NTR marriage|ఎన్టీఆర్ పెళ్ళి నా చావుకొచ్చింది
x
Sr NTR marriage with Lakshmi Parvathi

NTR marriage|ఎన్టీఆర్ పెళ్ళి నా చావుకొచ్చింది

ఉదయం 6 గంటల ప్రాంతంలో బెడ్ రూములో ఫోన్ రింగయ్యింది. నిద్రలేచి ఫోన్ అందుకున్నాను.


అది 1993వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ అనుకుంటా. ఉదయం 6 గంటల ప్రాంతంలో బెడ్ రూములో ఫోన్ రింగయ్యింది. నిద్రలేచి ఫోన్ అందుకున్నాను. అవతల నుండి ‘ముసలోడికేమైనా మెంటలెక్కిందా ఫణి’ అని వినిపించింది. మాట్లాడింది ‘ఉదయం’ బ్యూరోచీఫ్, చీఫ్ రిపోర్టర్ సీహెచ్ నాగేశ్వరరావు. ముసలోడు ఎవరు ? మెంటలెక్కడం ఏమిటి ? నాకు ఏమీ అర్ధంకాలేదు. ’ఈ వయసులో ముసలోడు పెళ్ళిచేసుకోవటం ఏంది ఫణి’? అని మళ్ళీ అడిగారు. ఎవరిగురించి మాట్లాడుతున్నారో ? నాకు అర్ధంకాకపోయినా ఆ విషయం బయటపెట్టకుండా ఆయన అడిగిన ప్రశ్నలకు తగ్గట్లుగా సమాధానాలు చెప్పి ఫోన్ పెట్టేశాను. తర్వాత ఒక్కనిముషం ఆలోచించినా నాగేశ్వరరవు ఎవరిని ఉద్దేశించి అంతపొద్దునే ఫోన్ చేసి నాతో మాట్లాడారో అర్ధంకాలేదు. అందుకనే వెంటనే హాల్ లోకి వచ్చి పేపర్లు చేతిలోకి తీసుకున్నాను.

ఇంకేముంది ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే ‘లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi) అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను’ అనే ఎన్టీఆర్(Sr NTR Marriage Proposal) ప్రకటన కమ్ ప్రతిపాదన. పేపర్లలో తాటికాయంత అక్షరాలతో బ్యానర్ హెడ్డింగులు చూడగానే నాకు ఒక్కసారిగా విషయం అంతా అర్ధమైపోయింది. వెంటనే నేను పనిచేస్తున్న ఆంధ్రప్రభ పేపర్ చూశాను. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్(Indian Express) లో తప్ప మిగిలిన అన్నీ పేపర్లలోను ఎన్టీఆర్ వివాహ(NTR Marriage) ప్రకటనే బ్యానర్ వార్త. మనసులో ఏదో శంకమొదలైంది. ఏమవుతుందో చూద్దాంలే అనుకుని బాత్ రూముకు వెళ్ళి బయటకు వస్తుంటే మళ్ళీ ఫోన్ రింగయ్యింది. ఈసారి ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రప్రభ తిరుపతి బ్యూరో చీఫ్ వెంకటరమణారావు. ఫోన్ ఎత్తగానే ‘ఫణి పేపర్లు చూశావా’ అని అడిగారు. చూశానని చెప్పగానే ‘ముసలోడు భలే పనిచేశాడుగా’ అని అన్నారు. ‘తెల్లవారే నాకు హైదరాబాద్ నుండి ఫోన్లు వచ్చాయి నీకు ఎవరైనా మాట్లాడారా’ ? అని అడిగారు. ‘లేదండి నాకు ఎవరూ ఆఫీసునుండి ఫోన్ చేయలేద’ని చెప్పాను.

వెంటనే ఆఫీసుకు వచ్చేయ్, నేను కూడా వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. బ్యూరోచీఫ్ చెప్పారు కాబట్టి రెడీ అయి 9.30 గంటలకల్లా ఆపీసుకు చేరుకున్నాను. అప్పటికే బ్యూరోచీఫ్ ఆఫీసుకు చేరుకుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. అవతల వాళ్ళు ఎన్టీఆర్ వివాహం ప్రకటన విషయమే మాట్లాడుతున్నారని నాకర్ధమైంది. ఆఫీసులో బ్యూరోచీఫ్ కన్వీన్సింగ్ గా మాట్లాడుతుంటే అవతల గొంతు రెచ్చిపోయి ధాటిగా వినబడుతోంది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ పెట్టేసి రెసిడెంట్ ఎడిటర్ పీఎస్ సుందరం మాట్లాడారని చెప్పారు. వార్త మిస్సయిన విషయంగురించే మాట్లాడినట్లు చెప్పారు. ఉదయం లేచిన తర్వాత సుందరం నుండి రమణరావుకు ఫోన్ రావటం మూడోసారి. నాకు అర్ధమైపోయింది సుందరం ఏమి మాట్లాడుంటారో. తర్వాత రమణారావే చెప్పారు సుందరం వాయించేస్తున్నారని.


ఇంతలో ఆంధ్రప్రభ డిప్యుటి ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి నుండి ఫోన్ వచ్చింది. ఈ ఫోనలో కూడా వార్త మిస్సయినందుకు రమణరావును సంజాయిషీ అడిగారు. అడగటమే తప్ప చెప్పేది ఎవరూ వినటంలేదు. తర్వాత ఏదైతే అది అయ్యిందని అనుకుని రమణరావే ఫోన్ చేసి సుందరంకు మాట్లాడారు. ‘వార్తమిస్సవటంలో ఫణి తప్పుఏమీలేదని, బాధ్యతంతా నాదే’ అని చెప్పారు. అయితే అవతల సుందరం ఏమీ వినదలచుకోలేదు. రమణరావు మాట్లాడుతుండగానే ఫోన్ పెట్టేశారు. దాంతో బ్యూరోచీఫ్ తో పాటు నాకు కూడా విషయం అర్ధమైపోయింది. ఇద్దరి మీదా లేకపోతే ఎవరో ఒకరిమీద సీరియస్ యాక్షన్ ఉంటుందని. తర్వాత రమణారావు ఆంధ్రప్రభ డిప్యూటీ ఎడిటర్ కు ఫోన్ చేసి మాట్లడారు. అయితే హైదరాబాదు ఆపీసులో ఎవరూ రమణరావు చెప్పింది వినేందకు సిద్ధంగా లేరని అర్ధమైపోయింది. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక బ్యూరోచీఫ్ తలపట్టుకున్నారు. ఎందుకంటే రమణరావు విజయవాడ నుండి తిరపతికి వచ్చి మూడునెలలే అయ్యింది. చాలా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అని ఫీలవుతున్నారు.

అసలు ఏమి జరిగింది ?

ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా(Major ChandraKanth Movie) శతదినోత్స వేడుకలను తిరుపతిలో నిర్వహించారు. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో వేడుక జరిగింది. వేడుక కవర్ చేయటానికి మోహన్ బాబు(MohanBabu) బృందం అన్నీ ఏర్పాట్లను ఘనంగా చేసింది. ఇందులో భాగంగానే మీడియాకు కూడా పాస్ లు జారీచేశారు. మీడియా, పాసులవ్యవహారానికి మోహన్ బాబు బావమరది వెంకటాద్రినాయుడు ఇన్చార్జి. రాబోయే రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి మీడియాఆపీసుకు నిర్వాహకులు రెండుపాసులు మాత్రమే పరిమితంచేశారు. ఒక పాస్ రిపోర్టర్ కు మరో పాస్ ఫొటోగ్రాఫర్ కు. అన్నీఆఫీసులకు అందినట్లే ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రప్రభ ఆఫీసుకు కూడా ముందురోజే రెండుపాసులు అందాయి. వచ్చింది రెండుపాసులే కాబట్టి రిపోర్టింగుకు రమణరావు, ఫొటోగ్రాఫర్ వెళ్ళాలని డిసైడ్ అయ్యింది. అయితే వెంకటాద్రినాయుడు నాకు బాగాసన్నిహితుడు కావటంతో ఫంక్షన్ రోజు మథ్యాహ్నం స్పెషల్ గా మూడోపాస్ పంపించాడు.



ప్రోగ్రామ్ కాసేపట్లో మొదలవబోతోంది అనగా బ్యూరోచీఫ్, ఫొటోగ్రాఫర్ బయలుదేరారు. ఎలాగూ సినిమా ఫంక్షనే కాబట్టి ఒక రిపోర్టర్ చాలులే అని బ్యూరోచీఫ్ అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో ‘ఎలాగూ పాస్ ఉంది కదా బాస్ నువ్వు కూడా రావచ్చుకదా సరదాగా ఉంటుంది’ అని బ్యూరోచీఫ్ అడిగారు. నేను ముందు ఒప్పుకోలేదు. ‘ఫంక్షన్ అయ్యేటప్పటికి చాలా సేపవుతుంది కాబట్టి నేను ఇంటికి వెళిపోతాన’ని చెప్పినా రమణరావు ఒప్పుకోలేదు. ‘ఫంక్షన్ కు వచ్చి అక్కడినుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చ’ని చెప్పటంతో నేను కూడా గ్రౌండుకు బయలుదేరాను. తిరుపతి బ్యూరో ఆఫీసు రాత్రి 7 గంటలకల్లా మూసేసేవాళ్ళు. మధ్యాహ్నం 12 గంటలనుండి రాత్రి 7 గంటలవరకే వార్తలు పంపించే అవకాశముండేది. రాత్రి 7 తర్వాత ఏమైనా అత్యవసరమైన వార్తుంటే దాన్ని ఫోన్లో మద్రాసు డెస్క్ కు ఫోన్ చేసి చెప్పేవాళ్ళం.

ఫంక్షన్ మొదలైన కొద్దిసేపటికి పోలీసులు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలని బయటకు రమ్మని అడిగారు. ఏమి మాట్లాడాలని అడిగితే ‘బయట ఎవరో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారని అత్యవసరమ’ని అంటున్నట్లు చెప్పారు. దాంతో బ్యూరోచీఫ్ కు చెప్పి బయటకు వెళ్ళాను. బయట రోడ్డుమీద నా ఫ్రెండ్స్ నలుగురు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళల్లో రమణారెడ్డి అనే ఫ్రెండ్ నాతో అర్జంటుగా మాట్లాడాలని చెప్పాడు. చెల్లెలుఇంట్లో చాలాసీరియస్ ప్రాబ్లెమ్ వచ్చిందని సాయం అవసరమని అడిగాడు. చిత్తూరుకు దగ్గర్లో ఉండే తన చెల్లెలు ఇంట్లో సమస్య గురించి చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ట్రైచేస్తే తిరుపతి ఫంక్షన్ డ్యూటీలో ఉన్నారని చెప్పారట. అందుకనే నన్ను వెతుక్కుంటూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్ కు వచ్చాడు. విషయం అంతా విన్ననేను వెంటనే గ్రౌండ్ లోకి వెళ్ళాను. ఫంక్షన్ డ్యూటీలో ఉన్న చిత్తూరు పోలీసుఅధికారిని కలిసి విషయాన్ని వివరించాను.


దాంతో కొద్దిసేపు ఆలోచించిన సదరు అధికారి ఫంక్షన్ అయిపోయిన తర్వాత తాను పలానా స్టేషన్లో లేదా ఇంట్లో ఉంటాను వచ్చి కలవమని చెప్పారు. మళ్ళీ ఆయనే ఇంటికి వస్తే వివరంగా మాట్లాడుకోవచ్చని చెప్పి రమ్మన్నారు. దాంతో నేను ఫ్రెండ్ కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదే విషయాన్ని బ్యూరోచీఫ్ తో చెబితే సినిమా ఫంక్షనే కదా నేను చూసుకుంటాను వెళ్ళమని చెప్పారు. దాంతో పర్మీషన్ తీసుకుని నేను ఫంక్షన్ నుండి బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో మా ఇంటికి చేరుకున్నాను. తర్వాత రాత్రి పదిగంటల ప్రాంతంలో ఫంక్షన్ ముగించుకుని పోలీసు అధికారి మా ఇంటికి ఫోన్ చేశారు. వెంటనే ఫ్రెండ్స్ తో కలిసి నేను అధికారిని కలిసి రమణారెడ్డి చెల్లెలు సమస్యను వివరించి తిరిగి మా ఇంటికి చేరుకునేటప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది.

సీన్ కట్ చేస్తే

రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఘనవిజయం గురించే మాట్లాడారు. షూటింగులో జరిగిన విశేషాలు, తాను సినిమాలో నటించడానికి మోహన్ బాబు ఏ విధంగా కారణమనే విషయాలను వివరించారు. దాదాపు గంటసేపు అనర్ఘళంగా మాట్లాడి ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. దాంతో ఫంక్షన్ కు హాజరైన అభిమానులు, టీడీపీ క్యాడర్, జనాల్లో చాలామంది గ్రౌండ్ బయటకు బయలుదేరేశారు. ఎన్టీఆర్ తనచేతిలోని మైకును మోహన్ బాబుకు ఇచ్చి కుర్చీలో కూర్చున్నారు. వేదికమీద ఉన్న సినిమా యూనిట్ తో ఫొటోలు దిగుతున్నారు. అభిమానులను ఉద్దేశించి మోహన్ బాబు ఏదో మాట్లాడుతున్నారు. రామారావు మాట్లాడటం అయిపోగానే రిపోర్టర్లు తమ ఆఫీసులకు బయలుదేరేశారు. ఇంతలో ఏమైందో ఏమో కుర్చీలో నుండి లేచిన అన్నగారు మోహన్ బాబు చేతిలో నుండి మైకును అందుకున్నారు. గ్రౌండ్ లో నుండి లేచి బయటకువెళుతున్న అభిమానులను ఒక్కనిముషం ఆగమన్నారు.



అభిమానులను ఒక్కనిముషం ఆగమన్న ఎన్టీఆర్ ఎవరూ ఊహించనిరీతిలో లక్ష్మీపార్వతి ప్రస్తావన తెచ్చారు. వేదికమీదే ఉన్న లక్ష్మీపార్వతిని ఉద్దేశించి ‘ఆమె అంగీకరిస్తే తాను వివాహం చేసుకుంటా’నని ప్రకటించారు. ఆ ప్రకటనతో అభిమానులకు మతిపోతే టీడీపీ(TDP) నేతలందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. వెంటనే మోహన్ బాబు, టీడీపీ నేతలు ఎన్టీఆర్ చేతిలోని మైకును లాగేసుకుని అందరినీ వేదికమీద నుండి దించేసి వాహనాల్లో తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అక్కడే ఉన్న ఒక మీడియా మిత్రుడు ఎన్టీఆర్ ప్రకటనను విన్నారు. వెంటనే అదే విషయాన్ని కొందరు మీడియా మిత్రులకు ఫోన్లు చేసి చెప్పారు. దాంతో ఆనోటా ఈ నోటా రిపోర్టర్లందరికీ ఎన్టీఆర్ పెళ్ళి ప్రస్తావన చేరిపోయింది. దాంతో అందరు అదే ప్రకటనను ప్రముఖంగా ఇచ్చారు. సినిమా వార్త వెనక్కుపోయి మ్యారేజి వార్త బ్యానర్ హెడ్డింగ్ అయిపోయింది.

ఫంక్షన్ మధ్యలోనే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయిన నేను పోలీసు అధికారి ఇంట్లో కూర్చుని చిత్తూరుకు ఫోన్ చేయించి ఫిర్యాదు తీసుకునేట్లుగా ఫోన్లో చెప్పించి ఫ్రెండ్ ను చిత్తూరు బస్సుఎక్కించి అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకున్నాను. కాబట్టి ఫంక్షన్లో జరిగింది, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ చేసిన పెళ్ళి ప్రకటన ఏమీ నాకు తెలీదు. మరుసటి రోజు ఉదయం నాగేశ్వరరావు ఫోన్ తో లేచిన నేను పేపర్లు తిరగేస్తే కాని విషయం తెలీలేదు. ఆఫీసుకు చేరుకున్న నేను బ్యూరోచీఫ్ ను అడిగాను వార్తను ఎందుకు కవర్ చేయలేదని. రమణరావు చెప్పింది ఏమిటంటే నేను గ్రౌండ్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఆయన కూడా బయటకు వెళ్ళిపోయారు. సినిమా ఫంక్షన్ ను మనం కవర్ చేసేది ఏముంటుందని అనుకున్న బ్యూరోచీఫ్ కాసేపు అయిన తర్వాత వెళ్ళి బార్లో కూర్చున్నారు. మరుసటిరోజు ఉదయం పేపర్లు చూసేంతవరకు ఆయనకూ ఎన్టీఆర్ పెళ్ళి ప్రస్తావన విషయం తెలీదు.

గోతులు తవ్వే వారుంటారు

ఎక్కడైనా మనతోనే ఉంటూ మనవెనుక గోతులుతవ్వే వారుండటం సహజం. నా విషయంలో కూడా అదే జరిగింది. ఎలాగంటే మా ఆపీసులోనే సీనియర్ రిపోర్టర్ ఒకరున్నారు. రాత్రి 11 గంటల తర్వాత హైదరాబాద్ నుండి డిప్యూటీ ఎడిటర్ ఆయనకు ఫోన్ చేసి విషయం ఏమిటని అడిగారు. సదరు సీనియర్ రిపోర్టర్ నా గురించి చాలా బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నిజానికి నాకు సినిమా ఫంక్షన్ అసైన్ మెంటుతో సంబంధమే లేదని సీనియర్ కు బాగా తెలుసు. అయినా నాగురించి బ్యాడ్ గా చెప్పటంతో చెప్పుడుమాటలు వినే అలవాటున్న డిప్యూటీ ఎడిటర్ సీనియర్ చెప్పిన అబద్ధాలనే నిజమని నమ్మారు. సీనియర్ రిపోర్టర్ చెప్పిన అబద్ధాలని నమ్మారు కాని అసలు ఏమి జరిగిందో నన్ను అడిగాలన్న ఆలోచన మాత్రం డిప్యూటీ ఎడిటర్ కు రాకపోవటం విచిత్రం. ఆయనకు ఆలోచన రాకపోగా నేను ఫోన్ చేసి విషయం వివరిద్దామని ప్రయత్నించినా వినిపించుకోలేదు. అసైన్ మెంటుతో సంబంధంలేకపోయినా పాస్ అదనంగా ఉందన్న కారణంతో ఫంక్షన్ కు వెళ్ళిన నాపై మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకున్నది. ఇంతకీ తర్వాత తెలిసింది ఏమిటంటే ఎన్టీఆర్ పెళ్ళి వార్త ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రప్రభ హైదరాబాద్, విజయవాడ, మద్రాసు ఎడిషన్లలో కవర్ అయ్యింది. తిరుపతిలో ఫంక్షన్ జరిగితే తిరుపతి రిపోర్టర్ నుండి వార్త ఫైల్ కాలేదన్నది మేనేజ్మెంట్ కోపం. అందుకనే రమణరావును వెంటనే ట్రాన్స్ ఫర్ చేసిన మేనేజ్మెంట్ నన్ను ఉద్యోగంలో నుండి తీసేసింది. ఆ విధంగా ఎన్టీఆర్ పెళ్ళి నా చావుకొచ్చింది.



కొసమెరుపు

1993లో ఎన్టీఆర్ పెళ్ళి ప్రకటనతో ఉద్యోగం పోగొట్టుకున్న నేను మళ్ళీ 2009లో రెండోసారి కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాను. మొదటిసారి ఎన్టీఆర్ పెళ్ళి ప్రకటన కారణంగా ఉద్యోగం పొగొట్టుకున్న నేను 2009లో చంద్రబాబునాయుడు(Chandrababu)కారణంగా ఉద్యోగం కోల్పోయాను. ‘మామా, అల్లుళ్ళు నామీద పగపట్టారేంటిరా బాబూ’ అని తలపట్టుకోవాల్సొచ్చింది. 2009 ఎన్నికల సమయంలో అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అప్పుడు నేను ఏదో ప్రశ్న వేశాను. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని చంద్రబాబు నన్ను వెంటనే ‘సాక్షికి రాజీనామా చేసి వచ్చేయ్ మనసంస్ధలు చాలా ఉన్నాయ’ని చెప్పారు. ‘నీలాంటి వాళ్ళు అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షిలో పనిచేయకూడద’ని నామీద చాలా ప్రేమున్నట్లుగా చెప్పారు. రాత్రి ఆపీసుకు వెళ్ళిన నన్ను ఎడిటర్ వర్దెల్లి మురళి పిలిపించారు. చంద్రబాబుకు నాకు ఉన్న సంబంధాలు అడిగారు. సంవత్సరాలుగా చంద్రబాబుతో వృత్తిపరమైన పరిచయం మాత్రమే ఉందని చెప్పాను. అయితే నేను చెప్పింది మురళి నమ్మలేదు. మరికొన్ని విషయాలు మాట్లాడిన మురళి నన్ను రాజీనామా చేయమని చెప్పటంతో చేయకతప్పలేదు.

ఏమి జరిగింది ?

జరిగింది ఏమిటంటే చంద్రబాబు ప్రెస్ మీట్ లైవ్ రిలే అయ్యింది. లైవ్ రిలే అయిన మీడియా సమావేశాన్ని సాక్షి దినపత్రికలోని ముఖ్యులంతా చూశారు. నన్ను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Rdddy)పై చంద్రబాబు బురదచల్లుతున్నారని తీర్మానించారు. నిజానికి వాళ్ళ ఆలోచన తప్పని వాళ్ళకు కూడా బాగా తెలుసు. జగన్ పై బురదచల్లాలని చంద్రబాబు అనుకుంటే అందుకు నా అవసరం ఏముంది ? ఇక్కడ కూడా చెప్పుడుమాటలు విన్న మురళి నన్ను రాజీనామాచేయమని అడగటమే ఆశ్చర్యమేసింది. ఏమి జరిగిందో వివరించి చెబుదామని అనుకుంటే ఎడిటోరియల్ డైరక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ విధంగా మామ ఎన్టీఆర్, అల్లుడు చంద్రబాబు కారణంగా రెండుసార్లు నా తప్పులేకపోయినా ఉద్యోగం పోగొట్టుకున్నాను.

Read More
Next Story