
పరువు హత్య కాదు.. ఆత్మహత్య..!
కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందని భావించిన ఒక తండ్రి తన ప్రాణాన్ని వదిలేశారు.
పరువు హత్యలు జరగడం చాలానే చూశాం.. కానీ పరువు ఆత్మహత్య జరగడం బహుశా ఇదే తొలిసారేమో. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందని భావించిన ఒక తండ్రి తన ప్రాణాన్ని వదిలేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య కుమార్తె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే పట్టణనానికి చెందిన దళిత యువకుడిని ప్రేమించింది. మార్చి 8న కుటుంబీకులకు తెలియకుండా ప్రేమికుడిని పెళ్ళాడింది. ఈ విషయం తెలియని గట్టయ్య.. తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు.. గట్టయ్య కుమార్తె వివాహం చేసుకుని ఎస్పీ దగ్గర సరెండర్ అయిన విషయాన్ని తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కలిసేందుకు ఆమె ఇష్టపడటం లేదని గట్టయ్యకు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన గట్టయ్య 10న ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. తండ్రి మృతి వార్తను బంధువులు ఫోన్ ద్వారా కుమార్తెకు తెలియజేసి చివరి చూపు కోసం రావాలని కోరినా, ఆమె నిరాకరించిందని పోలీసులు తెలిపారు.