
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇలా..!
ఇదో చారిత్రాత్మక నిర్ణయమన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హర్షం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నెం.9ని విడుదల చేసింది. పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణలకు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో వాటికి అనుగుణంగా జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీల వారీగా జెడ్పీపీ, ఎంపీపీ పదవులు, స్థానాలు, సర్పంచ్ పదవులు, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి మార్గదర్శకాలను సర్కార్ రిలీజ్ చేసింది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సహా గ్రామపంచాయతీ ఎన్నికల్లోని అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించడానికి లాటరీ పద్దతిని అనుసరించనున్నారు అధికారులు.
పార్టీల సమక్షంలో లాటరీ..
రిజర్వేషన్ల ఖరారుకు అవలంభించే లాటరీ పద్దతిని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించనున్నారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు పీఆర్ఆర్డీ డైరెక్టర్ సృజన ఆదేశించారు. మహిళల రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారామె. అయితే రిజర్వేషన్ల ఖరారులో తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు చేయనున్నారు. షెడ్యూల్డ్ ఏరియాల్లోని ఎంపీపీ సీట్లలో ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వ్ చేయాలి. ఆ మండలంలోని మొత్తం ఎంపీటీసీ సీట్లలో ఎస్టీలకు సగం కంటే ఎక్కువ స్థానాలను రిజర్వ్ చేయాలి. ఈ ఏరియాల్లో ఎంపీపీ అధ్యక్షుల పదవులన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయాలి.
ప్రత్యక్ష పద్దతిలోనే గ్రామపంచాయతీ రిజర్వేషన్లు
వార్డు సభ్యులకు, సర్పంచ్ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. కులగణన 2024 సర్వే ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల స్థానాలను ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. గతంలో అనుసరించిన పద్దతులకు భిన్నంగా డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగానే రిజర్వేషన్లు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అధికారులు. ప్రతి కేటగిరీలో సీట్ల రిజర్వేషన్ కూడా కమిషన్ సూచనల ప్రకారమే చేయాలి.
చారిత్రాత్మక నిర్ణయం: నిరంజన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.9పై బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జీఓతో వెనకబడిన తరగతుల ప్రజల కల నెరవేరిందన్నారు. ఈ జీఓ ద్వారా వెనకబడిన వర్గాలకు చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.