రేవంత్ ప్రభుత్వం ఎలా కూలిపోతుంది ?
x
Revanth kcr and kishan

రేవంత్ ప్రభుత్వం ఎలా కూలిపోతుంది ?

కేసీయార్ అయినా, కిషన్ అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం తమకు లేదని చెబుతున్నారు. అయితే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని కూడా అంటున్నారు.


‘రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చదు..దానంతట అదే కూలిపోతే బీజేపీకి సంబంధంలేదు’ ..ఇది కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్య. ఇదే సమయంలో కేసీయార్ మాట్లాడుతు ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోకూడదు, పూర్తిగా ఐదేళ్ళుండాలి’ అన్నారు. అంటే కేసీయార్ అయినా, కిషన్ అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం తమకు లేదని చెబుతున్నారు. అయితే తొందరలోనే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని కూడా అంటున్నారు. ఒకవైపు రేవంత్ ప్రభుత్వాన్ని ఎవరికి వారుగా తాము కూల్చమని చెబుతునే మరోవైపు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పటంలో అర్ధమేంటి ? ఇద్దరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యంలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింకెవరు కూల్చుతారు ?

ఇపుడిదే విషయంపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ ముఖ్యమంత్రి అవటాన్ని ఇటు కేసీయార్ అటు కిషన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. బహుశా రేవంత్ ప్లేసులో ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయ్యుంటే ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీయార్, కిషన్ చూపిస్తున్న అక్కసు అంతగా ఉండేదికాదేమో. రేవంత్-కేసీయార్ మధ్య అంటే ఓటుకునోటు లాంటి వివాదాలు ముదిరిపోయున్నాయి. మరి రేవంత్, కిషన్ మధ్య ఏమి వివాదాలున్నాయో అర్ధంకావటంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేకన్నా రేవంత్ సీఎం అవటాన్ని వీళ్ళు భరించలేకపోతున్నట్లున్నారు.

అందుకనే రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నదగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే అయితారంటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మహేశ్వర్ రెడ్డి ప్రతిరోజు గోలచేస్తునే ఉన్నారు. కొందరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలతో కలిసి రేవంత్ కాంగ్రెస్ పార్టీని చీల్చేస్తారని నానా రచ్చచేస్తున్నారు. అలాగే కేసీయార్, కేటీయార్, హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కాంగ్రెస్ లోని తనవర్గం ఎంఎల్ఏలతో తొందరలోనే రేవంత్ బీజేపీలో కలిసిపోతారంటు కారుపార్టీ నేతలు గోలచేస్తున్నారు. మొత్తానికి ఎవరికివాళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చమని చెబుతునే ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుందని చెబుతుండటమే విచిత్రంగా ఉంది.

రేవంత్ ప్రభుత్వం ఒకరకంగా సేఫ్ అనే అనుకోవాలి. ఎలాగంటే అధికారపార్టీలో నుండి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల్లోకి వెళ్ళే ఎంఎల్ఏలుండరని అందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి వెళితే ఎంపీలు వెళ్ళినా అర్ధముంది కాని ఎంఎల్ఏలకు వెళ్ళాల్సిన అవసరంలేదు. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీల్లోకి కాంగ్రెస్ ఎంఎల్ఏలు వెళ్ళేది లేదు రేవంత్ ప్రభుత్వం కూలిపోయేదీలేదు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ చెప్పినట్లుగా 10 సీట్లు రాకపోతే అప్పుడు బీఆర్ఎస్ కే నష్టమెక్కువ. ప్రజాప్రతినిధులను, నేతలను పార్టీలో అట్టిపెట్టుకోవటం కేసీయార్ కు చాలా కష్టమవుతుంది. ఆ విషయం అందరికీ అర్ధమైపోతోంది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికే కేసీయార్ పదేపదే రేవంత్ ను టార్గెట్ చేస్తున్నట్లున్నారు. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.

Read More
Next Story