజపల్లి నాగమల్లుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సత్కరించారు. అంతే రవీంధ్రభారతిలోని ప్రేక్షకులు చప్పట్లతో నాగమల్లుకు అభినందనల వర్షం కురిపించారు. అవే అవార్డు పొందిన నాగమల్లు శుక్రవారం ‘ఫెడరల్ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
చిల్పకుంట్ల గ్రామం నుంచి...
సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలోని కూలీ కుటుంబానికి చెందిన లక్ష్మయ్య, నర్సమ్మ దంపతుల కుమారుడైన అంజపల్లి నాగమల్లు కూలీగా పనిచేస్తూనే కష్టపడి ఉన్నత చదువులు చదివారు.నాగమల్లు వేసవి సెలవులు, ఆదివారాల్లో కూలీగా పనిచేస్తూనే బీఎస్సీ, బీఈడీ, ఎల్ఎల్ బీ వరకు చదివారు.
పోలీసు ఎస్ఐగా ఉద్యోగం
2009వ సంవత్సరంలో అంజపల్లి నాగమల్లుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, పోలీసు ఎస్ఐగా రెండు ఉద్యోగాలు ఒకే సారి వచ్చాయి.ఉపాధ్యాయుడిగా భావిభారత పౌరులను తయారు చేయవచ్చు, కానీ పోలీసు ఎస్ఐ అయితే ప్రజలకు సేవ చేయవచ్చని పోలీసు శాఖలో చేరారు. ఉద్యోగంలో స్థిరపడిన నాగమల్లు కూలీగా తాను పడిన కష్టాలు మర్చిపోలేదు.ఉద్యోగం చేస్తూనే తనకు ఉన్నంతలో నిరుపేదలకు సేవ చేయాలనే ఉన్నతాశయంతో నాగమల్లు స్వచ్ఛంద సేవలకు శ్రీకారం చుట్టారు.
43 సార్లు రక్తదానం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడి రక్తం కోల్పోయిన వారికి తానున్నానంటూ ముందుకు వచ్చిన నాగమల్లు 43 సార్లు రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తదానం చేయడం ద్వారా వారికి ప్రాణం పోసే అవకాశం తనకు లభించిందని నాగమల్లు చెప్పారు.,
క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం
ట్రాఫిక్ పోలీసు అధికారిగా నిత్యం రోడ్డుపై విధి నిర్వహించే నాగమల్లు రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు వెంటనే సంఘటన స్థలాలకు వచ్చి తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ సాయంతో క్షతగాత్రులకు సత్వరం కట్టు కట్టి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించాడు. రోడ్డు ప్రమాదాల గురించి వైర్ లెస్ సెట్లో సమాచారం రాగానే వెంటనే అక్కడకు వెళ్లి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న 400 మంది సకాలంలో ప్రాథమిక వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడారు. క్షతగాత్రులకు తన సొంత డబ్బును అందించి ఆపదల్లో ఆదుకున్నారు.
నిరుపేదలకు ఇళ్లు కట్టించిన మానవతావాది
తన స్వగ్రామమైన చిల్పకుంట్లలో మట్టె చంద్రయ్య, పంతం పూలమ్మలకు సొంత ఇల్లు లేక గుడిసెల్లో దుర్భర జీవితం గడుపుతుండటం చూసిన నాగమల్లు వారికి తన 2.7 లక్షల రూపాయల సొంత నిధులతో రెండు ఇళ్లు నిర్మించి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
కరోనా సమయంలో అన్నదానం
కరోనా సమయంలో పోలీసు ఇన్ స్పెక్టరుగా పనిచేస్తూనే నాగమల్లు తన సొంత డబ్బుతో చైతన్యపురి, ఎల్ బీ నగర్, ఇందిరానగర్, మన్సురాబాద్, లేబర్ కాలనీల్లోని వలస కూలీలు 30వేలమందికి అన్నదానం చేసి వారిని ఆదుకున్నారు.
వందకు పైగా పాటలు పాడి...చైతన్యం నింపి...
డయల్ 100, గంజాయి, డ్రగ్స్,మూఢనమ్మకాలు, కరోనా మహమ్మారిపై ఇన్ స్పెక్టర్ నాగమల్లు వందకు పైగా పాటలు రాసి, స్వయంగా పాడి చైతన్యం నింపారు. ఒగ్గు కథలు, బుర్రకథలతో సామాన్యుల్లో కరోనాపై అవగాహన కల్పించారు.
కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడమే నా లక్ష్యం : నాగమల్లు
‘‘నేను సామాన్య కూలీ కుటుంబంలో జన్మించి కూలీగా పనిచేసి ఇన్ స్పెక్టరుగా ఉన్నత స్థాయికి ఎదిగాను. బాల్యంలో నేను పడిన కష్టాలు ఇతరులు పడకూడదనే లక్ష్యంతో నాకు ఉన్నంతలో వారిని ఆదుకోవడంలోనే నాకు ఆనందం ఉంది, అందుకే నేను ఎక్కడ పనిచేస్తున్నా స్వచ్ఛంద సేవలు కొనసాగిస్తుంటాను’’ అని చెప్పారు ఇన్ స్పెక్టర్ నాగమల్లు. ప్రస్థుతం హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూం విభాగంలో ఇన్ స్పెక్టరుగా పనిచేస్తున్న నాగమల్లు స్వచ్ఛంద సేవలకు పలువురు సోషల్ మీడియాలో హాట్సాప్ చెప్పారు.
Next Story