ఈ 12 గ్రామాల ప్రజలు మామూలోళ్ళు కారు
x
Kerimeri villagers (source Asifabad RDO)

ఈ 12 గ్రామాల ప్రజలు మామూలోళ్ళు కారు

మండలంలోని 12 శివారు గ్రామాలు మాత్రం అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణా పరిధిలో ఉంటాయి


ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలోని గ్రామాల ప్రజలను నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి ఫలాలు అర్హులైన అందరికీ అందక జనాలు నానా అవస్తలు పడుతుంటారు. పథకాలు తమకు అందటంలేదని, తమ గ్రామాలు అభివృద్ధి చెందటంలేదని గోలచేస్తున్న గ్రామాలను మనం చూస్తునే ఉంటాం. అలాంటిది ఈ గ్రామాల ప్రజల రెండు రాష్ట్రాల అందిస్తున్న సంక్షేమపథకాలను అందుకోవటమే కాకుండా రెండు రాష్ట్రాల నుండి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం రెగ్యులర్ గా చూసే ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ అనే అడ్వర్టైజ్మెంట్లలో లాగ అన్నమాట. కాకపోతే షాపుల్లో ఒకటికొంటే మరొకటి ఉచితం. కాని ఈ గ్రామాల్లోని జనాలకు మాత్రం రెండువైపులా పూర్తిగా ఉచితం.

ఇంతకీ విషయం ఏమిటంటే మహారాష్ట్ర-తెలంగాణా రాష్ట్రాల సరిహద్దుల్లో అసిఫాబాద్ జిల్లాలో కెరిమెరి అనే మండలం ఉంది. ఈ మండలం పూర్తిగా తెలంగాణాలోకే వస్తుంది. అయితే మండలంలోని 12 శివారు గ్రామాలు మాత్రం అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణా పరిధిలో ఉంటాయి. ఈ గ్రామాలు తమకే చెందాలంటే కాదు తమ రాష్ట్రంలోకే వస్తాయని మహారాష్ట్ర, తెలంగాణా ప్రభుత్వాలు వాదులాడుకుంటున్నాయి. గ్రామాల ప్రజలు తాము ఏ రాష్ట్రంలో ఉండాలని అనుకుంటే గ్రామాలను ఆ రాష్ట్రంలో కలిపే అవకాశముంది. ఇందుకోసం గతంలో కొన్నిసార్లు ప్రజాభిప్రాయసేకరణ కూడా జరిగింది. అయితే గ్రామప్రజలు ఎంత తెలివైన వారంటే మహారాష్ట్ర అధికారులతో మీటింగ్ జరిగినపుడు తాము మహారాష్ట్రలోనే ఉంటామని అన్నారు. తెలంగాణా అధికారులు జరిపిన మీటింగుల్లో తాము తెలంగాణాతోనే ఉంటామని చెప్పారు. అందుకనే వీరిని ఆకర్షించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలోని 12 గ్రామాల్లో పోటాపోటీగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా అందిస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ గ్రామాల ప్రజలు మామూలోళ్ళు కాదని అర్ధమైపోతోంది.

దాదాపు 20 ఏళ్ళుగా సుప్రింకోర్టులో నానుతున్న ఈ సమస్య ఇపుడు ఎందుకు చర్చనీయాంశమైందంటే ఎన్నికలు వచ్చాయికాబట్టే. ఇపుడు విషయం ఏమిటంటే పరందోలి, ముకుత్తంగూడ, భోలాపటార్, గౌరి, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల పరిధిలోని సుమారు 4 వేల మంది ఓటర్లు మహారాష్ట్ర, తెలంగాణా రెండు ఎన్నికల్లోను ఓట్లేస్తున్నారు. శుక్రవారం జరుగుతున్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ పార్లమెంటు పరిధిలో ఓట్లేస్తున్నారు. అలాగే మే 13వ తేదీన జరగబోయే ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్లేయబోతున్నారు. నిజానికి ఒకేవ్యక్తి రెండు చోట్ల ఓట్లేయటం ఎన్నికల కమీషన్ నిబంధనల రీత్యా నేరం. కాని అదే ఎన్నికల కమీషన్ పై పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలకు రెండురాష్ట్రాల్లోను ఓటింగ్ హక్కు కల్పించింది. కాబట్టి మహారాష్ట్ర, తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోను ఓటర్లజాబితాలో వీళ్ళ పేర్లున్నాయి కాబట్టే వీళ్ళు యధేచ్చగా రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు.

ఓటర్లజాబితాలో పేర్లున్నపుడు ఓటును తీసేసే హక్కు ఎవరికీ లేదు. అందుకనే రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఏమీచేయలేక వీళ్ళందరినీ పోలింగుకు అనుమతిస్తున్నారు. సంక్షేమపథకాలు అందుకోవటానికి ఆధార్ కార్డే ప్రామాణికమని అందరికీ తెలుసు. విచిత్రం ఏమిటంటే వీళ్ళందరికీ రెండు ఆధార్ కార్డులున్నాయి. మహారాష్ట్ర అధికారులు తనిఖీకి వచ్చినపుడు మహారాష్ట్రలో తీసుకున్న ఆధార్ కార్డులు చూపిస్తారు. అలాగే తెలంగాణా అధికారులు వచ్చినపుడు తెలంగాణాలో తీసుకున్న ఆధార్ కార్డులు చూపిస్తారు. పంచాయితి ఎన్నికల్లో కూడా ఒకే గ్రామంనుండి ఇద్దరు సర్పంచులుంటారు. మహారాష్ట్రలో పంచాయితి ఎన్నికలు జరిగినపుడు ఒకరు నిలబడితే, తెలంగాణా పంచాయితి ఎన్నికల్లో మరొకరు నిలబడుతున్నారు. ఏ రాష్ట్రప్రభుత్వంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడాలంటే ఆ సర్పంచ్ నాయకత్వంలో జనాలు వెళ్ళి కలుస్తారు. ఈ గ్రామాల ప్రజలు మరాఠి, తెలుగు రెండు మాట్లాడుతారు కాబట్టి భాషా సమస్యకూడా లేదు.

ఇదే విషయమై కరిమెరి ఆర్డీఓ వీ లోకేష్ ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతుూ ఒక వ్యక్తి ఒకే రాష్ట్రంలో ఓట్లేయాలనే విషయం కోర్టులో ఉన్నందున ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. ‘ ఒకే వ్యక్తి ఒకే రాష్ట్రంలో ఓటేయాలనే విషయమై తాము గ్రామస్తులతో సమావేశాలు పెట్టి చెబుతున్నాము ఇక్కడి ప్రజలు రెండు రాష్ట్రాల నుండి సంక్షేమపథకాలు అందుకుంటున్నారు. వారికి రేషన్ కార్డులు, ఇతర పథకాలకు సంబంధించిన కార్డులు రెండేసి ఉన్నాయి. అయితే ఈ వివాదం సుప్రింకోర్టు విచారణలో ఉన్నందున ఏకపక్షంగా ఓట్లను కాని పథకాలను కాని రద్దు చేయలేకపోతున్నాము,’ అని వీ లోకేష్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నిక వస్తే మగవాళ్ళు ఒకవైపు, ఆడవాళ్ళు మరో రాష్ట్రంలో ఓటింగులో పాల్గొంటారని చెబుతు సుప్రింకోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఈ పరిస్ధితి ఇలాగే కొనసాగుతుందని లోకేష్ చెప్పారు.


Read More
Next Story