చెరువును కొరుక్కుతిని ఫేక్ మ్యాపులు సృష్టించిన అధికారులు
హైదరాబాద్ ములుగుంద చెరువు విస్తీర్ణం హెచ్ఎండీఏ జాబితాలో తగ్గింది.శాటిలైట్,గూగుల్ ఎర్త్ చిత్రాల్లోని ఈ చెరువు విస్తీర్ణం ఎలా తగ్గిందనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజేంద్రనగర్ ప్రేమావతిపేట ములుగుంద చెరువు ఆక్రమణలను దాచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు తప్పుడు మ్యాప్‌లు జారీ చేశారని తెలంగాణ క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ హైడ్రా ఛైర్మన్, తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.ములుగుందు చెరువులో సర్వే చేసి మ్యాప్‌ను రీనోటిఫై చేయాలని,ఈ సరస్సు దాని హైడ్రాలజీని పునరుద్ధరించాలని సీఎంతో పాటు అధికారులకు విన్నవించారు.
కబ్జా పాలైన ములుగుంద్ సరస్సు
ప్రేమవతిపేట్ ములుగుంద్ సరస్సు స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేశారు.ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఆక్రమణలు వెలిశాయి.ఈ సరస్సు కాల్వలు కూడా కబ్జా చేసి, భవనాలు నిర్మించేశారు. చెరువు స్థలం కబ్జాలను నిరోధించాల్సిన అధికారులు ఈ సరస్సు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను మార్చి చిత్రపటాలను రూపొందించి నోటిఫై చేయడం వివాదాస్పదంగా మారింది.
శాటిలైట్ చిత్రాల్లో చెరువు విస్తీర్ణం ఎలా తగ్గింది?
ఎన్ఆర్ఎస్‌సీ, గూగుల్ ఎర్త్ ఉపగ్రహ చిత్రాలను హెచ్ఎండీఏ నోటిఫై చేసిన చిత్రాలతో పోలిస్తే ములుగుంద చెరువు విస్తీర్ణం తగ్గింది. లేక్ ఐడి 2921తో ఉన్న చిత్రాల్లో ఈ చెరువు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా, దాన్ని తగ్గించి చూపించడం తీవ్రమైన ఉల్లంఘన అని డాక్టర్ లుబ్నా చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువు విస్తీర్ణం తగ్గడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సరస్సు ఎఫ్ టీఎల్,బఫర్ జోన్ సరిహద్దులను ఆక్రమణదారులు మార్పించి మోసగించారు.
హెచ్ఎండీఏలో మ్యాప్ ఏది?
ములుగుంద్ సరస్సును 2014వ సంవత్సరం కంటే ముందే దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ గుర్తించారు.నీటిపారుదల శాఖ, రెవెన్యూశాఖ అధికారులు జరపిన జాయింట్ ఫీల్డ్ సర్వేలో అసలు ఎఫ్ టీఎల్ ను నిర్ధారించారు. ఈ సరస్సు మ్యాప్ హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో పబ్లిక్ డొమైన్‌లో ఉంచక పోవడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాను ఈ చెరువు కబ్జాపై ఫిర్యాదు చేశానని డాక్టర్ లుబ్నా చెప్పారు. అప్పచెరువు నుంచి ములుగుంద చెరువులోకి ఇన్‌ఫ్లో చానెల్ కబ్జాల పాలైంది. ఈ సరస్సును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని డాక్టర్ లుబ్నా డిమాండ్ చేశారు.
అధికారులకు ఫిర్యాదు
తప్పుడు మ్యాప్ లతో ములుగుంద చెరువు ఆక్రమణలను అధికారులు దాచారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా తెలంగాణ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి, మంత్రి దుద్దిళ్ల శ్రీపాదరావు, ఏసీబీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ కాలుష్య మండలి కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెరా సభ్య కార్యదర్శిలను కోరుతూ ఫిర్యాదు పంపించారు.
Next Story