హైదరాబాద్ నీళ్లన్ని ఎక్కడికి పోయాయి...?
x
water problem (source; Twitter)

హైదరాబాద్ నీళ్లన్ని ఎక్కడికి పోయాయి...?

హైదరాబాద్ కు ఒకపుడు నీళ్లకరువు పెద్దగా లేదు. చుట్టూర చెరువుల్లోనీళ్లుండేవి, భూగర్భంలో సమృద్ధి నీళ్లు వూరేవి.... అవన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయి?


హైదరాబాద్ తొందరలోనే మరో బెంగుళూరులాగ అయిపోతుందా ? అంటే హ్యాపీగా ఫీలైపోవక్కర్లేదు. హైదరాబాద్ తొందరలోనే మరో బెంగుళూరు అయిపోతుందంటే కష్టాల్లో, సమస్యల్లో మాత్రమే. ఎలాగంటే నీటిఎద్దడి విషయంలో. ఈమధ్యనే బెంగుళూరులో నీటికష్టాల గురించి అందరు వార్తలు చూసుంటారు, వినుంటారు. ఛానళ్ళు ప్రత్యేకమైన కథనాలు కూడా ఇచ్చాయి బెంగుళూరు నీటికష్టాల మీద. ఏస్ధాయిలో బెంగుళూరులో నీటికష్టాలు వచ్చాయంటే ఎంతడబ్బులు పెట్టి కొందామని ప్రయత్నించినా నీరు దొరకనంతగా. అందుకనే అవకాశమున్న వేలాదిమంది కొద్దిరోజులు బెంగుళూరు సిటీని వదిలేసి తమ సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. పొద్దున లేచిన తర్వాత అవసరాలు తీర్చుకోవటానికి కూడా నీళ్ళు దొరకలేదంటే బెంగుళూరులో నీటి కష్టాలు ఏ స్ధాయిలో తలెత్తాయో అర్ధంచేసుకోవచ్చు.

అలాంటి నీటికష్టాలే తొందరలో హైదరాబాద్ లో కూడా తప్పవని వాతావరణ శాస్త్రవేత్తలు, భూగర్భజల పరిశోధనా నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఆందోళనపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నాగరికతపేరుతో అపరిమితంగా పెరిగిపోతున్న అర్బనైజేషనే. నగరంలో నీటి లభ్యతకు, పెరిగిపోతున్న జనాభాకు, నిర్మాణాలకు అసలు పొంతన ఉండటంలేదు. నీటి లభ్యతకుమించి నిర్మాణాలు, జనాభా పెరిగిపోతుండటమే నీటిఎద్దడికి ప్రధాన కారణమవుతోంది. నీటియాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పాలకులు యథేచ్చగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిర్మాణాల పేరుతో అక్రమనిర్మాణాలు కూడా పెరిగిపోతున్నా పాలకులు అసలు పట్టించుకోవటంలేదు. నీటిఎద్దడికి అక్రమనిర్మాణాలు కూడా కారణమనేచెప్పాలి. అందుబాటులోని సమాచారం ప్రకారం 26 లక్షల అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.

మిలియన్ల చదరపు అడుగుల నిర్మాణాలు

ఒక అధ్యయనం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 500 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ నిర్మాణాలున్నాయి. దీనికి కమర్షియల్ నిర్మాణాలు అదనం. సిటి డెవలప్మెంట్, నగరాల నిర్మాణం పేరుతో భూమిమొత్తాన్ని నిర్మాణాలతో నింపేస్తున్న కారణంగా వర్షాలు పడినా వర్షపునీరు భూమిలోకి ఇంకే మార్గాలు లేకుండా పోతున్నాయి. దీనివల్ల వర్షపునీరంతా కాలువల్లోకి లేదా రోడ్లపైకి వచ్చేస్తోంది. ఫలితంగా రోడ్లు, రోడ్లపైన నీరు వచ్చేయటం వల్ల ఇళ్ళు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. హైదరాబాద్ సిటిలో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే చెరువులు, కుంటలు, కాలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు పాలకుల మీదా ఉందని నీటి యాజమాన్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇపుడు గనుక మేల్కొనకపోతే సమీపభవిష్యత్తులోనే జనాలకు నీటి కటకటలు తప్పవంటున్నారు.

ఇదే విషయమై వాతావరణపై అధ్యయనాలు చేస్తున్న నిపుణుడు బలిజేపల్లి సుబ్బారావు ‘ఫెడరల్ తెలంగాణా’తో మాట్లాడుతు ప్రస్తుత పరిస్ధితులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. వాటర్ మేనేజ్మెంట్ లేకపోతే జనాలు చాలా సమస్యలను ఎదుర్కోక తప్పదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం, జనాభా నిష్పత్తి ప్రకారం చెరువులు, కుంటలు సుమారుగా వెయ్యికి పైగా ఉండాలన్నారు. కాని ఇపుడు 300 కూడా లేవన్నారు. ఉన్నవి కూడా చాలావరకు కబ్జా అయిపోతున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరిస్తే తప్ప నీటిఎద్దడిని ఎదుర్కోలేమన్నారు. ప్రతి ఇంటిలోను నీటిగుంటలు, ఇంకుడుగుంతలు చాలా అవసరమన్నారు. నగర ప్రణాళికలో లోపాలు, పాలకులు, జనాల నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్ధితికి కారణమని చెప్పారు.

కబ్జాలే ప్రధాన కారణమా ?

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఇపుడు బెంగుళూరు ప్రభుత్వం సిటీలోని 22 పెద్ద చెరువుల పునరుద్ధరణకు పూనుకుందన్నారు. అయితే ఇప్పటికే బెంగుళూరు సిటీకి జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందన్నారు. అవసరాలకు నీరు దొరకక జనాలు సిటీని వదిలి తమ సొంతూళ్ళకు వెళ్ళటం చాలా ఆందోళనకరమన్నారు. మానవ నాగరికత మొదలైందే నదుల దగ్గరన్న విషయాన్ని గుర్తుచేశారు. గ్రేటర్ పరిధిలో ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒక నీటికుంట, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్లకు ఒక నీటి కుంట, చెరువు ఉండాలన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలు, వర్షపునీటిని నిల్వచేసుకునేందుకు ఇంకుడుగుంతలు, బావులను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వర్షపునీటిలో 10 శాతం భూమిలోకి ఇంకకపోతే భూగర్భజలాలు పెరగవని చెప్పారు. భూగర్భజలాలు పెరిగిపోతే కాని వాటర్ రీఛార్జి కాదన్నారు. ఇవేవీ జరగకపోతే సమీపభవిష్యత్తులో హైదరాబాద్ మరో బెంగుళూరు అయిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

Read More
Next Story