పెద్దపల్లి ‘కాకా’ కంచుకోట ఎలా అయింది?
తెలంగాణలో ‘కాకా’ పేరు తెలియని వారుండరు. వారసత్వంగా ఆయన కుమారులు జి వినోద్, జి వివేక్‌లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.కాకా మనవడు వంశీ కృష్ణ ఎన్నికల బరిలో దిగారు.
గడ్డం వెంకటస్వామి అలియాస్ గుడిసెల వెంకటస్వామి అలియాస్ కాకా సుదీర్ఘ కాలం పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర కార్మిక,జౌళి శాఖల మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేయడంతోపాటు ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ నియోజకవర్గమైన పెద్దపల్లిని తన ఎన్నికల కార్యక్షేత్రంగా ఎంచుకొని మొదటిసారి 1989వ సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. అలా ఎంపీ అయిన కాకా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ కేంద్రమంత్రిగా ఎదిగారు.
గుడిసెల వెంకటస్వామిగా ఎలా గుర్తింపు పొందారంటే...
అప్పట్లో హైదరాబాద్ నగరంలో వెంకటస్వామి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో నిరుపేదలు, రిక్షాపుల్లర్స్‌ను సమీకరించి 70వేల గుడిసెలు వేయించారు. ముందుగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించడం, తర్వాత ఆ గుడిసెకు మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబరు తీసుకోవడం, ఆపై కరెంటు,నల్లా కనెక్షన్ పెట్టించుకొని పక్కా ఇల్లు కట్టుకోవడానికి వెంకటస్వామి పేదలకు సహకరించారు. దీంతో ఈయనకు గుడిసెల వెంకటస్వామి అని పేరొచ్చింది.
కాకా కుటుంబం పాగా ఎలా వేసిందంటే...
నిత్యం ప్రజలతో కలిసి మెలసి ఉండే వెంకటస్వామికి పెద్దపల్లి ఓటర్ల నుంచి అభిమానం లభించింది. 70వేల గుడిసెలు వేయించి పేద ప్రజల అభిమానాన్ని పొందిన గుడిసెల వెంకటస్వామి ఆ చొరవతోనే పెద్దపల్లి నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు. ‘‘పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడం, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చురుకుగా, విధేయుడిగా ఉండి పనిచేస్తున్న కాకా పాగా వేయగలిగారు, ఎంపీగా వరుస విజయాలతోనే కేంద్రమంత్రి కాగలిగారు’’అని కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ సంఘం నాయకుడు బీఎస్ రాములు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
‘‘కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసిన కాకా కుటుంబం అంటే తెలంగాణలో ఏర్పడిన బ్రాండ్ ఇమేజ్ వల్లనే ఆయన ఇద్దరు కుమారులు గడ్డం వివేక్, గడ్డం వినోద్ లు ఎమ్మెల్యేలయ్యారు’’ అని బీఎస్ రాములు పేర్కొన్నారు. కాకా అనంతరం వారసత్వంగా ఆయన కుమారులు, ఆయన మనవడు రాజకీయ రంగప్రవేశం చేశారని బీఎస్ రాములు విశ్లేషించారు.
పెద్దపల్లి పార్లమెంట్ కాకా కుటుంబ కంచుకోట
కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్ధండుడిగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి(కాకా) పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం 1989 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టె భూపతిపై కాకా మొదటిసారి విజయం సాధించారు. అనంతరం 1991 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో కాకా రెండో సారి విజయ దుందుభి మోగించారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన సమీప టీడీపీ అభ్యర్థి సుద్దాల దేవయ్యపై 65,465 ఓట్ల ఆధిక్యంతో హ్యాట్రిక్ విజయం సాధించారు.2004వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్దపల్లి ఎంపీగా కాకా తిరుగులేని విజయం సాధించారు.
ప్రజలకు కాకా సేవ చేసిండు...
పెద్దపల్లి ఎంపీగా, కేంద్రమంత్రిగా జి వెంకటస్వామి ప్రజలకు సేవ చేసిండని కాకా బయోగ్రఫీని రాసిన పుస్తక రచయిత పి చంద్ యాదగిరి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కాకా రాజకీయం, ఆయన చేసిన సేవలపై యాదగిరి ‘మేరా సఫర్’పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పెద్దపల్లిలో ఎస్సీ సంఘంలో చురుకుగా పనిచేసిన కాకా ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి సత్తా చాటారని యాదగిరి వివరించారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేయడం, తెలంగాణ సాధన ఉద్యమానికి కాకా పాటుపడ్డారని ఆయన పేర్కొన్నారు.
రెండు సార్లు ఓటమి
1998,1999 పార్లమెంట్ ఎన్నికల్లో కాకా ఓటమి చవి చూశారు. అనంతరం మళ్లీ 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన జి వెంకటస్వామి ఘన విజయం సాధించారు. తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన కాకా కుమారుడు, విశాఖ ఇండస్ట్రీస్ అధిపతి డాక్టర్ జి వివేకానంద్ 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 34.7 శాతం ఓట్లతో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై 49,083 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. అలాగే చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వివేక్ వెంకటస్వామి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు.
రెండో కుమారుడి రాజకీయం
కాకా రెండో కుమారుడు గడ్డం వినోద్ కూడా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నుంచి కాకా కుమారుడు గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1999,2009, 2010 ఉప ఎన్నికల్లో చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జి వినోద్ ఓటమి చవి చూశారు. అనంతరం మళ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.
ఎన్నికల బరిలో కాకా మూడో తరం వారసుడు
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేసిన కాకా కుటుంబం నుంచి మూడోతరానికి చెందిన గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అమెరికా యూనివర్శిటీలో డిగ్రీ చదివిని వంశీకృష్ణ కురువృద్ధుడు కాకాకు మనవడు. తండ్రి వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేగా, బాబాయి గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాకా మనవడితో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఢీ కొంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ బరిలోకి దిగారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి జి శ్రీనివాస్ ను మార్చి ప్రస్థుత సిట్టింగ్ ఎంపీ అయిన బి వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
Next Story