
ఉగ్రవాది సాజిద్ కేసులో హవాలా కోణం !
హైదరాబాద్‌లో వారత్వంగా వచ్చిన ఆస్తులను అమ్మేసిన సాజిద్.. ఆస్ట్రేలియాలో ఇల్లు ఎలా కొన్నాడు.
ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ విషయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని నిర్ధారణ కావడంతో.. ఇక్కడ అతని లింకులపై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పోలీసులు చేస్తున్న దర్యాప్తు పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాజిద్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం 27సార్లు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే 1998లో తొలిసారి స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.. ఈ 27 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు ఎన్ని సార్లు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? వచ్చిన సమయాల్లో ఏం చేశాడు? వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తు పలు కీలక విషయాలు తెలిశాయి. 1998లో నాంపల్లిలోని అన్వర్ ఉల్ కాలేజీలో సాజిద్.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆతర్వాత అదే ఏడాది నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000 సంవత్సరంలో వెన్నసా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్పటికే వెన్నసాకు ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా ఉంది. దాంతో సాజిద్ తన వీసాను 201లో పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నాడు. 2008లో రెసిడెంట్ రిటన్ వీసాను సాజిద్ సంపాదించాడు. 2001 ఆగస్ట్ 12న సాజిద్, వెన్నసా దంపతులకు బాలుడు జన్మించాడు. అతడికి నవీద్ అని పేరు పెట్టారు. నవీద్‌కు ఆస్ట్రేలియా పర్మినెంట్ వీసా వచ్చింది.
ఆ తర్వాత 2003లో సాజిద్ తన భార్య వెన్నసాతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే ఏడాది ముస్లిం మతాచారాల ప్రకారం వారిద్దరూ మరోసారి వివాహం చేసుకున్నారు. తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిన సాజిద్.. 2006లో తండ్రి మరణం నేపథ్యంలో కుటుంబీకులను కలవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. 2012లో వారసత్వంగా వచ్చిన ఆస్తిని అమ్మడానికి కొనుగోలు దారుల వెతకడం కోసం వచ్చాడు. ఆ తర్వాత 2016లో ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అగ్రిమెంట్‌లపై సంతకాలు చేయడం కోసం తన కుమారుడు నవీద్‌తో కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఇల్లు ఒకటి కొనుగోలు చేశాడు. చివరగా 2022లో హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో అల్ హసంత్ కాలనీలో తన తల్లి, సోదరితో కలిసి ఉన్నాడు. అయితే ఉగ్రవాదానికి అతడు ఆస్ట్రేలియాలోనే ఆకర్షితుడు అయ్యాడని, హైదరాబాద్‌లో కానీ, ఇక్కడి స్థానిక ప్రభావం వల్ల కాని అతడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపినట్లు లేదని అధికారులు చెప్పారు.
ఇక్కడే అసలు ప్రశ్న మరొకటి తెరపైకి వస్తోంది. హైదరాబాద్‌లో ఆస్తులను విక్రయించిన సాజిద్.. ఆ డబ్బును ఆస్ట్రేలియాకు ఎలా తీసుకుని వెళ్లాడు? దానికి సాజిద్ అనుసరించిన మార్గం ఏంటి? అన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎటువంట ప్రకటన చేయలేదు. దీంతో హవాలా మార్గం ద్వారా సాజిద్.. నగదును ఆస్ట్రేలియాకు తరలించాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో తనకున్న ఉగ్రలింకులను వినియోగించుకున్నాడా? అన్న సందేహాలు కూడా కలుగుతన్నాయి. కాగా అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

