రేవంత్ ప్రభుత్వానికి హనీమూన్ సమయం అయిపోయిందా ?
x
Telangana JAC meeting

రేవంత్ ప్రభుత్వానికి హనీమూన్ సమయం అయిపోయిందా ?

ఉద్యోగుల లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ సమయం అయిపోయింది. అందుకనే ఆ విషయాన్ని గుర్తుచేయటానికి ఉద్యోగుల సంఘాలన్నీ రెడీ అయ్యాయి.


ఉద్యోగుల లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ సమయం అయిపోయింది. అందుకనే ఆ విషయాన్ని గుర్తుచేయటానికి ఉద్యోగుల సంఘాలన్నీ రెడీ అయ్యాయి. వివిధ శాఖల్లోని ఉద్యోగ సంఘాల నేతలంతా సోమవారం జేఏసీగా ఏర్పడ్డారు. సుదీర్ఘ సమావేశం తర్వాత 15 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసుకున్నారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా ఉద్యోగుల డిమాండ్లలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్న విషయాన్ని జేఏసీ చర్చించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకోవటానికి కొంతసమయం ఇవ్వాలనే ఇంతకాలం తమ డిమాండ్ల విషయాన్ని ప్రభుత్వం ముందు ఉంచలేదని జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్ రావు, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు.

విదేశాల నుండి రేవంత్ హైదరాబాద్ రాగానే తమ డిమాండ్ల విషయాన్ని చర్చించాలని జేఏసీ డిసైడ్ చేసింది. ప్రస్తుతం 15 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినా తొందరలోనే అన్నీ ఉద్యోగసంఘాల నేతలతో కలిసి పూర్తిస్ధాయి జేఏసీని ఏర్పాటు చేయబోతున్నట్లు జగదీశ్వర్ ప్రకటించారు. ఉద్యోగుల డిమాండ్ల గురించి రేవంత్ చర్చించి పరిష్కారానికి తగిన సమయం ఇవ్వాలని కమిటి డిసైడ్ చేసింది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఏమి చేయాలో జేఏసీ నిర్ణయిస్తుందని మారం చెప్పారు. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం 15 రోజుల్లో యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని కూడా కమిటి డిసైడ్ చేసింది.

జగదీశ్వర్ మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమే అన్నారు. రేవంత్ బాధ్యతలు తీసుకోగానే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని బట్టి సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలని అడిగిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకనే తొమ్మిది నెలలు ఉద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వంతో చర్చించలేదన్నారు. ఉద్యోగుల్లో ఓపిక నశిస్తోంది కాబట్టి విదేశాల నుండి రేవంత్ తిరిగిరాగానే సమస్యల పరిష్కారంపై చర్చించబోతున్నట్లు చెప్పారు.

ఉద్యోగుల డిమాండ్లు ఏమిటి ?

సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపట్టాలని, మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని వెంటనే అమల్లోకి తేవాలని, పెండింగులో ఉన్న నాలుగు డీఏలని విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలుచేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, జీవో 317 సమస్యను వెంటనే పరిష్కరించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. నిజానికి ఈ డిమాండ్లన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెండింగులో ఉన్నాయి. అప్పట్లో ఏవో మాటలు కేసీఆర్ నెట్టుకొచ్చారు. దాంతో ఇపుడవన్నీ రేవంత్ ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతున్నాయి.

53 సంఘాలతో సమావేశం

తాజా సమావేశం వివిధ ప్రభుత్వ శాఖల్లోని 53 సంఘాలతో జరిగినట్లు ఏలూరి చెప్పారు. వీళ్ళందరితో చర్చించి స్టీరింగ్ కమిటిని ఏర్పాటుచేసినట్లు ప్రకటించారు. తొందరలోనే మరిన్ని సంఘాల నేతలతో సమావేశం జరిపి కమిటీని విస్తరించబోతున్నట్లు చెప్పారు. సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ ప్రయారిటి మాత్రం 36 సమస్యలుగా గుర్తించినట్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యన్నింటినీ జేఏసీ ద్వారానే ప్రభుత్వంతో చర్చించబోతున్నట్లు తెలిపారు. రేవంత్ తో బేటీలో స్పందన బట్టి ఉద్యమ కార్యాచరణను నిర్ణయిస్తామని ఈ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More
Next Story