కమెడియన్ కమ్ పొలిటీషియన్ బాబూమోహన్ కు ఎంత కష్టమొచ్చింది
x
Babu Mohan

కమెడియన్ కమ్ పొలిటీషియన్ బాబూమోహన్ కు ఎంత కష్టమొచ్చింది

ఇప్పటి పరిస్ధితుల్లో టీడీపీ అంటే బలమైన ఫోర్సు కాదనే చెప్పాలి.


ఏదో సామెత చెప్పినట్లుగా తిరిగి తిరిగి యాక్టర్ కమ్ పొలిటీషియన్ పల్లి బాబూమోహన్(Babu Mohan) చివరకు తెలుగుదేశంపార్టీ(TDP)లోనే చేరారు. చాలా పార్టీలు తిరిగేసిన ఈ మాజీమంత్రి వేరే దారిలేక చేసేదిలేక చివరకు మంగళవారం టీడీపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. తాను తెలుగుదేశంపార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. 1999 సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) తటస్తులను పార్టీలో చేరమని చాలామందిని ఆహ్వానించారు. ఆ పిలుపు అందుకుని టీడీపీలో చేరిన అనేకమందిలో బాబూమోహన్ కూడా ఉన్నారు. ఎన్నికల్లో టికెట్ ఖాయం చేసుకున్న తర్వాతే పార్టీలో చేరిన కమెడియన్ అనుకున్నట్లుగానే మెదక్(Medak Dt) జిల్లా ఆంధోల్(Andhol) అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. లక్కు కూడా తోడవ్వటంతో కార్మికశాఖ మంత్రి కూడా అయిపోయారు.

తర్వాత 2004, 09 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికే వైఎస్సార్ మరణంతో ప్రత్యేక తెలంగాణా(Telangana) వాదం ఊపందుకుంది. ఆ సమయంలో చంద్రబాబు రెండు కళ్ళసిద్ధాంతంతో విభేదించిన నేతల్లో బాబూమోహన్ కూడా ఒకరు. అందుకనే టీడీపీకి రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్(TRS) లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆంథోల్ నుండి గెలిచినా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. మంత్రపదవిని ఆశించిన బాబూమోహన్ కు నిరాస ఎదురైంది. దాంతో 2018లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీ(BJP)లో చేరారు. బీజేపీలో కొంతకాలం బాగానే ఉన్నా తర్వాత ఇక్కడ కూడా తనకు ప్రాధాన్యత దక్కటంలేదని అలిగి కొంతకాలం పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కమెడియన్ కమ్ పొలిటీషియన్ చివరకు ప్రజాశాంతిపార్టీ(Praja Santi Party)లో చేరారు. ప్రజలే లేని ప్రజాశాంతి పార్టీలో నెలరోజులు కూడా ఉండలేక రాజీనామా చేసేశారు.

వామపక్షాలు తప్ప మిగిలిన అన్నీ పార్టీలను చుట్టేసిన బాబూమోహన్ చివరకు ఇపుడు మళ్ళీ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటి పరిస్ధితుల్లో టీడీపీ అంటే బలమైన ఫోర్సు కాదనే చెప్పాలి. కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ మధ్యే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో మిగిలిన పార్టీలు ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. కాబట్టి టీడీపీ పెద్దగా ఫోర్సుగా పనిచేయటం సాధ్యంకాదు. అయినా సరే బాబూమోహన్ టీడీపీలో ఎందుకు చేరినట్లు ? 2023 ఎన్నికల్లో ఆంథోల్ నియోజకవర్గంలో గెలిచి మంత్రిగా దామోదర రాజనరసింహ ఉన్నారు కాబట్టి బాబూమోహన్ కాంగ్రెస్(Congress) లో చేరే అవకాశాలు లేవు. దామోదర ఆంథోల్ లో బలంగా ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ లో చేరే ఆలోచన బాబూమోహన్ లో లేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయి, రాజకీయాల్లోను అవకాశాలు లేక ప్రచారానికి అలవాటుపడిన కమెడియన్ కమ్ పొలిటీషియన్ జనజీవన స్రవంతికి దూరంగా ఎలా ఉండగలరు ? అందుకనే ఏదో పార్టీలో చేరి ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశ్యంతోనే టీడీపీలో చేరినట్లు అర్ధమవుతోంది.

Read More
Next Story