మహబూబ్ నగర్ డాక్టర్ సాబ్ ఎక్కడ?
x

మహబూబ్ నగర్ డాక్టర్ సాబ్ ఎక్కడ?

మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా, టీడీపీ హయాంలో జిల్లామొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నాగం జనార్ధనరెడ్డి ప్రస్తుత పరిస్ధితే ఉదాహరణ.


ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవటం అంటే ఇదేనేమో. దాదాపు మూడు దశాబ్దాలు మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా, టీడీపీ హయాంలో జిల్లామొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి డాక్టర్ సాబ్ గా పాపులరైన నాగం జనార్ధనరెడ్డి ప్రస్తుత పరిస్ధితే ఉదాహరణ. డాక్టర్ సాబ్ గురించి జిల్లా రాజకీయాల్లో ఇపుడు అనుకునే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే రాష్ట్రవిభజన కారణంగా రాజకీయంగా ప్రాభవం కోల్పోయిన కొంతమంది నేతల్లో డాక్టర్ కూడా ఒకళ్ళు. డాక్టర్ పాత్రలేకుండా, ఊసులేకుండా జరుగుతున్న ఎన్నికలు బహుశా ఇదే మొదటిదేమో. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ వృత్తిలో ఉన్న నాగం ఎన్టీయార్ స్ధాపించిన తెలుగుదేశంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు డాక్టర్లు, టీచర్లు, లెక్చిరర్లు, లాయర్ల లాంటి వృత్తి నిపుణులు, చదువుకున్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. అందుకనే నాగంకు కూడా ఎన్టీయార్ 1983లో నాగర్ కర్నూలు ఎంఎల్ఏగా టికెట్ ఇచ్చారు. నాగంకు పేదల డాక్టర్ గా పేరుండేది. 24 గంటలూ రోగులకు ముఖ్యంగా పేదరోగులకు సేవలందించటంలో నాగం ముందుండేవారు. జిల్లాల్లో నాగర్ కర్నూల్ నుండి ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాన్ని ఎన్టీయార్ పరిశీలిస్తున్నపుడు నాగం పేరు దృష్టికి వచ్చింది. అందుకనే నాగంను ఎన్టీయార్ ప్రత్యేకంగా పిలిపించుకుని టికెట్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అభ్యర్ధి వీఎన్ గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఎన్టీయార్ ను నాదెండ్ల భాస్కార్ రావు 1984లో వెన్నుపోటుపొడిచి దింపేశారు. దాంతో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో నాగం కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. చివరకు నాదెండ్ల పదవిలో నుండి దిగిపోయి మళ్ళీ ఎన్టీయార్ కే కుర్చీని అప్పగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ఎన్టీయార్ ప్రభుత్వాన్ని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి నాగం పోటీచేశారు.

చక్రంతిప్పిన నాగం


మధ్యంతర ఎన్నికల్లో నాగం గెలిచినా 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వంగా మోహన్ గౌడ్ చేతిలో ఓడిపోయారు. మళ్ళీ 1994 ఎన్టీయార్ ప్రభంజనంలో పోటీచేసిన నాగం మంచి మెజారిటితో గెలిచారు. 1995లో ఎన్టీయార్ కు చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచినపుడు చంద్రబాబు క్యాంపులో నాగం కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే నాగంను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి నుండి ఎదురులేకుండా 1999, 2004, 2009లో గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో సుమారు తొమ్మిదేళ్ళు వైద్య ఆరోగ్య, సివిల్ సప్లైస్, అటవీ శాఖల మంత్రిగా జిల్లాల్లో చక్రంతిప్పారు. పార్టీపరంగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా కీలకంగా ఉండేవారు. 2009లో వైఎస్సార్ చనిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణా ఆందోళన మొదలై ఊపందుకుంది. తెలంగాణా వాదనకు అనుకూలంగా స్టాండ్ తీసుకున్న నాగంతో పార్టీ విభేదించింది. దాంతో 2012లో పార్టీతో పాటు ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో టీడీపీ ఎంఎల్ఏగా ఉస్మానియా యూనివర్సిటిలోకి ప్రవేశించిన నాగంపై విద్యార్ధులు దాడిచేయటం రాష్ట్రంలో సంచలనమైంది.

ఎన్నిపార్టీలు మారారో


అప్పుడు జరిగిన ఉపఎన్నికలో నాగం ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు. దాంతో కొంతకాలం పాటు నాగం కేంద్రంగా జిల్లా రాజకీయాలు బాగా తిరిగాయి. తర్వాత నాగం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తనకు బదులుగా కొడుకు నాగం శశిధర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన కొడుకు ఓడిపోయాడు. బీజేపీలో లాభంలేదని అర్ధమైపోయి కాంగ్రెస్ లో చేరి 2018లో డాక్టరే పోటీచేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి చేతిలో డాక్టర్ ఓడిపోయారు. కొంతకాలానికే నాగం టీఆర్ఎస్ లో చేరారు. అందులో ఇమడలేక పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. గడచిన ఆరేళ్ళుగా డాక్టర్ ను ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదు. ఇప్పటి పరిస్ధితి ఏమిటంటే నాగం ఏ పార్టీలోను లేరు. కనిపించిన వాళ్ళందరినీ, గుర్తుకొచ్చిన వాళ్ళందరినీ అంటే కేసీయార్, రేవంత్ లాంటి వాళ్ళందరిపైనా విమర్శలు చేసుకుంటు కాలం వెళ్ళదీస్తున్నారు.

సుమారు 78 ఏళ్ళ వయసున్న డాక్టర్ సాబ్ రాజకీయజీవితం దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఆరోగ్యం కూడా అంతగా సహకరించటంలేదని తెలిసింది. అందుకనే పెద్ద యాక్టివ్ గా లేరు. జిల్లాలోని ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులను అడిగినా ఫోన్ నెంబర్ లేదన్నారంటేనే డాక్టర్ వార్తల ముడిసరుకు కాదని అర్ధమైపోతోంది. ఇదే విషయమై డాక్టర్ తో 1973 నుండి సన్నిహితంగా ఉన్న గాజుల గోపాల్ యాదవ్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ఒకపుడు నాగం జిల్లాలో చక్రంతిప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మొదటినుండి డాక్టర్ కు కాంగ్రెస్ నేతలు కూచకుళ్ళ దామోదర్ రెడ్డి, వీఎన్ గౌడ్ తో బాగా వైరముండేదన్నారు. డాక్టర్ రాజకీయ జీవితం సగం వీళ్ళతో పోరాటం చేయటంతోనే సరిపోయిందని చెప్పారు. వయసు మీదపడిన కారణంగా నాగం యాక్టివ్ గా లేరన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నాగంకు డాక్టర్ గా మంచిపేరుండేదని గోపాల్ యాదవ్ చెప్పారు.

Read More
Next Story