గీతా రామస్వామి జీవితమే ఈ అడుగడుగునా తిరుగుబాటు!
x

గీతా రామస్వామి జీవితమే ఈ 'అడుగడుగునా తిరుగుబాటు'!

జార్జి రెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి. సిరిల్ రెడ్డి భార్య గీతా రామస్వామి. సిరిల్ రెడ్డి, గీతా రామస్వామి ఇంకా కొందరు కలిసి హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ ని స్థాపించారు.


(అమిధేపురం సుధీర్)
చాలా రోజుల తర్వాత ఏక బిగిన చదివిన పుస్తకం ఇది. హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్తాపకురాలు, ఉద్యమకారిణి గీతా రామస్వామి ఇంగ్లీష్ లో రాసిన ఆత్మకథ కి ఇది తెలుగు అనువాదం. 457 పేజీల సుదీర్ఘ పుస్తకమే అయినా ఎక్కడా విసుగు పుట్టించకుండా చదివిస్తుంది. గీతా రామస్వామి ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోనే రాశారు. అయినా ఇది తెలుగు అనువాదంలా అనిపించకుండా, వారే ఇది తెలుగులో రాశారేమో అనిపించేలా ప్రభాకర్ మందార అనువదించారు.
కొన్నేళ్ళ క్రితం అకస్మాత్తుగా అందరి దృష్టీ జార్జి రెడ్డి మీద పడింది. యూట్యూబ్ లో పేపర్లలో ఒక్కసారిగా అతని గురించి విపరీతంగా వినిపించ సాగింది. ఎప్పుడో 2004 విడుదలైన మణిరత్నం సినిమా ‘యువ’ లో సూర్య పాత్ర, జార్జి రెడ్డి ని స్పూర్తిగా తీసుకొని రూపొందించారనే ఒక్క విషయం నాకు చాలా ఆసక్తిని కలిగించింది.
అసలు ఎవరీ జార్జి రెడ్డి అన్న వెతుకులాటలో, ‘జీనా హై తో మర్నా సీఖో’ అనే పుస్తకం మళ్ళీ హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళదే పబ్లిష్ అయితే కొని చదివాను.

అప్పుడు తెలిసిన విషయాలే, జార్జి రెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి అని, సిరిల్ రెడ్డి భార్య గీతా రామస్వామి అని, సిరిల్ రెడ్డి, గీతా రామస్వామి ఇంకా కొందరు కలిసి హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ ని స్థాపించారని...
పీ.వీ. నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే, పిల్లర్ నంబర్ 68 దగ్గరలో వున్న వారి ఆఫీస్ కి కూడా వెళ్ళాం ఒకసారి. అప్పుడు గీతా రామస్వామి ఆఫీసు లో లేరు. కానీ వారి దగ్గర స్టాక్ లో ఉన్న కొన్ని పుస్తకాలు కొనుక్కొని వచ్చాం.
ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, అప్పటికి నాకు వారి గురించి తెలిసింది చాలా తక్కువ. అయినా ఖచ్చితంగా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వుంటారు, ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులతోనే పుస్తక ప్రచురణ చేస్తుంటారు అన్న ఒక చిన్న భావన వారి మీద గౌరవాన్ని పెంచింది.
అలాంటిది తనే స్వయంగా తన చరిత్ర రాశారన్న విషయం తెలిశాక వెంటనే ఈ పుస్తకం కొని చదివాను.
గీత, సిరిల్ రెడ్డి ఇద్దరూ కొంతకాలం, ప్రత్యక్ష రాజకీయల్లో వున్నారు. మొదట సిద్దాంతాన్ని నమ్మి పార్టీ కోసం పని చేశారు. అండర్ గ్రౌండ్ కి వెళ్ళారు, ప్రత్యక్ష పోరాటాల్లో వున్న ఎంతో మంది తో కలిసి పనిచేసినవారు. ఎందుకు పార్టీలోంచి బయటకి రావలిసి వచ్చిందో, ఎందుకు మార్క్సిస్ట్ పార్టీలు ఇప్పటికీ విజయవంతం కాలేకపోతున్నాయో వివరించిన తీరు, కారణాలు నాకు బాగా నచ్చాయి.
మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన కుల వ్యవస్తని, దాని మీద ఎంతో చెప్పిన అంబేద్కరిజాన్ని, మార్క్సిస్ట్ పార్టీలు తమ విధానాల్లో, సిద్దాంతాల్లో, ఆచరణలో చూపెట్టకపోవడం, అలాగే పార్టీలో అంతర్గతంగా వుండే కఠినమైన ఏక పక్ష విధానాలు, చీలికలు, ఈగో లు ఇలాంటి సమస్యలని బాగా వివరించారు.
మొత్తమ్మీద మార్క్సిజం, అంబేద్కర్ సిద్దాంతాల మధ్య ఉన్న అంతరాల గురించి ఇంకొంచెం తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది.
ఈ పుస్తకం 1975 నుంచి 1993 వరకూ గీతా రామస్వామి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల సమాహారం. చాలా విషయాలని చాలా నిర్మొహమాటంగా ఇందులో వివరించారు.
పుస్తకం పూర్తయ్యేటప్పటికి ఒక సంతృప్తి, ఇంకా తెలుసుకోవలసిన కొత్త విషయాల గురించి ఒక అవగాహన రెండూ కలిగాయి.
ఈ వ్యాసం మళ్ళీ చదివితే అనిపించింది, ఈ పుస్తకం నన్ను బాగానే ఆవహించిందని, లేకపోతే ఇందులో వాడిన పదాలు ఇంతకు ముందెప్పుడూ ఇలా నేను వాడలేదు.
ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలలో దీన్ని కూడా చేర్చుకోమన్నదే నా విన్నపం.
(ఆకాశవాణి మాజీ అధికారి వి.గోపిచంద్ సౌజన్యంతో)
Read More
Next Story