
కేసీఆర్ జాతిపిత ఎట్లయితడు ?
తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితడు ? ఇది తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు వేసిన సూటిప్రశ్న
తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితడు ? ఇది తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు వేసిన సూటిప్రశ్న. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లెలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం బహిరంగసభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు కేసీఆర్ పై రెచ్చిపోయారు. కేసీఆర్(KCR) ను మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలకనేత హరీష్ రావు(Harish Rao) జాతిపిత అని సంభోధించటాన్ని రేవంత్ తీవ్రంగా ఆక్షేపించారు. త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మాగాంధి(Mahatma Gandhi) ఎక్కడ 24 గంటలూ తాగిపడుండే కేసీఆర్ ఎక్కడ ? అని ఎద్దేవాచేశారు. తాగకుండా కేసీఆర్ ఉండగలరా ? మందువాసన చూడకుండా కేసీఆర్ నిద్రలేస్తారా అంటు ఎగతాళిగా మాట్లాడారు. తెలంగాణ కోసం సర్వస్వం కోల్పోయిన కొండా లక్ష్మణ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ ను జాతిపిత అని చెప్పుకోవచ్చుకాని వందల ఎకరాల ఫామ్ హౌస్ లో పండుకునే కేసీఆర్ ను హరీష్ జాతిపితగా ఎలా సంభోదిస్తారంటు నిలదీశారు.
స్టేషన్ ఘన్ పూర్లో రు. 800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ శంకుస్ధాపనలు చేశారు. ఇదేసమయంలో మహిళా స్వయంసహాయ గ్రూపులకు 8 బస్సులను అందించారు. మహిళాశక్తి పథకంలో మహిళా గ్రూపులను ఆర్ధికంగా బలోపేతం చేయటంలో భాగంగా సుమారు 150 బస్సులను అద్దెకు ఇప్పించారు. ఇందులో భాగంగానే స్టేషన్ ఘన్ పూర్లోని 8 గ్రూపులకు 8 బస్సులను అందించారు. ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్(Warangal) జిల్లాలో అభివృద్ధి పనులు చేయటం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్య(Kadiyam Kavya)ను గెలిపిస్తే విమానాశ్రయం తీసుకొస్తామని ఇచ్చిన హామీ ప్రకారమే ఎయిర్ పోర్టును సాధించుకుని వచ్చినట్లు చెప్పారు. గడచిన 15 మాసాలుగా తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను రేవంత్ వివరించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పులకుప్పలాగ తయారైతే చేసిన లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చటంతో పాటు వడ్డీలు కట్టడానికి తమ ప్రభుత్వం నానా అవస్తలు పడుతున్నట్లు రేవంత్ చెప్పారు. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి ఇచ్చిన ఉద్యోగాలు, డీఎస్సీ నిర్వహించి నియమించిన టీచర్లగురించి వివరించారు. బీఆర్ఎస్ కట్టింది కాళేశ్వరం(Kaleswaram Project) ప్రాజెక్టుకాదని కూలేశ్వరం ప్రాజెక్టని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లరూపాయలు ఖర్చుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ఏళ్ళల్లోనే ఎందుకు కూలిపోయిందని నిలదీశారు. ఇపుడు తెలంగాణలో ఉన్న చాలా ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే అన్నారు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో అయినా చర్చకు తాను సిద్ధమంటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు సవాలు విసిరారు.
లక్షల జీతం ఎందుకు తీసుకుంటున్నారు ?
ఇప్పటివరకు 57.84 లక్షల జీతం తీసుకున్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటంలేదని ప్రశ్నించారు. నెలకు రు. 3.94 లక్షల జీతం తీసుకుంటున్నపుడు అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా అని నిలదీశారు. తీసుకుంటున్న జీతానికి న్యాయంచేయాలి కదాని అడిగారు. ఉద్యోగులు ఎవరైనా జీతం తీసుకున్న తర్వాత పనిచేయకపోతే ప్రభుత్వం అడగకుండా ఉంటుందా ? అని రేవంత్ అడిగారు. మొత్తానికి రేవంత్ ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పై ఆరోపణలు, సెటైర్ల మోతాదును పెంచేస్తున్నారు. చివరకు ఆరోపణలు, ప్రత్యారోపణల గోల ఎక్కడదాకా వెళుతుందో చూడాల్సిందే.