
లష్కర్ అమ్మవారు ఉజ్జయిని మహంకాళీగా ఎలా మారింది ?
బ్రిటీషు హాయం నుంచి పూజలందుకుంటున్న అమ్మవారు
లష్కర్ అమ్మవారికి ఉజ్జయినీకి సంబంధం ఏమిటి? ఎక్కడో మధ్యప్రదేశ్ ఉజ్జయిని పేరు లష్కర్ అమ్మవారికి రావడానికి కారణం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఉజ్జయినీ నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి లష్కర్ లో ప్రతిష్టించారు కాబట్టి ఉజ్జయినీ మహంకాళీ అని పిలుస్తారు. ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్లు చెప్పేస్తున్నారు.
బ్రిటీష్ ప్రభుత్వ హాయంలో సైన్యం సికింద్రాబాద్ లో ఉండేది. సైనిక బలగాలకు క్యాంపులు సికింద్రాబాద్ లో ఉండేవి. ప్రస్తుతం కూడా అక్కడే ఉన్నాయి.
రెండు శతాబ్దాల క్రితం నిజాం ప్రభుత్వం సికింద్రాబాద్ పేరు కాస్తా లష్కర్ గా మార్చేసింది. ఉర్దూలో లష్కర్ అంటే సైన్యం అని అర్థం. నిజాం ప్రభుత్వ హాయంలో కూడా సైనిక బలగాలు సికింద్రాబాద్ లో ఉండేవి.
నిజాం హాయం నుంచి ఉజ్జయినీ మహం కాళీ పెద్ద ఎత్తున పూజలు అందుకుంటోంది . ప్రతీయేడు ఆషాడమాసంలో బోనాలు జరిగేవి. కాబట్టి లష్కర్ బోనాలు అని పిలుచుకునేవారు
ఆషాడ మాసంలో హైద్రాబాద్ లో బోనాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చారిత్రాత్మక గోల్కొండ ప్రాంగణంలోని జగదాంబ దేవాలయంలో సప్త మాతృకల బోనం సమర్పించిన సంగతి తెలిసిందే గోల్కొండ జగదాంబ దేవాలయం తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 29న అమ్మవారికి ఎదుర్కోలు ఉంటుంది. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా బోనాలు వేడుకలను నిర్వహిస్తున్నారు.
బ్రిటీషు సైన్యంలో ఉన్న సూరటి అప్పయ్య అమ్మవారి భక్తుడు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి నిర్వహించే బోనాలును లష్కర్ బోనాలు అంటారు. సికింద్రాబాద్ అమ్మవారిని లష్కర్ అమ్మవారు అని కూడా పిలుస్తారు. బ్రిటీషు ఆర్మీలో పని చేసే ఉద్యోగి ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నిర్మాణానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ గ్రామానికి చెందిన సురటి అప్పయ్య అమ్మవారికి భక్తుడు. 1813లో అతనికి మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీకి ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఆ సమయంలో సికింద్రాబాద్ లో కలరా వ్యాప్తి చెంది వేలాది మంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సురటి అప్పయ్య ఉజ్జయిని అమ్మవారిని మొక్కుకున్నాడు. కలరా నశిస్తే ఉజ్జయినీ తరహా అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుక్కున్నాడు. తర్వాత కలరా వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తన మొక్కు ఫలించిన కారణంగా సూరటి అప్పయ్య స్వంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. తన మొక్కు తీర్చడానికి సూరటి అప్పయ్య వద్ద డబ్బులేదు. అతను ఆర్మీ ఉద్యోగి కావడం వల్ల ఆలయం నిర్మించే తాహతు లేకుండా పోయింది. ఆలయం నిర్మించడానికి సూరటి అప్పయ్య పెద్దల నుంచి తనకు వచ్చిన భూములను అమ్ముకున్నాడు
సూరటి అప్పయ్య తన మిలటరీ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. మహంకాళీ మహత్యాన్ని స్నేహితులకు వివరించాడు. పాత బోయిగూడకు సమీపంలో ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. తాను ఉజ్జయినీ నుంచి తిరిగి వచ్చిన కారణంగా ఉజ్జయినీ అని నామకరణం చేశాడు. అప్పటి నుంచి ప్రతీరోజు అమ్మవారికి పూజలు చేసే వాడు. ఆషాడమాసంలో బోనాలు సమర్పించేవాడు.
తర్వాతి కాలంలో బోనాలు జాతర నిర్వహించే సమయంలో బావిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. అదే విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి అంటు వ్యాదులు తగ్గిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం వల్ల అమ్మవారు దేదీప్యమానంగా పూజలు అందుకుంటున్నారు.