
ఇద్దరు కీలకనేతలు మాత్రమే ఎలా ఎన్ కౌంటరయ్యారు ?
ఎన్ కౌంటర్ జరగటం ఒకఎత్తయితే జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్రకమిటి సభ్యులు ఇద్దరుమరణించటం మరోఎత్తు
ఒకవైపు వారోత్సవాలు జరుగుతుండగా మరోవైపు మావోయిస్టుపార్టీకి భారీనష్టం జరిగింది. ఛత్తీస్ ఘడ్, నారాయణపూర్(Chhattisgarh) జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు కీలకనేతలు చనిపోయారు. ఎన్ కౌంటర్లో కట్టా రామచంద్రారెడ్డి(63) అలియాస్ వికల్ప్, కడారి సత్యనారాయణరెడ్డి(67) అలియాస్ కోసాదాదా చనిపోయినట్లు భద్రతాదళాలు(Operation Kagar) ప్రకటించాయి. వికల్ప్ మావోయిస్టుపార్టీ(Maoists) అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించేవారు. మావోయిస్టుపార్టీలో అధికారప్రతినిధిగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ స్ధానంలో మూడురోజుల క్రితమే వికల్ప్ అధికారప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇంతలోనే ఎన్ కౌంటర్లో చనిపోవటాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది.
ఇక్కడగమనించాల్సిన విషయంఏమిటంటే ఎన్ కౌంటర్ జరగటం ఒకఎత్తయితే జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్రకమిటి సభ్యులు ఇద్దరుమరణించటం మరోఎత్తు. ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు ఒకేసారి ఎన్ కౌంటర్లో మరణించటమే చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మావోయిస్టు వ్యవహరాలు బాగా తెలిసిన పౌరహక్కుల సంఘాల నేతలు చెప్పేది ఏమిటంటే మావోయిస్టుపార్టీలోని కీలక నేతలు, అగ్రనేతలు ఇద్దరు ఒకేచోట ఉండరని. ఎన్ కౌంటర్ల భయంతోనే పార్టీ అగ్రనేతలు ఎన్నోసంవత్సరాల క్రితమే ఈనిర్ణయం తీసుకున్నారు. కీలక నేతలు లేదా అగ్రనేతల ప్రాణాలను కాపాడేందుకు, ఎన్ కౌంటర్ల నుండి తప్పించేందుకు కిందస్ధాయిలోని మావోయిస్టులు లేదా అంగరక్షకులు తమ ప్రాణాలను సైతం త్యాగాలు చేయటం మావోయిస్టుల్లో చాలాసహజం. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది.
అలాంటిది ఇద్దరు కేంద్రకమిటి సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి భద్రతాబలగాలకు చిక్కడం, ఎన్ కౌంటర్లో చనిపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మావోయిస్టుపార్టీ నేతలు సమావేశమైన విషయం తమకు శుక్రవారమే సమాచారం అందిందని నారాయణపూర్ ఎస్పీ రాబిన్ సన్ గుడియా చెప్పారు. శుక్రవారమే సమాచారం అందితే సోమవారం ఉదయం వరకు భద్రతాదళాలు, పోలీసులు ఎందుకు వెయిట్ చేశారో అర్ధంకావటంలేదు. పోనీ, ఎన్ కౌంటర్ జరిగిందనే అనుకున్నా మావోయిస్టుల్లో ఇంకెవరు చనిపోలేదు, ఎవరికీ కనీసం గాయాలు కూడా కాలేదు. గురిచూసి బాణంవేసి కొట్టినట్లుగా ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు మాత్రమే కాల్పుల్లో చనిపోవటం అనేక అనుమానాలు రేకెత్తుస్తున్నాయి.
కేంద్రకమిటిసభ్యుడు ఎక్కడైనా సమవేశంలో ఉన్నాడంటే వాళ్ళకి ఎంతో సెక్యూరిటి ఉంటుంది. అలాంటిది ఇద్దరు సభ్యులు పాల్గొన్న సమావేశంలో ఇంకెంతమంది మావోయిస్టులు భద్రతగా ఉంటారు ? కీలకనేతలు, అగ్రనేతలు పాల్గొనే సమావేశాలకు చుట్టూ ముడంచెల భద్రతఉంటుంది. అలాంటిది ఆభద్రతంతా ఏమైంది ? మిగిలిన మావోయిస్టులంతా ఏమయ్యారన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. 1999లో కొయ్యూరు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్ కౌంటర్లో కేంద్రకమిటిసభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి చనిపోయారు. ఏకకాలంలో ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు ఎన్ కౌంటర్లో చనిపోవటాన్ని మావోయిస్టుపార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో చాలా సీరియస్ గా పరిగణించింది. అప్పటినుండే ఇద్దరు కీలకనేతలు లేదా అగ్రనేతలు ఒకేచోట సమావేశం అవ్వకుండా నిర్ణయం తీసుకున్నది. అలాంటిది ఇపుడు కట్టా, కడారి ఎన్ ఒకేసారి కౌంటర్లో మరణించటమే అందరినీ అశ్చర్యపరుస్తోంది. ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు అబూజ్ మడ్ అడవుల్లో పాల్గొన్న విషయంపై మావోయిస్టుపార్టీనే క్లారిటి ఇవ్వాలి.
మిగిలింది ఎంతమంది ?
2026, మార్చి31వ తేదీకల్లా దేశంలో మావోయిస్టులు అన్నవాళ్ళే లేకుండా చేయాలన్నది ఆపరేషన్ కగార్ లక్ష్యం. ఈవిషయన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఆపరేషన్ కగార్ జోరుచూస్తుంటే తన టార్గెట్ ను రీచవ్వటానికి ఎంతోకాలం పట్టేట్లుగా లేదు. మావోయిస్టుపార్టీలోని కీలకనేతలు, అగ్రనేతలే టార్గెట్ గా భద్రతాదళాలు ఎన్ కౌంటర్లు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా శాటిలైట్ టెక్నాలజీ, అత్యంత ఆధునిక ఆయుధాలు, ద్రోన్లు, సుమారు లక్షమంది మెరికల్లాంటి సిబ్బంది ఆపరేషన్ కగార్లో పనిచేస్తున్నారు.
గడచిన ఏడాదిగా కేంద్రకమిటిసభ్యులు చలపతి, మాంఝీ, మోడెం బాలకృష్ణ, సహదేవ్ చనిపోగా ఇపుడు కట్టా, కడారి మృతిచెందారు. మే 25న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోగా మరో కేంద్రకమిటిసభ్యురాలు సుజాత పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ మావోయిస్టుపార్టీతో విభేదించారు. 17మంది కేంద్రకమిటిసభ్యుల్లో ప్రస్తుతం మిగిలింది ఎనిమిదిమంది మాత్రమే అని సమాచారం. ఇపుడు చనిపోయిన ఇద్దరు కీలకనేతలు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటి కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. గెరిల్లా తరహాదాడులు చేసి అనేకమంది పోలీసులను చంపేసిన కేసులు వీరిద్దరిపైనా చాలానే ఉన్నాయి. ఇద్దరిపైనా చెరో రు. 40 లక్షల రివార్డులను ప్రభుత్వాలు ప్రకటించాయి. తాజా ఎన్ కౌంటర్ విషయంలో మావోయిస్టుపార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.