
నాగంగారు..ఎలాగున్నారు ?
నాగం అమరావతికి వెళ్ళి అసెంబ్లీలోని ఛాంబర్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు.
చాలాకాలం తర్వాత పాతమిత్రులు ఇద్దరు కలిశారు. ఇంతకీ పాతమిత్రులు ఎవరంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీమంత్రి నాగం జనార్ధనరెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని సీనియర్ నేతల్లో, టీడీపీ ప్రముఖుల్లో డాక్టర్ నాగం కూడా ఒకరన్న విషయం తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి ఐదుసార్లు గెలిచిన నాగం(Nagam Janardhan Reddy) అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన కారణంగా ఎంతోమంది సీనియర్ నేతల్లాగే నాగం రాజకీయ భవిష్యత్తు కూడా కుదుపులకు లోనైంది. టీడీపీకి రాజీనామా చేసిన నాగం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో చేరటంతో పాటు సొంతంగా పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. సడెన్ గా అడిగితే నాగం ఇపుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పటం కూడా కష్టమే. అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు డాక్టర్ దూరంగా ఉంటున్నారు.
అలాంటి నాగం గురువారం అమరావతిలోని అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు(Chandrababu)ను కలిశారు. ఇంతకీ నాగం అమరావతి(Amaravathi)కి ఎందుకు వెళ్ళారంటే ఓటులాపురం మైనింగ్(Obulapuram Mining Company) వ్యవహారానికి సంబంధించి అప్పట్లో టీడీపీ అనేక ఆందోళనలు చేసింది. ఆందోళనల్లో నాగం చాలా చురుకుగా పాల్గొన్నారు. అందుకని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చాలామంది మీద కేసులు పెట్టినట్లే నాగంమీద కూడా కేసులు నమోదుచేసింది. కేసుల విచారణలో భాగంగా నాగం ఈరోజు ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కేసులను విచారించిన కోర్టు ఈ కేసులన్నింటినీ కొట్టేసింది. కోర్టు విచారణ తర్వాత నాగం అమరావతికి వెళ్ళి అసెంబ్లీలోని ఛాంబర్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు.
చాలాకాలం తర్వాత కలిసిన సన్నిహిత మిత్రుడిని చంద్రబాబు సాధరంగా ఆహ్వానించారు. ఇద్దరు కలిసి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టీడీపీ చేసిన ఆందోళనలు, సాధించిన విజయాలను ఇద్దరు గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కుటుంబసభ్యుల యోగక్షేమాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును చూసి నాగం కూడా హ్యాపీ అయ్యారు. నాగం మీద ప్రజాప్రతినిధుల కోర్టు కేసులను కొట్టేయటంపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు.