
హరీష్ కు పదేపదే ‘శీలపరీక్షలు’ ?
ఇన్నిసార్లు శీలపరీక్షను ఎదుర్కోవాల్సి రావటం ఎలాంటి నేతకైనా చికాకు తెప్పించే విషయమనటంలో సందేహంలేదు
నిజంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దురదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే పదేపదే శీలపరీక్షను ఎదుర్కోవాల్సొస్తోంది. ఇన్నిసార్లు శీలపరీక్షను ఎదుర్కోవాల్సి రావటం ఎలాంటి నేతకైనా చికాకు తెప్పించే విషయమనటంలో సందేహంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే బ్రిటన్(Britain) పర్యటన నుండి తిరిగి హైదరాబాదు(Hyderabad)కు చేరుకోగానే హరీష్(Harish Rao) ఎర్రవల్లి ఫామ్ హౌసుకు వెళ్ళారు. పార్టీ అధినేత కేసీఆర్(KCR) ను కలిసి మద్దతు ప్రకటించారు. తనపైన కల్వకుంట్ల కవిత(Kavitha) చేసిన అవినీతి ఆరోపణలపై చర్చించారు. అంతకముందు బ్రిటన్లో పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతు బీఆర్ఎ(BRS)స్ కు అధినేత కేసీఆర్ ఒక్కరే అని ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఇక్కడే హరీష్ బాగా ఇబ్బందిపడుతున్నట్లున్నారు. ఎందుకంటే పదేపదే కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తున్నట్లు చెప్పుకోవాల్సొస్తోంది. పార్టీకి అధినేత కేసీఆర్ ఒక్కరే అని, కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేస్తున్నాను అంటు హరీష్ ఎన్నిసార్లు ప్రకటించారో లెక్కేలేదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని హరీష్ ఎందుకు ఇన్నిసార్లు ప్రకటించాల్సి వస్తోందో అర్ధంకావటంలేదు. బీఆర్ఎస్ కు అధినేత కేసీఆరే అని ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తున్నానని అసలు హరీష్ ఎందుకు ప్రకటించాలో అర్ధంకావటంలేదు.
బీఆర్ఎస్ కు అధినేత కేసీఆర్ మాత్రమే అని అందరికీ తెలుసు. పార్టీలో ఉన్నంతవరకు ఎవరైనా కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్లు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడుతున్నట్లే అర్ధంకదా ? మళ్ళీ ప్రత్యేకించి కేసీఆరే మా నాయకుడు అని ఇన్నిసార్లు ఎవరైనా ప్రకటిస్తారా ? అంత అవసరం ఇతర ఏ నాయకుడికి లేనట్లుగా ఒక్క హరీష్ రావుకు మాత్రమే ఎందుకు వస్తోందో అర్ధంకావటంలేదు. పార్టీలో ఎప్పుడు వివాదాలు రేగినా, ఆ వివాదంలో హరీష్ పేరు ఎప్పుడు వినబడినా వెంటనే పార్టీకి కేసీఆరే అధినేత అని, తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నట్లు ఈ మాజీ మంత్రి ప్రకటన చేయాల్సొస్తోంది.
తాజాగా కవితకు సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో విభేదాలు ఏర్పడి పెద్దవైపోయాయి. దాని పర్యవసానమే కవితను పార్టీలో నుండి కేసీఆర్ సస్పెండ్ చేశారు. తనను పార్టీలో నుండి సస్పెండ్ చేశారన్న కోపంతో కవిత ఎంఎల్సీ పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో హరీష్ పైన అవినీతి ఆరోపణలతో కవిత రెచ్చిపోయారు. పార్టీలో సమస్య కేటీఆర్ తో అయితే కేటీఆర్ గురించి మాట్లాడినా, ఆరోపణలు చేసినా అర్ధముంది. అయితే కవిత ఆపనిచేయకుండా కేటీఆర్ ను వదిలేసి హరీష్ పైన బాణాలు ఎక్కుపెట్టారు.
బ్రిటన్ పర్యటనలో ఉన్న హరీష్ వెంటనే అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు. తనమీద కవిత చేసిన అవినీతి ఆరోపణలకు హరీష్ సమాధానం చెప్పలేదన్న విషయం గ్రహించాలి. అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పని హరీష్ పార్టీకి అధినేత కేసీఆర్ మాత్రమే అని ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నట్లు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. ఇంకా ఎన్నాసార్లు హరీష్ శీలపరీక్షకు నిలబడతారో చూడాలి.