‘హైదరాబాద్  మెట్రో’ భవితవ్యం ఏమిటి?
x
హైదరాబాద్ మెట్రోరైలు

‘హైదరాబాద్ మెట్రో’ భవితవ్యం ఏమిటి?

సర్కార్ చేతిలో మెట్రోరైలు సజావుగా నడుస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?


హైదరాబాద్ మెట్రోరైలు నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం పెరగడంతో నష్టాల బాటలో పయనిస్తోంది. దీంతో తాము నష్టాలు భరిస్తూ తాము మెట్రోను నడపలేమంటూ ఎల్ అండ్ టీ చేతులెత్తేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో మొదటి దశను టేకోవర్ చేసింది. మెట్రో నష్టాలకు అసలు కారణాలు, ఎల్ అండ్ టీ నిర్వహణ వైఫల్యాలు, హైదరాబాద్ మెట్రోరైలు ప్రభుత్వం చేపట్టినందున దీని భవితవ్యంపై రైల్వేరంగ నిపుణులు ఏం చెబుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.


వాణిజ్య పరంగా ఆదాయమేది?
‘‘మెట్రోరైలు వ్యవస్థను లాభాల బాటలోకి తీసుకురావాలంటే కేవలం ప్రయాణికుల నుంచి టికెట్ల విక్రయాల వల్ల వచ్చే ఆదాయం కాకుండా వాణిజ్య పరంగా ఆదాయం పెంచుకోవాలి. మెట్రో రైలు మార్గాలు, రైల్వేస్టేషన్ల నిర్మాణం కోసం హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో విలువైన వాణిజ్య స్థలాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైలుకు అప్పగించింది. మెట్రో రైల్వేస్టేషన్లలో వాణిజ్య అవసరాల కోసం గదులను నిర్మించినా వాటిని అద్దెకు ఇవ్వడంలో ఎల్ అండ్ టీ మెట్రోరైలు యాజమాన్యం విఫలమైంది. మెట్రో రైళ్లే కాదు స్టేషన్లు, పిల్లర్లపై వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడంలో ఎల్ అండ్ టీ విఫలమైంది. వాణిజ్యప్రకటనల ఆదాయం, రెంటల్ ఆదాయం పెంచుకోవడంలో మెట్రో చర్యలు చేపట్టలేదు. దీనివల్ల మెట్రోరైలు నిర్మించడానికి తీసుకువచ్చిన రుణాలకు వడ్డీలు పెరిగి,పెట్టిన పెట్టుబడి రాక, నిర్వహణ భారం తడిసి మోపెడవుతుండటంతో నష్టాల్లో చిక్కుకుంది’’అని దక్షిణ మధ్య రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్, ఆపరేటింగ్ ఆఫీసర్, ఐఆర్ టీఎస్ 1981 బ్యాచ్ అధికారి మద్దూరి సుందరరామ్ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మెట్రో నష్టాలకు వడ్డీ భారం, అధిక నిర్వహణ వ్యయం కారణమని ఆయన తెలిపారు.

కొరవడిన లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ
హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు వ్యవస్థకు అనుగుణంగా లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల కొంతమంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపించడం లేదు. మెట్రో మార్గాల్లో ఐటీ, ఇతర కార్యాలయాలకు ఉద్యోగుల రాకపోకల సమయంలో మాత్రమే మెట్రో రైళ్లు కిక్కిరిసి నడుస్తున్నాయి. మిగతా సమయాల్లో లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ లేక పోవడం వల్ల ఆశించిన మేర ప్రయాణికులు రావడం లేదు.ద్విచక్రవాహనం లేదా కారు వదిలి ఇంటి నుంచి మెట్రో రైల్వేస్టేషనుకు రావాలంటే రవాణ సదుపాయం లేదు. తీరా స్టేషనుకు వచ్చి నిర్ణీత మెట్రో రైల్వేస్టేషను వరకు రైలులో ప్రయాణించినా, అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరేందుకు కనెక్టివిటీ లేదు. గతంలో మెట్రో రైల్వేస్టేషన్ల నుంచి వ్యాన్లు, ఆటోలతో కనెక్టివిటీకి మెట్రో అధికారులు ఏర్పాట్లు చేసినా, చార్జీలు అధికంగా ఉండటంతో ప్రయాణికులు వాటిని ఉపయోగించుకోలేదు. దీంతో మెట్రోరైలు కనెక్టివిటీ రవాణ సదుపాయాలను ఎత్తివేశారు. మెట్రో టికెట్ చార్జీలతోపాటు ఇటు ఇంటి నుంచి మెట్రో స్టేషను వరకు అటు స్టేషన్ నుంచి గమ్య స్థానం వరకు వెళ్లాలంటే ఆటోలు, క్యాబ్ ల బుకింగ్ వల్ల అదనపు వ్యయమవుతుంది.

ప్రయాణికులు, కిలోమీటర్ల ప్రయాణంపై...
మెట్రోరైలు వ్యవస్థ విజయవంతం అయి లాభాల బాటలో నడవాలంటే ప్రయాణికుల సంఖ్యతో పాటు వారు ప్రయాణించే కిలోమీటర్ల దూరం కూడా పెరగాలి. ఎక్కువ మంది ప్రయాణికులు, ఎక్కువ దూరం ప్రయాణిస్తేనే మెట్రోకు లాభాలు వస్తాయి.కాని మెట్రోరైళ్లకు 8 బోగీలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ప్రస్థుతం తక్కువ బోగీలతో పీక్ అవర్స్ లో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన ప్రయాణాల వల్ల కొంత మంది మెట్రో ప్రయాణం చేయడానికి ముందుకు రావడం లేదు. దీనివల్ల మెట్రోకు ఆశించిన ఆదాయం రావడం లేదు. మెట్రోకు అదనపు బోగీలు కొనేందుకు ఎల్ అండ్ టీ ముందుకు రాకపోవడం నష్టాలకు కారణమైంది. ప్రయాణికుల డిమాండుకు అనుగుణంగా అదనపు రైళ్లను నడపలేక పోవడం కూడా నష్టాలకు కారణమైందని మద్దూరి సుందరరామ్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మెట్రో
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు వీలుగా ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు.మెట్రో రైలు ఫేజ్ 1లో తమకున్న మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎల్ అండ్ టీ మెట్రో పై ప్రస్తుతం ఉన్నరూ.13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. దీంతో పాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు రూ.2,000 కోట్లు వన్‌–టైమ్‌ చెల్లింపు అందించాలని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి రానుంది.

మెట్రోరైలు బాధ్యతల నుంచి తప్పుకుంటామని లేఖ
మెట్రోరైలు యాజమాన్యం నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడం సంచలనం రేపింది. హైదరాబాద్ నగరంలో నిర్మించబోయే రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టులోనూ భాగస్వామ్యం కావాలని రాష్ట్రప్రభుత్వం తమను కోరిందని, దీనికి తాము సుముఖంగా లేమని ఎల్ అండ్ టీ కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ సమావేశంలో తెలిపింది. ఆర్థిక భారం వల్ల రవాణ ప్రాజెక్టుల నుంచి తాము వైదొలగాలని నిర్ణయించినట్లు ఎల్ అండ్ టీ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 4వతేదీన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు లేఖలు రాశారు. హైదరాబాద్ లో చేపట్టబోయే మెట్రో ఫేజ్ 2ఏ,2 బి పీపీపీ పద్ధతిలో భాగస్వామ్యం కాలేమని స్పష్టం చేసింది.మెట్రోరైలు రెండో దశలో ఎల్ బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు విస్తరించాలని ప్రతిపాదనను ఎల్ అండ్ టీ అభ్యంతరం తెలిపింది.

ఇదీ మొదటి దశ హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ
హైదరాబాద్ మెట్రో రైలు (HMR) మెట్రో రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) ప్రాజెక్ట్. నగరాభివృద్ధి, విస్తరణతో పర్యావరణ అనుకూల రవాణాకు అనువుగా స్కైవాక్ లు, మాల్ లు, రిటైల్, కార్యాలయాలను మెట్రో స్టేషన్లకు అనుసంధానించారు.నగరంలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
కారిడార్ I: మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ (రెడ్ లైన్)
కారిడార్ II: జెబిఎస్ నుంచి ఎంజీబిఎస్ (గ్రీన్ లైన్)
కారిడార్ III: నాగోల్ నుంచి రాయదుర్గం (బ్లూ లైన్)

9వ స్థానానికి పడిపోయిన మెట్రో
గతంలో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్‌ 2ఎ, 2బీ విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

హైదరాబాద్ మెట్రోకు మంచి భవిష్యత్
మెట్రో రైలు మొదటి దశ నిర్వహణ బాధ్యతను ఎల్ అండ్ టి నుంచి తెలగాణ ప్రభుత్వం స్వీకరించడం వరం లాంటిదని ఇండియన్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ సోషల్ అంబాసిడర్, రైల్వే రిటైర్డు అధికారి ఎస్ ఎన్ సీ రామకృష్ణాచార్యులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఎల్ అండ్ టి ప్రధానంగా నిర్మాణ దిగ్గజమని, కానీ నిర్వహణ సరిగా చేయలేక వైదొలిగిందని ఆయన పేర్కొన్నారు .కోల్ కతా, ఢిల్లీ,బెంగళూరు మెట్రోలు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్పొరేషన్లుగా మారి విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుతత్వం టేక్ ఓవర్ చేసిన హైదరాబాద్ మెట్రోకు మంచి భవిష్యత్తును ఉంటుందని చెప్పారు. ప్రాజెక్ట్ అమలులో అసాధారణ జాప్యం, ఖర్చులు పెరగడం, రాజకీయ తిరుగుబాట్లతో ప్రభుత్వాల మార్పు మొదలైన అనేక కారణాలు నస్టాలకు కారణమని ఆయన చెప్పారు.

ప్రకటనల ఆదాయం పెంచుకోవాలి...
మెట్రోరైలు టికెట్ల కొనుగోలు కాకుండా ప్రకటనలు, ప్రచారం, పాతకాలపు ప్రాంతాలను లీజుకు తీసుకోవడం మొదలైన వాటి నుంచి వాణిజ్య ఆదాయాలను సంపాదించడంలో ఎల్ అండ్ టి విఫలమైందని ఎస్ ఎన్ సీ రామకృష్ణాచార్యులు చెప్పారు. చాలా పరిమిత సంఖ్యలో కోచ్‌లు కూడా ప్రతికూలంగా మారాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకున్నందున తదుపరి విస్తరణ పనులు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ రైల్వేల నుంచి మద్దతు పొందడం ద్వారా హైదరాబాద్ మెట్రో దేశంలోని ఇతర మెట్రోలతో సమానంగా అభివృద్ధి చేయవచ్చన్నారు.

మంచి పరిణామం
హైదరాబాద్ మెట్రోరైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం శుభపరిణామమని ఆర్టీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, రిటైర్డు ఐపీఎస్ అధికారి ఊట్ల అప్పారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం మెట్రోను మెరుగ్గా నిర్వహించాల్సి ఉందన్నారు. లాభనష్టాలు చూసుకోకుండా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మెట్రో రైలు కోచ్ ల సంఖ్య పెంచి ప్రయాణికుల రద్దీని నివారించాలని ఆయన కోరారు. ఢిల్లీలో మెట్రోరైలును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ రంగంలోని బెంగళూరులోనూ బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్నాయి. కోల్ కతా మెట్రోను కోల్ కతా మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది.

ప్రైవేటు రంగం ఎలా నష్టాలను భరిస్తుంది?
మెట్రోరైలు చార్జీలను పెంచకుండా నడపడం ఎల్ అండ్ టీ సంస్థకు సాధ్యం కాదు. మెట్రోరైలు నిర్మాణ వ్యయం పెరగడం వల్ల నష్టాలు వస్తుండటంతో దీని నిర్వహణకు ప్రైవేటు సంస్థ వైదొలగాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాన రాస్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్న నేపథ్యంలో చార్జీలు పెంచకుండా ఇతర ఆదాయాలను పెంచుకొని నిర్వహించాల్సి ఉంది.హైదరాబాద్ మెట్రోరైలు నిర్మాణానికి వ్యయం అధికం కావడంతో లాభాలు లేక ఎల్ అండ్ టీ ఈ బాధ్యత నుంచి తప్పుకుందని దక్షిణ మధ్య రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్, ఆపరేటింగ్ ఆఫీసర్, ఐఆర్ టీఎస్ 1981 బ్యాచ్ అధికారి మద్దూరి సుందరరామ్ చెప్పారు. భారతీయ రైల్వేల్లో ప్యాసింజర్ రైళ్లు నడపటం వల్ల నష్టాలు వచ్చినా, గూడ్సు రైళ్ల నిర్వహణ వల్ల వచ్చే ఆదాయంతో దీన్ని పూడ్చుకుంటూ కేంద్ర బడ్జెట్ నిధులతో ప్యాసింజర్ రైళ్లను నడిపామని సుందరరామ్ తెలిపారు.

టికెట్ ఆదాయం వస్తున్నా వడ్డీ భారం
హైదరాబాద్ మెట్రో రైలులో సగటున రోజుకు 4.8లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు మెట్రోరైలు సంస్థకు కోటిన్నర రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా, మెట్రో నిర్మాణ రుణాలపై వడ్డీ తడిసి మోపెడై భారంగా మారింది. మెట్రో స్టేషన్లు, మెట్రో మాల్స్ లీజులు, ప్రకటనలు, టికెట్ల ఆదాయం ద్వారా 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.703.20 కోట్ల ఆదాయం వచ్చింది. మెట్రో నిర్వహణ వ్యయం రూ.429 కోట్లు అవుతుంది. మెట్రో నిర్వహణ వ్యయం కంటే అధిక ఆదాయం వస్తున్నా ఎల్ అండ్ టీ ఈక్విటీ, బ్యాంకుల కన్సార్టియం నుంచి తెచ్చిన రూ.12,500 కోట్ల రుణాలపై ఏటా రూ. 1273 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెట్రోరైలు విడుదల చేసిన ఆర్థిక నివేదికలోనే వెల్లడించింది.

రూ.625 కోట్ల నష్టం
2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 వతేదీ నాటికి మెట్రో రైలు ఆదాయం రూ.1108.54 కోట్ల ఆదాయం రాగా ఖ్చులు రూ.1734.45 కోట్లు అయ్యాయని, రూ.625.91 కోట్ల నష్టం వచ్చిందని ఎల్ అండ్ టీ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.6605.51 కోట్ల నష్టాలని ఆ నివేదికలో పేర్కొన్నారు.

సర్కారు చేయూతతో తగ్గిన వడ్డీ భారం
గతంలో అప్పటి బీఆర్ఎస్ రాష్ట్రప్రభుత్వం ఎల్ అండ్ టీకి రూ.900 కోట్లను వడ్డీ లేకుండా రుణం ఇచ్చింది. దీంతోపాటు రాయదుర్గంలోని 15 ఎకరాల భూమిని రూ.1045 కోట్లకు మానిటైజ్ చేసింది. దీనివల్ల ఎల్ అండ్ టీకి రూ.512 కోట్లు వచ్చాయి. మరో వైపు ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ మాల్స్ లలో సబ్ లైసెన్సులు ఇవ్వడం ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయానికి ఒప్పందం కుదిరింది. మొత్తం ఎల్ అండ్ టీకి రూ.5వేల కోట్ల రుణభారం, వడ్డీ భారం తగ్గింది.

మెట్రో ఆదాయం పెంచాలంటే...
మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచడానికి రద్దీని నివారించేందుకు మెట్రోరైలుకు ఉన్న మూడు కోచ్ ల సంఖ్యను 6కు పెంచాలి. మరో వైపు మెట్రో రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని రైల్వే శాఖ మాజీ అధికారి ఎస్ ఎన్ సీ రామకృష్ణా చార్యులు కోరారు. మెట్రో మొదటి దశకు కేంద్రం నుంచి ఆశించిన మేర ఆర్థిక సాయం అందకపోవడం వల్ల అప్పులు పెరిగి వడ్డీ భారం పెరిగిందని హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. రెండో దశలో భాగంగా ఓల్డ్ సిటీ మీదుగా మెట్రోరైలు మార్గాన్ని నిర్మించినా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకున్నా, నిర్వహణ మెరుగ్గా చేయాలని ఆయన సూచించారు.

పెండింగులోనే ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులోనే ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్‌ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్‌ 2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది.అందుకు వీలుగా ఒప్పందం కావాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.

మెట్రో ఆస్తులను కొల్లగొట్టేందుకు సీఎం కుట్ర : కేటీఆర్ ఆరోపణ
మెట్రో రైలు ఆస్తులను కొల్లగొట్టేందుకే సీఎం కేసీఆర్ ఎల్ అండ్ టీని నిర్వహణ బాధ్యతల నుంచి గెంటివేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. 280 ఎకరాల ఎల్ అండ్ టీ మెట్రో భూములు, మాల్స్ పై సీఎం, ఆయన అనుచరులు కన్నేశారని అందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.15వేల కోట్ల భారం పడిందని ఆయన పేర్కొన్నారు.


Read More
Next Story