రామ్మూర్తికి చంద్రగిరి టికెట్ రావటం వెనుక పెద్ద కథే నడిచింది
x
Nara Ramamurthy Naidu

రామ్మూర్తికి చంద్రగిరి టికెట్ రావటం వెనుక పెద్ద కథే నడిచింది

టికెట్ల కేటాయింపులో చంద్రగిరికి రామ్మూర్తి పేరే ఖాయమైంది. బీ ఫారమ్ కూడా తెచ్చుకుని పోటీచేసి గెలిచాడు


చంద్రబాబునాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం చనిపొయారు. అనారోగ్యంతో చాలాకాలంగా ఇబ్బంది పడుతున్న రామ్మూర్తిని కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో ఈనెల 14వ తేదీన జాయిన్ చేశారు. చికిత్స తీసుకుంటూనే శనివారం మధ్యాహ్నం 12.45కి మరణించారు. ఈ సందర్భంగా రామ్మూర్తితో నాకు ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నాను.

అవి 1993 సంవత్సరం రోజులు. రంగంపేటలో కల్లూరి హరినాథరెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా నాకు నారా రామ్మూర్తినాయుడు బాగా దగ్గరయ్యారు. అంతకుముందు నుండే నాకు రామ్మూర్తినాయుడు(Ramamurthy Naidu) పరిచయం ఉన్నా హలో అంటే హలో అనటం, ఎక్కడైనా ఎదురుపడితే మాట్లాడుకోవటం వరకే. కల్లూరి హరి వల్ల తరచూ ఫోన్లు చేసి మాట్లాడుకునేంత దగ్గరయ్యాము. ఒకరోజు ఉదయం నాకు హరి ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనానికి లక్ష్మీనారాయణ భవన్(ఎల్ఎన్బీ)(Lakshmi Narayana Bhavan) దగ్గర కలుద్దామని చెప్పాడు. రెగ్యులర్ గా బయట భోజనంచేయటం మాకు బాగా అలవాటే. ఇద్దరమూ భోజన ప్రియులమే. రకరకాల రుచులు ఎక్కడ దొరుకుతాయని తెలిసినా వదిలిపెట్టం. అందుకనే ఎల్ఎన్బీకి వస్తానని చెప్పాను.

మధ్యాహ్నం క్రిక్కిరిసిన ఎల్ఎన్బీలోకి వెళ్ళగానే ఒక టేబుల్ మీద కల్లూరితో పాటు రామ్మూర్తి కూడా ఉన్నారు. హలో చెప్పుకున్న తర్వాత కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కల్లూరి అసలు విషయంలోకి డైరెక్టుగానే దిగేశాడు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి(Chandragiri)లో రామ్మూర్తికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాడు. టికెట్ కోసం పోటీలో ఎంతమంది ఉన్నా టికెట్ మాత్రం రామ్మూర్తిదే అని బాగా నమ్మకంగా చెప్పాడు. కల్లూరి చెప్పేది వింటున్న రామ్మూర్తి చాలా హ్యాపీగా నవ్వుతు వింటున్నాడు. ఎన్నికల సమయంలో మీడియా అవసరం చాలా ఉంది కాబట్టి ప్రెస్ మీట్లు, మీడియాను ఫేస్ చేయటంలో కాస్త సాయం చేయాలని కల్లూరి నాకు చెప్పాడు. తర్వాత ఇదే విషయాన్ని రామ్మూర్తి మాట్లాడుతు మీడియాను ఎదుర్కొనేందుకు తనకు కొన్ని టిప్స్ చెప్పాలని రిక్వెస్టు చేశాడు. అడిగారు కదాని నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పాను. తర్వాత రెండు మూడు నెలల పాటు తరచూ ఎల్ఎన్బీలోనే ముగ్గురమూ కలుసుకుని రాజకీయాలు, పోటీచేసే విషయం, ప్రచారం తదితరాల గురించి మాట్లాడుకునే వాళ్ళం.

ప్రెస్ మీట్లలో పద్దతిగా మాట్లాడాలని, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలని, ఎవరిపైన అయినా ఆరోపణలు చేయదలచుకున్నపుడు అందుకు తగ్గ ఆధారాలను దగ్గర పెట్టుకోవాలని, వీలైనంత వరకు ప్రత్యర్ధులపై ఆరోపణలకు దూరంగా ఉండాలని సూచించాను. చాలాకాలంగా రామ్మూర్తి రాజకీయాల్లోనే ఉన్నా చంద్రబాబు నాయుడు తమ్ముడిగానే తెలుసు. మొదటిసారి 1994 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నాడు. కాబట్టే మీడియాను ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చింది. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వీలైనంతగా టికెట్ రేసులో మీడియాలో పేరు రాకుండా చూసుకోమని చెప్పాను. మీడియా అన్నది భస్మార హస్తమన్న విషయం నాకు బాగా తెలుసు. టికెట్ ఖాయమన్న హామీతో కొందరు నేతలు రెచ్చిపోవటం, మీడియాలో విపరీతంగా ప్రచారం జరగటంతో ప్రత్యర్ధులు జాగ్రత్తలు పడటం చివరకు టికెట్ భరోసా ఉన్న నేతకు కాకుండా ఇంకెవరికో దక్కటం చాలాసార్లు జరిగిన విషయాన్ని నేను రామ్మూర్తికి ఉదాహరణలతో సహా చెప్పాను. నేను చెప్పినట్లే రామ్మూర్తి వీలైనంతలో మీడియాలో చంద్రగిరి టికెట్ రేసులో తన పేరు రాకుండానే చూసుకున్నాడు.

చివరకు టికెట్ల కేటాయింపులో చంద్రగిరికి రామ్మూర్తి పేరే ఖాయమైంది. బీ ఫారమ్ కూడా తెచ్చుకుని పోటీచేసి గెలిచాడు. అయితే టికెట్ తెచ్చుకోవటంలో పెద్ద ట్విస్టు జరిగింది. ఆ ట్విస్టంతా తెరవెనుకే జరిగింది. అదేమిటంటే ఎన్నికల నాటికే లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi)ని అన్నగారు ఎన్టీఆర్(NTR) వివాహం చేసుకున్నారు. టికెట్ల కేటాయింపులో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) ఒకవైపు నిలిస్తే, మరోవైపు చంద్రబాబు(Chandrababu) నిలిచారు. నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి కేటాయించాలనే విషయంలో గ్రూపుల మధ్య పెద్ద వివాదాలే రేగినాయి. చాలా నియోజకవర్గాల్లో టికెట్లు తెచ్చుకున్న వారంతా ఏదో ఒక వర్గంలో ఉన్నవారే. చిత్తూరు జిల్లాలో టికెట్ల కేటాయింపు విషయంలో చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు చెప్పిన పేర్లకు లక్ష్మీపార్వతి బ్రేకులు వేశారు. అదే సందర్భంగా చంద్రగిరికి రామ్మూర్తి ప్రస్తావన వచ్చినపుడు ప్రత్యేకించి ఎవరి పేరూ చెప్పలేదు కాని తమ్ముడినిమాత్రం చంద్రబాబు వ్యతిరేకించారు. చంద్రబాబు వ్యతిరేకించారు కాబట్టి రామ్మూర్తికే టికెట్ అని ఎన్టీఆర్ ఫైనల్ చేసేశారు.

అంటే, చంద్రగిరిలో రామ్మూర్తికి టికెట్ దక్కింది ఎన్టీఆర్+లక్ష్మీపార్వతి వర్గం అనే ముద్రతో. లక్ష్మీపార్వతి వర్గమనే ముద్రతో రామ్మూర్తికి టికెట్ దక్కటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. రామ్మూర్తికి టికెట్ ఎలాగ దక్కిందంటే ప్రతిరోజు లక్ష్మీపార్వతి దగ్గరకు వెళ్ళి చంద్రబాబు గురించి ఫిర్యాదులు చేయటమే రామ్మూర్తి పనిగా పెట్టుకున్నాడు. చంద్రబాబు వల్ల చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ నేతలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో చెప్పేవాడు. అన్నకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ దగ్గర ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తుండటంతో అన్నదమ్ములిద్దరికీ ఏమాత్రం పడదని లక్ష్మీపార్వతి అనుకున్నారు. చంద్రబాబును బహిరంగంగా వ్యతిరేకిస్తున్న రామ్మూర్తినాయుడుకే చంద్రగిరి టికెట్ ఇప్పించాలని లక్ష్మీపార్వతి గట్టిగా డిసైడ్ అయిపోయి అదే విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పారని పార్టీ నేతలు చెప్పారు. లక్ష్మీపార్వతి చెబుతున్నది నిజమే అనుకున్న ఎన్టీఆర్ కూడా చంద్రగిరి టికెట్ రామ్మూర్తికే ప్రకటించారు.

చంద్రబాబు వ్యతిరేక వర్గం కాబట్టి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఇంకో ఆలోచన లేకుండా రామ్మూర్తికి టికెట్ కేటాయించారు. చంద్రబాబు తమ్ముడు కాబట్టి రామ్మూర్తికి నియోజకవర్గంలో ఎదురులేకుండా పోయింది. దాంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గల్లా అరుణకుమారి మీద రామ్మూర్తి 16,352 ఓట్ల మెజారిటితో గెలిచారు. రామ్మూర్తికి 60,311 ఓట్లు వస్తే, గల్లా అరుణ(Galla Arunakumari)కు 43,959 ఓట్లొచ్చాయి. మొత్తానికి చంద్రబాబు తమ్ముడు అయ్యుండి లక్ష్మీపార్వాతి క్యాంపులో చేరి అన్నను ప్రతిరోజు తిట్టడమే పనిగా పెట్టుకుని టెకెట్ తెచ్చుకున్నాడు. క్యాంపులో అందరిముందు చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న కారణంగా మిగిలిన వాళ్ళు సంగతి తెలియదుకాని లక్ష్మీపార్వతి మాత్రం నిజంగానే చంద్రబాబు అంటే తమ్ముడు రామ్మూర్తికి పడదని నమ్మారు. అందుకనే చంద్రబాబు వ్యతిరేకవర్గంలో నేతలను చేరదీస్తున్నాను అని అనుకుని రామ్మూర్తికి లక్ష్మీపార్వతి టికెట్ వచ్చేట్లు చేశారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరికి రామ్మూర్తి టికెట్ తెచ్చుకున్న విధానమిది. కొసమెరుపు ఏమిటంటే చంద్రగిరిలో పోటీచేయాలంటే తనను లక్ష్మీపార్వతి దగ్గర తిట్టమని చంద్రబాబే తమ్ముడు రామ్మూర్తికి చెప్పి పంపారని పార్టీ నేతలు తర్వాత బయటపెట్టారు.

Read More
Next Story