
సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం ఎలా వెళ్లాలంటే..!
ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు తొలి రోజు నుంచే భక్తజనం పోటెత్తుతున్నారు. చాలా మంది ఈ పుష్కరాలకు వెళ్లాలని భావిస్తారు. కానీ వారిలో చాలా మందికి కాళేశ్వరం ఎలా వెళ్లాలో తెలియదు. అందువల్లే అనేకమంది పుష్కరాలకు వెళ్లకుండానే ఆగిపోతారు. మరి ఇంతకీ సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం ఎలా వెళ్లాలో చూద్దామా..
గురువారం నుంచి మే 26 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాల కోసం శ్రీ కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం ఉన్న టెంపుల్ టౌన్ అంగరంగవైభవంగా ముస్తాబయింది. భక్తులకు స్వాగతం పలుకుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కరస్నానాలు చేయాలని భక్తులు పరితపిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5:45 గంటలకు మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజల తర్వాత పుష్కరాలను ప్రారంభించారు. ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలు జరిగే ఈ 12 రోజుల పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకోవడానికి కట్టుదిట్టమైన భద్రతను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఘాట్‌ల దగ్గర పరిశుభ్రతను పరిశీలించడం కోసం 50 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. భక్తుల భద్రత కోసం డజన్ల కొద్దీ గజీతగాళ్లు, బోట్లను కూడా అందుబాటులో ఉంచారు.
కాళేశ్వరం.. హైదరాబాద్ నుంచి 314 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి వెళ్లడానికి అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత వాహనాల్లో కూడా చాలా సులభంగా కాళేశ్వరం వెళ్లొచ్చు. ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ ఆర్టీసీ అనేక ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వరంగల్ రీజియన్‌లోని హనుమకొండ, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్ డిపోల నుంచి నేరుగా కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఛార్జీలు సాధారణ బస్సుల్లో ఛార్జీల కంటే ఎక్కువ ఉంటాయి.
ఇక రైళ్ల ద్వారా ప్రయాణించే వారికి అయితే వరంగల్ నుంచి రావడం మంచిది. హైదరాబాద్, విజయవాడ నుంచి వరంగల్ ప్రతిరోజూ బస్సులు బాగానే ఉంటాయి. కనీసం రోజుకు 10 బస్సులు అయినా ఉంటాయి. వరంగల్ కాజీపేట నుంచి నేరుగా కాళేశ్వరంకు బస్సు సౌకర్యం ఉంది. అంతేకాకుండా కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రతాచలం రోడ్, నెక్కొండ రైల్వే స్టేషన్లకు వచ్చినా సరే అక్కడి నుంచి కాళేశ్వరంకు నేరుగా బస్సులు ఉంటాయి.
ఏపీ నుంచి వచ్చే భక్తులు ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, సూర్యాపేట మీదుగా కాళేశ్వరానికి రావొచ్చు. భద్రాచలం నుంచి వచ్చేవారు ఏటూరునాగారం చేరుకోవాలి. అక్కడి నుంచి జాకారం స్టేజీకి చేరుకుని భూపాలపల్లి, మహదేవ్‌పూర్ వెళ్లవచ్చు. అక్కడి నుంచి కాళేశ్వరం వెల్లడం పెద్ద కష్టమే కాదు. అయితే ఈ మార్గ రాత్రి సమయం కన్నా పగటిపూట ప్రయాణం మంచిది. ఖమ్మం నుంచి వచ్చే వారు కూడా ఇదే మార్గాన కాళేశ్వరం రావొచ్చు. దాంతో పాటుగా కురవి, మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి మీదుగా కూడా కాళేశ్వరం చేరుకోవచ్చు.
ఇక హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన సరస్వతి పుష్కరాలకు వెళ్లాలంటే వాళ్లు ముందుగా వరంగల్ చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగు ద్వారా మల్లంపల్లి మీదుగా జాకారం రావాలి. జాకారం స్టేజీ దగ్గర ఎడమచేతి మలుపు తీసుకోవాలి. ఆ తర్వాత రంగయ్యపల్లి దగ్గర కుడిచేతి వైపు మలుపు తీసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా వెళ్తే మహదేవ్‌పూర్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే నేరుగా కాళేశ్వరం వస్తుంది. ఈ రోడ్డు చాలా సౌకర్యంగా ఉంటుంది. బస్సులో వెళ్లాలి అనుకునే వారు.. హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్లాలి. అక్కడి నుంచి కాళేశ్వరానికి దాదాపు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది.