అది డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్ లోని ప్రముఖ హరిసింగ్ ఆడిటోరియం...మనుషులు-చిరుతపులుల సంఘర్షణ సమస్యను పరిష్కరించిన హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (HYTICOS)వన్యప్రాణుల పరిరక్షణ బృందానికి చెందిన ఫరిహా ఫాతిమాకు గుర్తింపుగా కేంద్ర పర్యావరణ,అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. అంతే హైదరాబాద్ నగరానికి చెందిన ‘హైటికోస్’ వైల్డ్ లైఫ్ పరిరక్షణ బృందం చిరుతపులుల పరిరక్షణకు చేసిన కృషికి గుర్తింపుగా సభికులంతా చప్పట్లతో అభినందనల వర్షం కురిపించారు.
కేంద్ర పర్యావరణ,అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ జాతీయ అవార్డును అందుకుంటున్న హైటికోస్ ప్రతినిధి ఫరిహా ఫాతిమా
జాతీయ అవార్డు ఎందుకు వచ్చిందంటే...
వన్యప్రాణి సప్తాహం సందర్భంగా నిర్వహించిన మానవ-వన్యప్రాణుల సంఘర్షణ సహజీవనంపై జాతీయ హ్యాకథాన్‌లో తెలంగాణకు చెందిన హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (HYTICOS)కి వైల్డ్ లైఫ్ యాక్టివిస్టులకు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు లభించింది.పోచారం అభయారణ్యంతోపాటు పరిసర ప్రాంతాల్లో మనుషులు- చిరుతపులుల మధ్య సంఘర్షణను హైటికోస్ వన్యప్రాణుల పరిరక్షణ బృందం తగ్గించింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 120 బృందాల్లోని 420 మంది వన్యప్రాణి పరిరక్షకుల పనితీరును పరిశీలించిన కేంద్రం హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి బృందం చిరుతపులుల సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని గుర్తించి ఈ జాతీయ అవార్డును ప్రకటించింది.
పులుల సంరక్షకులు ఈ హైదరాబాద్ బ్రదర్స్...ఆసిఫ్ సిద్దిఖీ, ఇమ్రాన్ సిద్ధిఖీ
ఉన్నత చదువులు చదివి...అడవి బాట పట్టిన యువత
‘‘పులులు, అడవులు, నదులను మనం కాపాడితే అవి మనల్ని పరిరక్షిస్తాయి’’ అనే నినాదంతో హైదరాబాద్ నగరానికి చెందిన ఇమ్రాన్ సిద్ధిఖీ,ఆసిఫ్ సిద్దిఖీ సోదరులు కలిసి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీని(హైటికోస్) స్థాపించారు.ఈ సోసైటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పులుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొంది నేడు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సులో పోస్టుగ్రాడ్యుయేషన్, రీసెర్చ్ చేసిన ఈ బ్రదర్స్ గత దశాబ్దకాలంగా పులుల పరిరక్షణ కోసం పని చేస్తున్నారు.ఉన్నత చదువులు చదివిన ఎందరో యువకులు హైటికాస్ టీంలో చేరి పులుల సంరక్షణకు విశిష్ఠ సేవలందిస్తున్నారు.
హైటికోస్ టీం సభ్యులు వీరే...
హైటికోస్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లుగా ఎ వెంకట్, బొద్దు కుమార్ , అఖిల్ గౌడ్, రీసెర్చ్ అసోసియెట్ లు గా నీలంజన్ బసు, ఇమ్మాన్యుయెల్ సంపత్, వంశీ తలారీ, రేవతి కె, ఆర్ నవీన్ కుమార్, ఫీల్డు అసిస్టెంట్లుగా భీంరావు, శంకరయ్య, ఆర్ ఆంజనేయులు, సోమయ్య, సుశాంత్, మల్లయ్య, ఎం అంజయ్య, మనోజ్, షాహిబ్రావో, రాజేశ్వర్, యోగేశ్వర్, మల్లేష్, లక్ష్మణ్, ప్రశాంత్ లు పనిచేస్తున్నారు.హైటికోస్ అడవులే కాదు పులులను కాపాడటానికి విభిన్న నైపుణ్యం కలిగిన సమూహాలతో కలిసి పనిచేస్తుంది. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తుంది.హైటికోస్ ఫ్రంట్ లైన్ టీం సభ్యులు అడవి సంరక్షకులుగా పనిచేస్తున్నారు.
దశాబ్దకాలంలో 18 చిరుతపులుల మృతి
తెలంగాణలో గత దశాబ్ద కాలంలో 18 చిరుత పులులు మరణించాయి. ఈ నేపథ్యంలో మానవ-చిరుత సంఘర్షణను నివారించడానికి కమ్యూనిటీ ఆధారిత పరిష్కారాలను హిటీకాస్ కు చెందిన ఫరిహా ఫాతిమా సూచించారు.అటవీప్రాంత రోడ్లపై వేగంగా వాహనాలు నడపటం వల్ల రోడ్డు దాటుతున్న చిరుతపులులు మృత్యువాత పడుతున్నాయని ఫరిహా పాతిమా చెప్పారు. గత సంవత్సరం కాగజ్ నగర్ ప్రాంతంలో ఒక జంతువు కళేబరానికి విషాన్ని ప్రయోగించడం వల్ల అయిదు పులులు మరణించాయి. దీంతో పాటు వేటగాళ్లు విషప్రయోగం చేయడం వల్ల పులులు,చిరుతలు చనిపోతున్నాయని ఆమె చెప్పారు.
అటవీ గ్రామస్థుల భాగస్వామ్యంతో చిరుతల సంరక్షణ
వన్యప్రాణుల మధ్య శాంతియుత సహజీవనం కోసం హైటికోస్ కమ్యూనిటీ ఆధారిత విధానాలను అవలంభిస్తుందని ఫరిహా ఫాతిమా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పోచారం ప్రాంతంలో మానవ, చిరుత పులుల సంఘర్షణ ఫలితంగా చిరుతపులులు మృత్యువాతపడ్డాయి. జీవ వైవిధ్యం కోసం వన్యప్రాణులైన చిరుత పులులను కాపాడుకోవాల్సిన అవసరం గురించి అటవీ గ్రామాల ప్రజలకు చెప్పి వారిని చైతన్యవంతులను చేయడంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ బృందంతోపాటు ఫరిహా ఫాతిమా విజయం సాధించారు. ప్రజల భాగస్వామ్యంతో చిరుత పులుల పరిరక్షణ కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు.
మనుషులు-వన్యప్రాణులు సహజీవనం సాగించాలి
‘‘ అటవీ సమీప గ్రామాల్లో చిరుత పులులు తిరుగుతున్నాయని మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వల్ల మనుషులు-చిరుతపులుల మధ్య సంఘర్షణ జరుగుతోంది. చిరుతలు దాడి చేసి పశువులను చంపితే రైతులకు పరిహార పథకం కింద వెంటనే సహాయం అందేలా చూస్తున్నాం, రెస్క్యూ ఆపరేషన్లలో అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం’’అని హైటికోస్ వ్యవస్థాపకులు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తాము మనుషులు-వన్యప్రాణులు సహజీవనం సాగించేలా హ్యాక్‌ను ప్రతిపాదించామంటారు ఇమ్రాన్.
చిరుతపులులను వేటాడవద్దు
అడవుల నరికివేతను తగ్గించడంతోపాటు చిరుతపులులు, పులులు తిరిగేందుకు తగిన టెరిటరీ ఉండేలా చూడాలని తాము ప్రతిపాదించామంటారు హైటికోస్ మరో వ్యవస్థాపకులు ఆషిఫ్ సిద్ధిఖీ.చిరుత పులులు, పులులను వేటగాళ్ల బారి నుంచి పరిరక్షించాలని ఆయన సూచించారు. అటవీ ప్రాంత రోడ్లపై వన్యప్రాణులు అటు ఇటు దాటేలా అండర్‌పాస్‌లు నిర్మించాలని ఆసిఫ్ కోరారు.అటవీ ప్రాంత రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ‘‘చిరుతపులులకు కూడా జీవించే హక్కు ఉందని మర్చిపోవద్దు, అవి కనిపిస్తే వాటిపై రాళ్లు విసిరి వేధించవద్దు’’ అని ఆసిఫ్ సిద్ధిఖీ అని సూచించారు.
గాయపడిన జింకకు హైటికోస్ సభ్యుడి చికిత్స
అడవులు మనకు శ్వాస, జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను అందిస్తాయి. పులులు, చిరుతల గర్జన అడవుల్లో వినిపిస్తే అది మన జీవ వైవిధ్యానికి చిహ్నంగా నిలుస్తోంది. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (HYTICOS) ద్వారా ఇమ్రాన్–ఆషిఫ్ సిద్ధిఖీ సోదరులు మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు అటవీ గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న మార్గదర్శక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మార్గసూచికలుగా నిలుస్తున్నాయి.